Wednesday, June 1, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౫౬(556)

( సుభద్రా పరిణయంబు ) 

10.2-1170-చ.
జలరుహపత్త్రనేత్రు ననుసంభవ చారువధూలలామ స
ల్లలితవిహారవిభ్రమవిలాసము లాత్మకు విందు సేయ న
బ్బలరిపునందనుండు గని భావజసాయకబాధ్యమాన వి
హ్వలహృదయాబ్జుఁడై నిలిపె నత్తరుణీమణియందుఁ జిత్తమున్.
10.2-1171-ఉ.
ఆ తరుణీశిరోమణియు నర్జును, నర్జునచారుకీర్తి వి
ఖ్యాతుని, నింద్రనందను, నకల్మషమానసుఁ, గామినీ మనో
జాతునిఁ జూచి పుష్పశర సాయకజర్జరితాంతరంగయై
భీతిలి యుండె సిగ్గు మురిపెంబును మోహముఁదేఱు చూపులన్.

భావము:
పద్మాక్షుడు శ్రీకృష్ణుడి చెల్లెలైన సుభద్ర బహు అందమైనది. ఆమె సుందర సుకుమార వయో రూప విలాసాలు తన చిత్తానికి హత్తుకోగా, ఆ ఇంద్రతనయుడు అర్జునుడు మన్మథబాణాలకు గురై ఆమెపై మనసులో మిక్కిలి ఇష్టపడ్డాడు. దేవేంద్ర తనయుడు; స్వచ్ఛమైన యశోవిరాజితుడూ; నిర్మలహృదయుడూ; మానినీ మనోహరుడు; అయిన అర్జునుడిని చూసి సుభద్ర మరుని శరపరంపరకు లోనై కలవరపడింది. సిగ్గూ మురిపెమూ మోహమూ ఎక్కువ అయి ఆ తరుణీమణి చూపులలో ప్రతిఫలిస్తున్నాయి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=81&Padyam=1171

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

No comments: