Wednesday, June 8, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౬౨(562)

( శ్రుతదేవ జనకుల చరిత్రంబు ) 

10.2-1178-ఉ.
ఆ పురి నేలువాఁడు బహుళాశ్వుఁడు నా నుతి కెక్కినట్టి ధా
త్రీపతి యా ధరామరునిరీతిని నిష్కలుషాంతరంగుఁడై
యే పనులందు ధర్మగతి నేమఱఁ కర్థిఁ జరించుచుండె ల
క్ష్మీపతి వారిపైఁ గరుణఁ జేసి ప్రసన్నముఖాంబుజాతుఁడై.

భావము:
ఆ నగరానికి రాజు బహుళాశ్వుడనే నామాంతరంగల జనకుడు. అతడు శ్రుతదేవుని వలెనే నిర్మలాంతరంగుడై ఏపనిచేసినా ధర్మాన్ని విస్మరించకుండా జీవిస్తున్నాడు శ్రీకృష్ణునికి వారిద్దరిమీద అనుగ్రహం కలిగింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=82&Padyam=1178

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Tuesday, June 7, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౬౧(561)

( శ్రుతదేవ జనకుల చరిత్రంబు ) 

10.2-1177.1-తే.
నరనాథ! విను భువనప్రసిద్ధంబుగ-
  దీపించు నట్టి విదేహదేశ
మందు భూకాంతకు నాననదర్పణం-
  బనఁ దనర్చిన మిథి లను పురమునఁ
గలఁడు శ్రీహరిపాదకంజాత భక్తుండు,-
  గళితరాగాది వికారుఁ, డమల
చరితుఁ, డక్రోధుండు, శాంతుండు, నిగమార్థ-
  కోవిదుం, డగు శ్రుతదేవుఁ డనెడి
10.2-1177.1-తే.
భూసురోత్తముఁ డొకఁ డనిచ్ఛాసమాగ
తంబు తుషమైన హేమ శైలంబు గాఁగఁ
దలఁచి పరితోష మందుచుఁ దగ గృహస్థ
ధర్మమున నుండె సముచితకర్ముఁ డగుచు.

భావము:
“ఓ మహారాజా! మిథిలానగరం లోకప్రసిద్ధమైన విదేహదేశంలో భూదేవి ముఖానికి తళుకుటద్దంవలె ఉంటుంది. ఆ నగరంలో శ్రుతదేవుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు గొప్ప హరిభక్తుడు; రాగాది వికారాలు లేనివాడు; వినిర్మలచరిత్రుడు; కోపము లేని పూర్తి శాంత స్వభావుడు; వేదార్థాలు తెలిసినవాడు; అతడు తనంత తానుగా ప్రాప్తించింది లేశమైనా దాన్ని మేరుపర్వత మంతగా భావించి సంతృప్తి చెందేవాడు. శ్రుతదేవుడు నిత్యమూ విద్యుక్తకర్మలను నిర్వహిస్తూ గృహస్థధర్మాన్ని పాలిస్తూ ఉండేవాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=82&Padyam=1177

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Monday, June 6, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౬౦(560)

( సుభద్రా పరిణయంబు ) 

10.2-1175-క.
కరులం దేరుల నుత్తమ
హరులన్ మణి హేమభూషణాంబరభృత్యో
త్కర దాసికాజనంబుల
నరణంబుగ నిచ్చి పంపె ననుజకుఁ బ్రీతిన్.
10.2-1176-వ.
ఇట్లు కృష్ణున కభిమతంబుగా నర్జునసుభద్రల కరణంబిచ్చి పంపె" నని చెప్పి శుకయోగీంద్రుండు మఱియు నిట్లనియె.

భావము:
ప్రీతిగా బలరాముడు అరణంగా ఏనుగులు, రథాలు, మేలుజాతి అశ్వాలు, వస్త్రాలు, రత్నాభరణాలు, బంగారు భూషణాలు, దాసదాసీజనాలు సుభద్రకు పంపాడు. ఈ విధంగా బలరాముడు శ్రీకృష్ణుని అభిలాష ప్రకారం సుభద్రార్జునులకు అరణం ఇచ్చి పంపాడు.” అని చెప్పి శుకమహర్షి పరీక్షుత్తుతో మరల ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=81&Padyam=1175

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Sunday, June 5, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౫౯(559)

( సుభద్రా పరిణయంబు ) 

10.2-1174-వ.
అప్పుడు డాయం జని యరదంబుపై నిడుకొని పోవుచుండం గనుంగొని యదుబలంబులు మదంబున నంటం దాఁకిన, నప్పు డయ్యాఖండలనందనుండు ప్రచండగాండీవ కోదండ నిర్ముక్త కాండంబులం దూలించి, యఖండ బాహుదండ విజయప్రకాండుండై ఖాండవప్రస్థపురంబున కరిగె; నట బలభద్రుండవ్వార్త విని విలయ సమయ సమీరసఖునికైవడిం బటురోష భీషణాకారుండై క్రోధించినం గని కృష్ణుండాదిగాఁగల బంధుజనంబు లతని చరణంబులకుం బ్రణమిల్లి మృదుమధుర భాషణంబుల ననునయించి యొడంబడునట్లుగా నాడిన నతండును సంతుష్టుండయి మనంబునఁ గలంకదేఱి, యప్పుడు.

భావము:
అలా చూసిన అర్జునుడు సుభద్ర దగ్గరకు వెళ్ళి ఆమెను రథంమీద కూర్చుండ బెట్టుకుని తీసుకుని పోసాగాడు. అది చూసిన యదుశూరులు అతడిని ఎదుర్కున్నారు. ఇంద్రతనయుడు తన గాండీవాన్ని ఎక్కుపెట్టి భీకర శర పరంపరలతో వారిని నిరోధించి, ఇంద్రప్రస్థానికి చేరుకున్నాడు. ఈ వార్త వినిన బలరాముడు ప్రళయకాల అగ్నిహోత్రుడిలా ఆగ్రహోదగ్రుడై మండిపడ్డాడు. శ్రీకృష్ణుడు మొదలైన బంధువులు అతని పాదాలకు నమస్కరించి, మృదుమధుర వచనాలతో సుభద్రార్జునుల పరిణయానికి అంగీకరించేలా అనునయించారు. దాంతో బలరాముడు కోపం వదలి ప్రసన్ను డయ్యాడు. పిమ్మట...

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=81&Padyam=1174

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Friday, June 3, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౫౮(558)

( సుభద్రా పరిణయంబు ) 

10.2-1173-సీ.
సాంద్రశరచ్చంద్ర చంద్రికా స్ఫూర్తిచే-
  రాజిల్లు పూర్ణిమారజనివోలెఁ,
బూర్ణేందు బింబావతీర్ణమై యిలమీఁద-
  భాసిల్లు హరిణ డింభంబుఁ బోలె,
సులలిత మేఘమండలమును నెడఁబాసి-
  వసుధఁ గ్రుమ్మరు తటిద్వల్లి వోలె,
మాణిక్య రచిత సన్మహిత చైతన్యంబు-
  వొందిన పుత్తడిబొమ్మ వోలె.
10.2-1173.1-తే.
లలిత విభ్రమ రుచి కళాలక్షణములఁ
బొసఁగ రూపైన శృంగారరసముఁ బోలె,
నర్థిఁ జరియించుచున్న పద్మాయతాక్షిఁ
బ్రకటసద్గుణభద్ర సుభద్రఁ జూచి.

భావము:
శరత్కాలంలో పండువెన్నెలతో నిండి ఉన్న పున్నమరాత్రి వలె; నిండు చంద్రబింబం నుంచి నేలకు దిగివచ్చిన లేడిపిల్ల తెఱంగున; మేఘమండలాన్ని వదలి మేదినిమీద విహరించే మెఱపుతీగ చందాన; నవరత్న దీప్తులతో నూతన చైతన్యం సంతరించుకున్న బంగారు బొమ్మ రూపున; హావభావవిలాసాలతో రూపుదాల్చిన శృంగారరసాన్ని పోలి; పద్మాల వంటి విశాలమైన నయనాలతో విహరిస్తున్న చూడచక్కని సుగుణాలరాశి సుభద్రను అర్జునుడు చూసాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=81&Padyam=1173

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Thursday, June 2, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౫౭(557)

( సుభద్రా పరిణయంబు ) 

10.2-1172-వ.
అట్లా నృపసత్తమ మత్తకాశినులొండొరుల చిత్తంబులు చిత్తజాయత్తంబులై కోర్కులు దత్తరింపం దాల్ములువీడ సిగ్గునం జిట్టుముట్టాడుచున్నయంత నొక్కనాఁడు దేవతామహోత్సవ నిమిత్తం బత్తలోదరి పురంబు వెలుపలికి నరుగుదెంచిన నర్జునుండు గృష్ణ దేవకీ వసుదేవుల యనుమతంబు వడసి తోడనం దానును చని యప్పుడు.

భావము:
ఈ విధంగా సుభద్రార్జునులు పరస్పరం ప్రగాఢంగా ప్రేమించుకున్నారు. అనురాగాలు అతిశయించి ఆపుకోలేని హృదయాలతో క్రిందుమీదవుతున్నారు. ఇలా ఉండగా, ఒకనాడు దేవతామహోత్సవానికి సుభద్ర నగరం వెలుపలికి వచ్చింది. కృష్ణుడు, దేవకీవసుదేవుల అనుమతి పొంది అర్జునుడు సుభద్ర వెనుక వెళ్ళాడు. అప్పుడు.....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=81&Padyam=1172

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Wednesday, June 1, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౫౬(556)

( సుభద్రా పరిణయంబు ) 

10.2-1170-చ.
జలరుహపత్త్రనేత్రు ననుసంభవ చారువధూలలామ స
ల్లలితవిహారవిభ్రమవిలాసము లాత్మకు విందు సేయ న
బ్బలరిపునందనుండు గని భావజసాయకబాధ్యమాన వి
హ్వలహృదయాబ్జుఁడై నిలిపె నత్తరుణీమణియందుఁ జిత్తమున్.
10.2-1171-ఉ.
ఆ తరుణీశిరోమణియు నర్జును, నర్జునచారుకీర్తి వి
ఖ్యాతుని, నింద్రనందను, నకల్మషమానసుఁ, గామినీ మనో
జాతునిఁ జూచి పుష్పశర సాయకజర్జరితాంతరంగయై
భీతిలి యుండె సిగ్గు మురిపెంబును మోహముఁదేఱు చూపులన్.

భావము:
పద్మాక్షుడు శ్రీకృష్ణుడి చెల్లెలైన సుభద్ర బహు అందమైనది. ఆమె సుందర సుకుమార వయో రూప విలాసాలు తన చిత్తానికి హత్తుకోగా, ఆ ఇంద్రతనయుడు అర్జునుడు మన్మథబాణాలకు గురై ఆమెపై మనసులో మిక్కిలి ఇష్టపడ్డాడు. దేవేంద్ర తనయుడు; స్వచ్ఛమైన యశోవిరాజితుడూ; నిర్మలహృదయుడూ; మానినీ మనోహరుడు; అయిన అర్జునుడిని చూసి సుభద్ర మరుని శరపరంపరకు లోనై కలవరపడింది. సిగ్గూ మురిపెమూ మోహమూ ఎక్కువ అయి ఆ తరుణీమణి చూపులలో ప్రతిఫలిస్తున్నాయి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=81&Padyam=1171

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :