8-197-క.
విస్మయముఁ బొంది దానవ
ఘస్మరుఁ డహిఫణము విడువఁ గైకొని యసురుల్
విస్మితముఖులై యార్చి ర
విస్మితముగఁ గొనిరి సురలు వీఁకం దోఁకన్.
8-198-వ.
ఇట్లు
సమాకర్షణస్థానభాగనిర్ణయంబు లేర్పఱచుకొని దేవతలు పుచ్ఛంబును; బూర్వదేవతలు ఫణంబులుం బట్టి పయోరాశి మధ్యంబునం బర్వతంబు
పెట్టి; పరమాయత్తచిత్తులై యమృతార్థంబు త్రచ్చుచున్న సమయంబున.
టీకా:
విస్మయంబున్ = ఆశ్ఛర్య;
పొంది = పోయి; దానవఘస్మరుడు = విష్ణువు {దానవఘస్మరుడు - దానవ (రాక్షసుల) ఘస్మరుడు
(నాశకుడు), విష్ణువు}; అహి = పాము;
ఫణమున్ = పడగను;
విడువన్ = వదిలిపెట్టగ;
కైకొని = చేపట్టి;
అసురుల్ = రాక్షసులు;
విస్మిత = మిక్కిలి నవ్వుతోకూడిన;
ముఖులు = మఖముగలవారు;
ఐ = అయ్యి; ఆర్చిరి = కేకలువేసిరి;
అవిస్మితముగన్ =
చిరునవ్వులులేకుండగ;
కొనిరి = తీసుకొనిరి;
సురలు = దేవతలు;
వీకన్ = ఉత్సాహముగ;
తోకన్ = తోకను.
ఇట్లు
= ఈ విధముగ; సమాకర్షణ =
లాగబడెడి; స్థాన = స్థానములను;
భాగ = పంచుకొనెడి;
నిర్ణయంబులు = నిర్ణయములు;
ఏర్పఱచుకొని = నియమించుకొని;
దేవతలు = దేవతలు;
పుచ్ఛంబును = తోకను;
పూర్వదేవతలు
= రాక్షసులు; ఫణంబులున్ = పడగలను;
పట్టి = పట్టుకొని;
పయోరాశి = సముద్రము;
మధ్యంబునన్
= మధ్యలో; పర్వతంబున్ = పర్వతమును;
పెట్టి = పెట్టి;
పరమ = మిక్కలి;
ఆయత్త =
లగ్నమైన; చిత్తులు = మనసుగలవారు;
ఐ = అయ్యి; అమృత = అమృతము;
అర్థంబున్ = కోసము;
త్రచ్చుచున్న = చిలుకుతున్న;
సమయంబునన్ = సమయము నండు.
భావము:
దానవాంతకుడు విష్ణు మూర్తి ఆశ్చర్యంతో వాసుకి పడగ విడిచిపెట్టాడు; రాక్షసులు గర్వంతో కూడిన ముఖాలతో కేకలు వేస్తూ పడగలు పట్టుకున్నారు; దేవతలు వినయంతో వాసుకి తోక పట్టుకున్నారు.
ఇలా
వరుసలు కట్టి లాగే స్థానాలను ఏర్పాటు చేసుకున్నారు. క్షీరసాగరం
మధ్యన మందర పర్వతాన్ని ఉంచి, దేవతలు నాగరాజు వాసుకి తోక భాగమూ, రాక్షసులు పడగల భాగమూ పట్టుకుని చిలుతున్నారు.
ఇంతలో . . .
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment