Monday, June 22, 2020

ఉషా పరిణయం - 24


( చిత్రరేఖ అనిరుద్ధుని దెచ్చుట )

10.2-373-వ.
ఇవ్విధంబున నతిమనోహర విభవాభిరామంబులగు దివ్యాంబరాభరణ మల్యానులేపనంబులను, గర్పూర తాంబూలంబులను, వివిధాన్నపానంబులను, సురుచిర మణిదీప నీరాజనంబులను, సుగంధబంధురాగరుధూపంబులను, నాటపాటల వీణావినోదంబులను, బరితుష్టిం బొంది కన్యాకుమారకు లానంద సాగరాంత ర్నిమగ్నమానసులై యుదయాస్తమయ నిరూపణంబుసేయనేరక, ప్రాణంబు లొక్కటియైన తలంపులం గదిసి యిష్టోపభోగంబుల సుఖియించుచుండి; రంత.
10.2-374-క.
ఆలోనన నతిచిర మగు
కాలము సుఖలీల జరుగఁగా వరుస నుషా
బాలాలలామ కొయ్యనఁ
జూ లేర్పడి గర్భ మొదవె సురుచిరభంగిన్.

భావము:
ఆ విధంగా అత్యంత మనోహరములు వైభవోపేతములు అయిన వస్త్రాభరణాలు, పూలదండలు, మైపూతలు, కర్పూరతాంబూలాలు, రకరకాల అన్నపానాలు, ఆటపాటలు, వీణావినోదములు, అగరధూపాలు, మణిదీపాలు మొదలైన సౌఖ్యాలతో ఉషా అనిరుద్ధులు ఆనందసాగరంలో మునిగితేలారు. వారికి సూర్యోదయాస్తమయాలు తెలియడం లేదు. శరీరాలు వేరైనా ప్రాణం ఒకటిగా ఇష్టభోగాలతో సుఖించారు. ఇలా ఆ యువతీయువకులు సుఖాలలో ఓలలాడుతూ గడుపుతూ ఉన్నారు. ఇంతలో కొద్దికాలమునకు ఉషాబాల గర్భం ధరించింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=34&padyam=374

: :  భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: