Monday, June 22, 2020

ఉషా పరిణయం - 25

( చిత్రరేఖ అనిరుద్ధుని దెచ్చుట )

10.2-375-క.
ఆ చిన్నె లంగజాలలు
సూచి భయాకులత నొంది స్రుక్కుచుఁ దమలో
"నో చెల్ల! యెట్టులో? యీ
రా చూలికిఁ జూలు నిలిచెరా! యిబ్భంగిన్.'
10.2-376-క.
అని గుజగుజ వోవుచు ని
ప్పని దప్పక దనుజలోక పాలునితోడన్
వినిపింపవలయు నని వే
చని బాణునిఁ జేరి మ్రొక్కి సద్వినయమునన్.
10.2-377-క.
మంతనమున "దేవర! క
న్యాంతఃపుర మేము గాచి యరయుచు నుండన్
వింతజనములకుఁ జొరఁగ దు
రంతము విను పోతుటీఁగకైన సురారీ!

భావము:
ఆ బాల గర్భచిహ్నాలను చూసి అంతఃపుర కంచుకలు భయపడ్డారు. (కాపలా సరిగా లేదని మహారాజు ఆగ్రహించవచ్చు కనుక.) “అయ్యబాబోయ్! మన రాకుమారి గర్భం ధరించింది. ఇప్పుడు మనం ఏం చేయాలి” అనుకుంటూ లోలోపల మధనపడ్డారు. ఇలా గుసగుసలాడుకుని ఈ విషయం బాణాసురుడికి చెప్పక తప్పదు అని నిశ్చయించుకున్నారు. వెంటనే వెళ్ళి దానవేశ్వరుడితో వినయంగా ఈ విధంగా విన్నవించుకున్నారు. “ఓ ప్రభూ! దానవేంద్రా! కుమారి అంతఃపురాన్ని మేము జాగరూకతతో కావలికాస్తూ ఉండగా, పోతుటీగ అయినా లోపలికి వెళ్ళడం కష్ట సాధ్యమే.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=34&padyam=377

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

ఉషా పరిణయం - 24


( చిత్రరేఖ అనిరుద్ధుని దెచ్చుట )

10.2-373-వ.
ఇవ్విధంబున నతిమనోహర విభవాభిరామంబులగు దివ్యాంబరాభరణ మల్యానులేపనంబులను, గర్పూర తాంబూలంబులను, వివిధాన్నపానంబులను, సురుచిర మణిదీప నీరాజనంబులను, సుగంధబంధురాగరుధూపంబులను, నాటపాటల వీణావినోదంబులను, బరితుష్టిం బొంది కన్యాకుమారకు లానంద సాగరాంత ర్నిమగ్నమానసులై యుదయాస్తమయ నిరూపణంబుసేయనేరక, ప్రాణంబు లొక్కటియైన తలంపులం గదిసి యిష్టోపభోగంబుల సుఖియించుచుండి; రంత.
10.2-374-క.
ఆలోనన నతిచిర మగు
కాలము సుఖలీల జరుగఁగా వరుస నుషా
బాలాలలామ కొయ్యనఁ
జూ లేర్పడి గర్భ మొదవె సురుచిరభంగిన్.

భావము:
ఆ విధంగా అత్యంత మనోహరములు వైభవోపేతములు అయిన వస్త్రాభరణాలు, పూలదండలు, మైపూతలు, కర్పూరతాంబూలాలు, రకరకాల అన్నపానాలు, ఆటపాటలు, వీణావినోదములు, అగరధూపాలు, మణిదీపాలు మొదలైన సౌఖ్యాలతో ఉషా అనిరుద్ధులు ఆనందసాగరంలో మునిగితేలారు. వారికి సూర్యోదయాస్తమయాలు తెలియడం లేదు. శరీరాలు వేరైనా ప్రాణం ఒకటిగా ఇష్టభోగాలతో సుఖించారు. ఇలా ఆ యువతీయువకులు సుఖాలలో ఓలలాడుతూ గడుపుతూ ఉన్నారు. ఇంతలో కొద్దికాలమునకు ఉషాబాల గర్భం ధరించింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=34&padyam=374

: :  భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Tuesday, June 16, 2020

ఉషా పరిణయం - 23

( చిత్రరేఖ అనిరుద్ధుని దెచ్చుట )

10.2-371-వ.
అని వినుతించి చిత్రరేఖను నిజమందిరమునకుఁబోవం బనిచినం జనియె; ననంతరంబ వింతజనులకెవ్వరికింబ్రవేశింపరాని యంతఃపుర సౌధాంతరంబున ననిరుద్ధుండు మేల్కని యయ్యింతిం గనుంగొని, యప్పుడు.
10.2-372-క.
సురుచిర మృదుతల్పంబునఁ
బరిరంభణ సరసవచన భావకళా చా
తురి మెఱయ రాకుమారుఁడు
తరుణీమణిఁ బొందె మదనతంత్రజ్ఞుండై.

భావము:
ఈలాగున కొనియాడిన ఉషాబాల చిత్రరేఖను తన ఇంటికి పోవ సాగనంపింది. పరపురుషులు ప్రవేశింపరాని ఆ అంతఃపురములో అనిరుద్ధుడు నిద్రమేల్కొని ఆ ఉషాసుందరిని కనుగొన్నాడు. అంతట అలా మేల్కొన్న అనిరుద్ధుడు ఆ అందమైన మృదుతల్పము మీద కౌగిలింతలతో సరస సల్లాపములతో ఉషాసుందరిని ఉత్సాహపరుస్తూ శృంగారలీలా విలాసములలో ఓలలాడాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=34&padyam=372

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

ఉషా పరిణయం - 22


( చిత్రరేఖ అనిరుద్ధుని దెచ్చుట )

10.2-370-సీ.
"అతివ! నీ సాంగత్య మను భానురుచి నాకుఁ;
గలుగుటఁ గామాంధకార మడఁగెఁ
దరలాక్షి! నీ సఖిత్వం బను నావచేఁ;
గడిఁది వియోగాబ్ధిఁ గడవఁ గంటి
నబల! నీ యనుబంధ మను సుధావృష్టిచే;
నంగజ సంతాప మార్పఁ గంటి
వనిత! నీ చెలితనం బను రసాంజనముచే;
నా మనోహర నిధానంబుఁ గంటిఁ
10.2-370.1-తే.
గలలఁ దోఁచిన రూపు గ్రక్కన లిఖించు
వారు, నౌ నన్నఁ దోడ్తెచ్చు వారు గలరె?
నీటిలో జాడఁ బుట్టించు నేర్పు నీక
కాక గల్గునె మూఁడు లోకములయందు? "

భావము:
“చెలీ! నీ సాంగత్యం అనే సూర్యకాంతి లభించటం వలన నా కామాంధకారం పటాపంచలైపోయింది. సుందరీ! నీ స్నేహం అనే నావ వలన వియోగ సాగరాన్ని దాటగలిగాను. సఖీ! నీ అనుబంధం అనే అమృతవర్షంతో మన్మథతాపం చల్లార్చుకొన గలుగుతున్నాను. మానినీ! నీ మైత్రి అనే అంజనంతో మనోహరుడనే నిధిని చూడ గలుగుతూ ఉన్నాను. కలలో కనిపించిన వానిని చిత్రపటంలో గీసి చూపేవారు ఉండవచ్చేమో కానీ, అవును అనగానే వానిని తీసుకువచ్చే వారు ఎవరైనా ఉంటారా? నీవు అంటే నీటిలో జాడలు తీయగల నేర్పుకలదానివి. ఈ ముల్లోకాలలో నిన్ను మించినవారు ఎవరూ లేరు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=34&padyam=370

: :  భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Saturday, June 13, 2020

ఉషా పరిణయం - 21

( చిత్రరేఖ అనిరుద్ధుని దెచ్చుట )

10.2-368-క.
అనిన నుషాసతి దన మన
మున ననురాగిల్లి మేనఁ బులకాంకురముల్‌
మొనయఁగ నానందాశ్రులు
గనుఁగవ జడి గురియ ముఖవికాస మెలర్పన్.
10.2-369-వ.
ఇట్లు మనంబున నుత్సహించి చిత్రరేఖం గనుంగొని యయ్యింతి యిట్లనియె.

భావము:
ఆమె అన్నది వినగానే, అనురాగంతో ఉషాకన్య తనువు పులకించింది. ఆనందాశ్రువులు కనుగవ నుంచిజాలువారాయి. ముఖకమలం వికసించింది. ఈలాగున అంతరంగంలో ఆనందం పొరలిపొరలగా ఉషాబాల చిత్రరేఖతో ఇలా అన్నది

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=34&padyam=368

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

ఉషా పరిణయం - 20

( చిత్రరేఖ అనిరుద్ధుని దెచ్చుట )

10.2-366-వ.
కని డాయం జని, తదీయ సుషమావిశేషంబులకుం బరితోషంబు నొందుచుం, గామినీచరణ రణితమణినూపుర ఝణంఝణధ్వనిత మణిగోపురంబును, నతి విభవ విజితగోపురంబునునగు ద్వారకాపురంబు నిశాసమయంబునం బ్రచ్ఛన్నవేషంబునం జొచ్చి; కనకకుంభకలితసౌధాగ్రంబున మణిదీపనిచయంబు ప్రకాశింపఁ, జంద్ర కాంత శిలాభవనంబున సుధాధామ రుచిరరుచి నిచయంబు నపహసించు హంసతూలికాతల్పంబున నిజాంగనా రతిశ్రమంబున నిద్రాసక్తుండై యున్న యనిరుద్ధుం జేరి, తన యోగవిద్యా మహత్త్త్వంబున నతని నెత్తుకొని, మనోవేగంబున శోణపురంబునకుం జని, బాణాసురనందనయగు నుషాసుందరి తల్పంబునం దునిచి యిట్లనియె.
10.2-367-క.
"వనజాక్షి! చూడు నీ విభు,
ననిమిషనగధీరు, శూరు, నభినవమారున్
వనధి గభీరు, నుదారుని,
ననిరుద్ధకుమారు, విదళితాహితవీరున్. "

భావము:
చిత్రరేఖ ఆ పట్టణ సౌందర్యానికి సంతోషించింది. రాత్రి సమయంలో మారువేషంలో ద్వారకలో ప్రవేశించింది. స్త్రీల మణిమంజీరాలతో మారుమ్రోగే సౌధాలతో స్వర్గాన్ని తిరస్కరించే ఆ ద్వారకాపట్టణంలో, బంగారు కుంభాలతో గూడిన రాజప్రాసాదం మీద, మణిదీపాలతో ప్రకాశిస్తున్న చంద్రకాంత శిలాభవనంలో, చంద్రకాంతిని ధిక్కరించే హంసతూలికాతల్పం మీద సురతశ్రమవలన నిద్రిస్తున్న అనిరుద్ధుడి చెంతకు చేరింది. తన యోగవిద్యా నైపుణ్యంతో అతడిని ఎత్తుకుని మనోవేగంతో శోణపురం వచ్చింది. వచ్చి ఆ బాణాసురుని కుమార్తె ఉషాసుందరి పాన్పు మీద అనిరుద్ధుడిని పరుండ బెట్టింది. అలా చేసి ఉషాబాలతో చిత్రరేఖ ఇలా పలికింది. “ఓ కమలాక్షీ! ఇదిగో చూడు మేరునగధీరుడూ; రణశూరుడూ; నవమన్మథాకారుడూ; సముద్రగంభీరుడూ; ఉదారుడూ; శత్రుసంహారుడూ అయిన నీ హృదయచోరుడు అనిరుద్ధ కుమారుడు ఇడిగో.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=34&padyam=367

: :  భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Tuesday, June 9, 2020

ఉషా పరిణయం - 19

( చిత్రరేఖ అనిరుద్ధుని దెచ్చుట )

10.2-364-వ.
అని చెప్పి “యే నతిత్వరితగతిం జని యక్కుమారరత్నంబుఁ దొడ్కొనివచ్చు నంతకు సంతాపింపకుండు” మని యా క్షణంబ వియద్గమనంబునం జని ముందట.
10.2-365-క.
సరసిజముఖి గనుఁగొనె శుభ
భరిత విలోకన విధూత భవ వేదనముం
బరసాధనమును సుకృత
స్ఫురణాపాదనముఁ గృష్ణు పుటభేదనమున్.

భావము:
చిత్రరేఖ ఇలా చెప్పి, “నేను వెంటనే వేగంగా వెళ్ళి ఈ కుమారరత్నాన్ని తీసుకుని వస్తాను. అంతవరకూ నీవు విచారించకుండా ఉండు.” అని ఆ క్షణంలోనే ఆకాశమార్గాన బయలుదేరి ముందుకు వెళ్ళి ఆ చిత్రరేఖ అలా ఆకాశగమనంలో వెళ్ళి, ఇహలోక దుఃఖాన్ని పోగొట్టగలదీ, పరలోకాన్ని సాధించడానికి తోడ్పడగలదీ, పుణ్యాలపుట్ట అయిన శ్రీకృష్ణుడి పట్టణం ద్వారకను దర్శించింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=34&padyam=365

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :