Tuesday, June 16, 2020

ఉషా పరిణయం - 22


( చిత్రరేఖ అనిరుద్ధుని దెచ్చుట )

10.2-370-సీ.
"అతివ! నీ సాంగత్య మను భానురుచి నాకుఁ;
గలుగుటఁ గామాంధకార మడఁగెఁ
దరలాక్షి! నీ సఖిత్వం బను నావచేఁ;
గడిఁది వియోగాబ్ధిఁ గడవఁ గంటి
నబల! నీ యనుబంధ మను సుధావృష్టిచే;
నంగజ సంతాప మార్పఁ గంటి
వనిత! నీ చెలితనం బను రసాంజనముచే;
నా మనోహర నిధానంబుఁ గంటిఁ
10.2-370.1-తే.
గలలఁ దోఁచిన రూపు గ్రక్కన లిఖించు
వారు, నౌ నన్నఁ దోడ్తెచ్చు వారు గలరె?
నీటిలో జాడఁ బుట్టించు నేర్పు నీక
కాక గల్గునె మూఁడు లోకములయందు? "

భావము:
“చెలీ! నీ సాంగత్యం అనే సూర్యకాంతి లభించటం వలన నా కామాంధకారం పటాపంచలైపోయింది. సుందరీ! నీ స్నేహం అనే నావ వలన వియోగ సాగరాన్ని దాటగలిగాను. సఖీ! నీ అనుబంధం అనే అమృతవర్షంతో మన్మథతాపం చల్లార్చుకొన గలుగుతున్నాను. మానినీ! నీ మైత్రి అనే అంజనంతో మనోహరుడనే నిధిని చూడ గలుగుతూ ఉన్నాను. కలలో కనిపించిన వానిని చిత్రపటంలో గీసి చూపేవారు ఉండవచ్చేమో కానీ, అవును అనగానే వానిని తీసుకువచ్చే వారు ఎవరైనా ఉంటారా? నీవు అంటే నీటిలో జాడలు తీయగల నేర్పుకలదానివి. ఈ ముల్లోకాలలో నిన్ను మించినవారు ఎవరూ లేరు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=34&padyam=370

: :  భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: