( చిత్రరేఖ అనిరుద్ధుని దెచ్చుట )
10.2-366-వ.
కని డాయం జని, తదీయ సుషమావిశేషంబులకుం బరితోషంబు నొందుచుం, గామినీచరణ రణితమణినూపుర ఝణంఝణధ్వనిత మణిగోపురంబును, నతి విభవ విజితగోపురంబునునగు ద్వారకాపురంబు నిశాసమయంబునం బ్రచ్ఛన్నవేషంబునం జొచ్చి; కనకకుంభకలితసౌధాగ్రంబున మణిదీపనిచయంబు ప్రకాశింపఁ, జంద్ర కాంత శిలాభవనంబున సుధాధామ రుచిరరుచి నిచయంబు నపహసించు హంసతూలికాతల్పంబున నిజాంగనా రతిశ్రమంబున నిద్రాసక్తుండై యున్న యనిరుద్ధుం జేరి, తన యోగవిద్యా మహత్త్త్వంబున నతని నెత్తుకొని, మనోవేగంబున శోణపురంబునకుం జని, బాణాసురనందనయగు నుషాసుందరి తల్పంబునం దునిచి యిట్లనియె.
10.2-367-క.
"వనజాక్షి! చూడు నీ విభు,
ననిమిషనగధీరు, శూరు, నభినవమారున్
వనధి గభీరు, నుదారుని,
ననిరుద్ధకుమారు, విదళితాహితవీరున్. "
భావము:
చిత్రరేఖ ఆ పట్టణ సౌందర్యానికి సంతోషించింది. రాత్రి సమయంలో మారువేషంలో ద్వారకలో ప్రవేశించింది. స్త్రీల మణిమంజీరాలతో మారుమ్రోగే సౌధాలతో స్వర్గాన్ని తిరస్కరించే ఆ ద్వారకాపట్టణంలో, బంగారు కుంభాలతో గూడిన రాజప్రాసాదం మీద, మణిదీపాలతో ప్రకాశిస్తున్న చంద్రకాంత శిలాభవనంలో, చంద్రకాంతిని ధిక్కరించే హంసతూలికాతల్పం మీద సురతశ్రమవలన నిద్రిస్తున్న అనిరుద్ధుడి చెంతకు చేరింది. తన యోగవిద్యా నైపుణ్యంతో అతడిని ఎత్తుకుని మనోవేగంతో శోణపురం వచ్చింది. వచ్చి ఆ బాణాసురుని కుమార్తె ఉషాసుందరి పాన్పు మీద అనిరుద్ధుడిని పరుండ బెట్టింది. అలా చేసి ఉషాబాలతో చిత్రరేఖ ఇలా పలికింది. “ఓ కమలాక్షీ! ఇదిగో చూడు మేరునగధీరుడూ; రణశూరుడూ; నవమన్మథాకారుడూ; సముద్రగంభీరుడూ; ఉదారుడూ; శత్రుసంహారుడూ అయిన నీ హృదయచోరుడు అనిరుద్ధ కుమారుడు ఇడిగో.”
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=34&padyam=367
: : భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
No comments:
Post a Comment