( చిత్రరేఖ అనిరుద్ధుని దెచ్చుట )
10.2-375-క.
ఆ చిన్నె లంగజాలలు
సూచి భయాకులత నొంది స్రుక్కుచుఁ దమలో
"నో చెల్ల! యెట్టులో? యీ
రా చూలికిఁ జూలు నిలిచెరా! యిబ్భంగిన్.'
10.2-376-క.
అని గుజగుజ వోవుచు ని
ప్పని దప్పక దనుజలోక పాలునితోడన్
వినిపింపవలయు నని వే
చని బాణునిఁ జేరి మ్రొక్కి సద్వినయమునన్.
10.2-377-క.
మంతనమున "దేవర! క
న్యాంతఃపుర మేము గాచి యరయుచు నుండన్
వింతజనములకుఁ జొరఁగ దు
రంతము విను పోతుటీఁగకైన సురారీ!
భావము:
ఆ బాల గర్భచిహ్నాలను చూసి అంతఃపుర కంచుకలు భయపడ్డారు. (కాపలా సరిగా లేదని మహారాజు ఆగ్రహించవచ్చు కనుక.) “అయ్యబాబోయ్! మన రాకుమారి గర్భం ధరించింది. ఇప్పుడు మనం ఏం చేయాలి” అనుకుంటూ లోలోపల మధనపడ్డారు. ఇలా గుసగుసలాడుకుని ఈ విషయం బాణాసురుడికి చెప్పక తప్పదు అని నిశ్చయించుకున్నారు. వెంటనే వెళ్ళి దానవేశ్వరుడితో వినయంగా ఈ విధంగా విన్నవించుకున్నారు. “ఓ ప్రభూ! దానవేంద్రా! కుమారి అంతఃపురాన్ని మేము జాగరూకతతో కావలికాస్తూ ఉండగా, పోతుటీగ అయినా లోపలికి వెళ్ళడం కష్ట సాధ్యమే.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=34&padyam=377
: : భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
No comments:
Post a Comment