10.2-1174-వ.
అప్పుడు డాయం జని యరదంబుపై నిడుకొని పోవుచుండం గనుంగొని యదుబలంబులు మదంబున నంటం దాఁకిన, నప్పు డయ్యాఖండలనందనుండు ప్రచండగాండీవ కోదండ నిర్ముక్త కాండంబులం దూలించి, యఖండ బాహుదండ విజయప్రకాండుండై ఖాండవప్రస్థపురంబున కరిగె; నట బలభద్రుండవ్వార్త విని విలయ సమయ సమీరసఖునికైవడిం బటురోష భీషణాకారుండై క్రోధించినం గని కృష్ణుండాదిగాఁగల బంధుజనంబు లతని చరణంబులకుం బ్రణమిల్లి మృదుమధుర భాషణంబుల ననునయించి యొడంబడునట్లుగా నాడిన నతండును సంతుష్టుండయి మనంబునఁ గలంకదేఱి, యప్పుడు.
భావము:
అలా చూసిన అర్జునుడు సుభద్ర దగ్గరకు వెళ్ళి ఆమెను రథంమీద కూర్చుండ బెట్టుకుని తీసుకుని పోసాగాడు. అది చూసిన యదుశూరులు అతడిని ఎదుర్కున్నారు. ఇంద్రతనయుడు తన గాండీవాన్ని ఎక్కుపెట్టి భీకర శర పరంపరలతో వారిని నిరోధించి, ఇంద్రప్రస్థానికి చేరుకున్నాడు. ఈ వార్త వినిన బలరాముడు ప్రళయకాల అగ్నిహోత్రుడిలా ఆగ్రహోదగ్రుడై మండిపడ్డాడు. శ్రీకృష్ణుడు మొదలైన బంధువులు అతని పాదాలకు నమస్కరించి, మృదుమధుర వచనాలతో సుభద్రార్జునుల పరిణయానికి అంగీకరించేలా అనునయించారు. దాంతో బలరాముడు కోపం వదలి ప్రసన్ను డయ్యాడు. పిమ్మట...
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=81&Padyam=1174
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
: : భాగవతం చదువుకుందాం : :
No comments:
Post a Comment