Saturday, June 18, 2016

క్షీరసాగరమథనం – స్వచ్ఛమైన ఫణంబు

8-195-మత్త.
స్వచ్ఛమైన ఫణంబు మీరలు క్కఁబట్టి మథింపఁగాఁ
బుచ్ఛ మేటికి మాకుఁ బట్టఁగఁబూరుషత్వము గల్గి మే
చ్ఛమైన తపోబలాధ్యయనాన్వయంబుల వారమై
యిచ్ఛయింతుమె తుచ్ఛవృత్తికినిండు మాకు ఫణాగ్రముల్ .
8-196-వ.
అని పలుకు దనుజులం జూచి.
టీకా:
          స్వచ్చమైన = నిర్మలమైన; ఫణంబున్ = పాముతలలు; మీరలు = మీరు; చక్కన్ = చక్కగా; పట్టి = పట్టుకొని; మథింపగాన్ = చిలుకుతుండగా; పుచ్ఛము = తోక; ఏటి = ఎందుల; కిన్ = కు; మా = మా; కున్ = కు; పట్టగన్ = పట్టుకొనుటకు; పూరుషత్వము = పౌరుషము; కల్గి = ఉండి; మేము = మేము; అచ్ఛము = స్వచ్ఛము; ఐన = అయిన; తపస్ = తపస్సు; బల = బలము; అధ్యయన = చదువు; అన్వయంబుల్ = వంశములు; వారము = కలవారము; ఐ = అయ్యి; ఇచ్చయింతుమె = ఒప్పుకొనెదమా ఏమి; తుచ్చ = నీచపు; వృత్తి = వర్తనల; కిన్ = కి; ఇండు = ఇవ్వండి; మా = మా; కున్ = కు; ఫణ = పడగల; అగ్రమున్ = కొసను.
          అని = అని; పలుకు = పలికెడు; దనుజులన్ = రాక్షసులను; చూచి = చూసి.
భావము:
            స్వచ్ఛమైన పడగలు మీరు పట్టుకొని చిలుకుతుంటే తుచ్ఛమైన తోకని మేం ఎందుకు పట్టుకోవాలి. మేము గొప్ప పౌరుషము, తపస్సు, చదువు, వంశము, బలము కలవాళ్ళం. అలాంటి మేం ఇలాంటి తుచ్ఛమైన పనికి ఒప్పుకోం. పడగలు మాకివ్వండి.
            ఇలా పాము పడగలు పట్టుకుంటాము అంటున్న రాక్షసులను చూసి.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: