( సుభద్రా పరిణయంబు )
10.2-1173-సీ.
సాంద్రశరచ్చంద్ర చంద్రికా స్ఫూర్తిచే-
రాజిల్లు పూర్ణిమారజనివోలెఁ,
బూర్ణేందు బింబావతీర్ణమై యిలమీఁద-
భాసిల్లు హరిణ డింభంబుఁ బోలె,
సులలిత మేఘమండలమును నెడఁబాసి-
వసుధఁ గ్రుమ్మరు తటిద్వల్లి వోలె,
మాణిక్య రచిత సన్మహిత చైతన్యంబు-
వొందిన పుత్తడిబొమ్మ వోలె.
10.2-1173.1-తే.
లలిత విభ్రమ రుచి కళాలక్షణములఁ
బొసఁగ రూపైన శృంగారరసముఁ బోలె,
నర్థిఁ జరియించుచున్న పద్మాయతాక్షిఁ
బ్రకటసద్గుణభద్ర సుభద్రఁ జూచి.
భావము:
శరత్కాలంలో పండువెన్నెలతో నిండి ఉన్న పున్నమరాత్రి వలె; నిండు చంద్రబింబం నుంచి నేలకు దిగివచ్చిన లేడిపిల్ల తెఱంగున; మేఘమండలాన్ని వదలి మేదినిమీద విహరించే మెఱపుతీగ చందాన; నవరత్న దీప్తులతో నూతన చైతన్యం సంతరించుకున్న బంగారు బొమ్మ రూపున; హావభావవిలాసాలతో రూపుదాల్చిన శృంగారరసాన్ని పోలి; పద్మాల వంటి విశాలమైన నయనాలతో విహరిస్తున్న చూడచక్కని సుగుణాలరాశి సుభద్రను అర్జునుడు చూసాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=81&Padyam=1173
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
No comments:
Post a Comment