Tuesday, June 16, 2020

ఉషా పరిణయం - 23

( చిత్రరేఖ అనిరుద్ధుని దెచ్చుట )

10.2-371-వ.
అని వినుతించి చిత్రరేఖను నిజమందిరమునకుఁబోవం బనిచినం జనియె; ననంతరంబ వింతజనులకెవ్వరికింబ్రవేశింపరాని యంతఃపుర సౌధాంతరంబున ననిరుద్ధుండు మేల్కని యయ్యింతిం గనుంగొని, యప్పుడు.
10.2-372-క.
సురుచిర మృదుతల్పంబునఁ
బరిరంభణ సరసవచన భావకళా చా
తురి మెఱయ రాకుమారుఁడు
తరుణీమణిఁ బొందె మదనతంత్రజ్ఞుండై.

భావము:
ఈలాగున కొనియాడిన ఉషాబాల చిత్రరేఖను తన ఇంటికి పోవ సాగనంపింది. పరపురుషులు ప్రవేశింపరాని ఆ అంతఃపురములో అనిరుద్ధుడు నిద్రమేల్కొని ఆ ఉషాసుందరిని కనుగొన్నాడు. అంతట అలా మేల్కొన్న అనిరుద్ధుడు ఆ అందమైన మృదుతల్పము మీద కౌగిలింతలతో సరస సల్లాపములతో ఉషాసుందరిని ఉత్సాహపరుస్తూ శృంగారలీలా విలాసములలో ఓలలాడాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=34&padyam=372

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: