Saturday, March 28, 2020

ధ్రువోపాఖ్యానము - 19

4-272-తే.
వసుమతీతల మర్ధము వంగఁ జొచ్చె
భూరిమద దుర్నివారణ వారణేంద్ర
మెడమఁ గుడి నొరగఁగ నడు గడుగునకును
జలన మొందు నుదస్థిత కలము వోలె.
4-273-చ.
అతఁడు ననన్యదృష్టిని జరాచర దేహిశరీర ధారణా
స్థితి గల యీశునందుఁ దన జీవితమున్ ఘటియింపఁ జేసి యే
కతఁ గనఁ దన్నిరోధమునఁ గైకొని కంపము నొందె నీశ్వరుం;
డతఁడు చలింప నిజ్జగము లన్నియుఁ జంచల మయ్యె భూవరా!
4-274-క.
ఆలోకభయంకర మగు
నా లోకమహావిపద్దశాలోకనులై
యా లోకపాలు రందఱు
నా లోకశరణ్యుఁ గాన నరిగిరి భీతిన్.
4-275-వ.
అట్లరిగి నారాయణు నుద్దేశించి కృతప్రణాములై కరంబులు ముకుళించి యిట్లనిరి.

భావము:
మదపుటేనుగు కుడి ఎడమలకు ఒరిగినప్పుడు అడుగడుగునా కంపించే పడవలాగా సగం భూమి వంగి క్రుంగింది. ధ్రువుడు ఏకాగ్రదృష్టితో చరాచర విశ్వానికి అధీశ్వరుడైన భగవంతుని ధ్యానించాడు. తదేక చిత్తంతో తన ప్రాణవాయువును నిరోధించి పరమేశ్వరునితో అనుసంధానం చేసాడు. ఈ విధంగా శ్వాసను నిరోధించడం వల్ల శ్రీహరి కంపించాడు. ఆయన కంపించగానే అఖిలలోకాలూ ప్రకంపించాయి. లోకాలకు సంభవించిన ఆ చూడటానికి భయంకరమైన మహా విపత్తును చూచి అష్ట దిక్పాలకులు మొదలైన లోకపాలు రందరూ భయంతో లోకరక్షకుడైన హరిని దర్శించడానికి వెళ్ళారు. అలా వెళ్ళి దేవతలంతా నారాయణునికి నమస్కరించి చేతులు మోడ్చి ఇలా అన్నారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=11&padyam=274

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

ధ్రువోపాఖ్యానము - 18

4-270-వ.
అట్లు గని డాయంజని యమునానదిం గృతస్నానుండై నియతుండును, సమాహిత చిత్తుండును నై సర్వేశ్వరుని ధ్యానంబు చేయుచుం బ్రతిత్రిరాత్రాంతంబునఁ గృత కపిత్థ బదరీఫల పారణుం డగుచు దేహ స్థితి ననుసరించి యిటుల నొక్కమాసంబు హరిం బూజించి, యంత నుండి యాఱేసి దినంబుల కొక్కపరి కృతజీర్ణ తృణ పర్ణాహారుం డగుచు, రెండవ మాసంబున విష్ణుసమారాధనంబు చేసి, యంత నుండి నవరాత్రంబుల కొకమా ఱుదకభక్షణంబు చేయుచు, మూఁడవ మాసంబున మాధవు నర్చించి, యంతనుండి ద్వాదశ దినంబుల కొకమాఱు వాయుభక్షణుం డగుచు, జితశ్వాసుండై నాలవ మాసంబునం, బుండరీకాక్షుని భజియించి, యంతనుండి మనంబున నలయక నిరుచ్ఛ్వాసుండై యేకపదంబున నిలిచి, పరమాత్మఁ జింతించుచు, నచేతనంబైన స్థాణువుంబోలె నైదవ మాసంబును జరిపె; అంత.
4-271-సీ.
సకల భూతేంద్రి యాశయ మగు హృదయంబు;
నందు విషయములఁ జెందనీక
మహదాది తత్త్వ సమాజమ్ములకును నా;
ధార భూతమును బ్రధాన పూరు
షేశ్వరుఁ డైనట్టి శాశ్వత బ్రహ్మంబుఁ;
దనదైన హృదయ పద్మమున నిలిపి
హరి రూపమున కంటె నన్యంబు నెఱుఁగక;
చిత్త మవ్విభునందుఁ జేర్చియున్న
4-271.1-తే.
కతన ముల్లోకములు చాలఁ గంపమొందె;
వెండియును బేర్చి యయ్యర్భకుండు ధరణి
నొక్కపాదంబు చేర్చి నిల్చున్నవేళఁ
బేర్చి యబ్బాలు నంగుష్టపీడఁ జేసి.

భావము:
ధ్రువుడు మధువనంలో ప్రవేశించి, యమునా నదిలో స్నానం చేసాడు. నియమంతో ఏకాగ్రచిత్తంతో భగవంతుణ్ణి ధ్యానింపసాగాడు. శరీరస్థితినిబట్టి మూడు దినాల కొకసారి వెలగపండ్లను, రేగుపండ్లను ఆరగిస్తూ ఒక్క నెల శ్రీహరిని అర్చిస్తూ గడిపాడు. తరువాత ఆరు దినాలకు ఒకసారి జీర్ణతృణపర్ణాలను తింటూ విష్ణుపూజలో రెండవ నెల గడిపాడు. తొమ్మిది దినాలకు ఒకమారు నీటిని త్రాగి మాధవసమారాధనలో మూడవ నెల గడిపాడు. అనంతరం పన్నెండు దినాల కొకసారి గాలిని ఆరగిస్తూ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను నిరోధించి నారాయణ సేవలో నాలుగవ నెల గడిపాడు. తరువాత ఒంటికాలిపై నిలిచి పరమాత్ముణ్ణి భజిస్తూ ప్రాణం లేని మ్రోడులాగా నిశ్చలంగా ఐదవ నెల గడిపాడు. ధ్రువుడు చాంచల్యం లేని తన హృదయంలో ఇతర విషయాలను చొరనీయలేదు. మహత్తు మొదలైన తత్త్వాలకు ఆధారభూతుడూ, ప్రకృతి పురుషులకు అధీశ్వరుడూ, శాశ్వతుడూ అయిన భగవంతుణ్ణి తన హృదయపద్మంలో నిలుపుకున్నాడు. శ్రీహరి రూపాన్ని తప్ప మరి దేనినీ మనస్సులో స్మరించకుండా తన చిత్తాన్ని తదాయత్తం చేశాడు. ఈ విధంగా ధ్రువుడు తీవ్రమైన తపస్సును సాగించాడు. అతని తపఃప్రభావాన్ని సహింపలేక ముల్లోకాలు కంపించాయి. ధ్రువుడు భూమిపై ఒంటికాలు మోపి నిలుచున్నాడు. అతని కాలి బొటనవ్రేలి ఒత్తిడికి...

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=11&padyam=271

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

Wednesday, March 25, 2020

ధ్రువోపాఖ్యానము - 17


4-264-ఉ.
కావున నమ్మహాత్ముఁడు సుకర్మము చేత సమస్త లోకపా
లావళి కందరాని సముదంచిత నిత్యపదంబునం బ్రభు
శ్రీ విలసిల్లఁ జెందుఁ దులసీదళదాము భజించి; యా జగ
త్పావనుఁడైన నీ సుతు ప్రభావ మెఱుంగవు నీవు భూవరా!
4-265-వ.
అదియునుం గాక.
4-266-క.
నీ కీర్తియు జగముల యం
దాకల్పము నొందఁజేయు నంచిత గుణర
త్నాకరుఁ డిట కేతెంచును
శోకింపకు మతనిఁ గూర్చి సుభగచరిత్రా!"
4-267-క.
అని నారదుండు పలికిన
విని మనమున విశ్వసించి విభుఁడును బ్రియ నం
దనుఁ జింతించుచు నాదర
మునఁ జూడం డయ్యె రాజ్యమును బూజ్యముగన్.
4-268-వ.
అంత నక్కడ నా ధ్రువుండు.
4-269-క.
చని ముందటఁ గనుఁగొనె మధు
వనమును ముని దేవ యోగి వర్ణిత గుణ పా
వనమును దుర్భవ జలద ప
వనమును నిఖిలైక పుణ్యవరభవనంబున్.

భావము:
రాజా! ఉత్తానపాదా! లోకపావనుడైన నీ పుత్రుని ప్రభావం నీకు తెలియదు కాని. మహాత్ముడైన నీ కుమారుడు తన పుణ్యంతో తులసీదళదాముడైన నారాయణుని సేవించి లోకపాలకులు సైతం పొందరాని నిత్యపదానికి అధీశ్వరు డవుతాడు. అంతేకాక పుణ్యాత్మా! నీ కుమారుడు నీ కీర్తిని కల్పాంతం వరకు సుస్థిరంగా ఉండేటట్లు చేస్తాడు. అతడు సుగుణ రత్నాకరుడు. అచిరకాలంలోనే నీ దగ్గరకు వస్తాడు. నీ పుత్రుని కోసం నీవు దుఃఖించవద్దు.” అని నారదుడు చెప్పిన మాటలను రాజు తన మనస్సులో విశ్వసించి, ప్రియపుత్రుని తలచుకొంటూ రాజ్యపాలన పట్ల పూర్తిగా నిరాదరం చూపసాగాడు. ఆ సమయంలో అక్కడ ధ్రువుడు పోయి పోయి ఎదురుగా మధువనాన్ని చూశాడు. దాని పవిత్రతను మునులు, దేవతలు, యోగులు మొదలైన వారు వర్ణించారు. అది సంసారమనే మబ్బును చెదరగొట్టే ప్రభంజనం వంటిది. సకల పుణ్యాలకు తావైనది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=11&padyam=269

: :  భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

ధ్రువోపాఖ్యానము - 16

4-261-మ.
చని యుగ్రాటవిఁ జొచ్చి యచ్చటఁ బరిశ్రాంతుండు క్షుత్పీడితుం
డును నామ్లాన ముఖాంబుజుండు ననఘుండున్ బాలకుం డైన మ
త్తనయున్ ఘోర వృ కాహి భల్ల ముఖ సత్త్వశ్రేణి నిర్జించెనో
యని దుఃఖించెద నాదు చిత్తమున నార్యస్తుత్య! యిట్లౌటకున్.
4-262-తే.
అట్టి యుత్తమబాలు నా యంకపీఠ
మందుఁ గూర్చుండనీక నిరాకరించి
యంగనాసక్త చిత్తుండ నైనయట్టి
నాదు దౌరాత్మ్య మిది మునినాథచంద్ర!"
4-263-ఉ.
నా విని నారదుండు నరనాథున కిట్లను "నీ కుమారుఁ డా
దేవకిరీట రత్నరుచిదీపిత పాదసరోజుఁడైన రా
జీవదళాక్ష రక్షితుఁ డశేష జగత్పరికీర్తనీయ కీ
ర్తీవిభవప్రశస్త సుచరిత్రుఁడు; వానికి దుఃఖ మేటికిన్?

భావము:
అలా వెళ్ళి భయంకరమైన అడవిలో ప్రవేశించి మార్గాయాసంతోను, ఆకలి బాధతోను ముఖపద్మం వాడిపోయిన నా కుమారుణ్ణి, ఏపాపం ఎరుగని పసివాణ్ణి తోడేళ్ళు, సర్పాలు, ఎలుగుబంట్లు మొదలైన క్రూరజంతువులు పొట్టన బెట్టుకున్నాయేమో అనే భయంతో, బాధతో లోలోపల కుమిలిపోతున్నాను. మహానుభావా! ఇలా జరిగినందుకు నేను దుఃఖిస్తున్నాను.అటువంటి ఉత్తముడైన బాలుణ్ణి నా ఒడిలో కూర్చోనివ్వక అవమానించాను. మునీంద్రా! నా చిన్న భార్య సురుచి మీది వలపుతో ఈ దుర్మార్గపు పని చేశాను.” ఉత్తానపాదుని మాటలు విని నారదుడు ఇలా అన్నాడు “రాజా! దేవతల కిరీటాల రత్నకాంతులతో ప్రకాశించే పాదపద్మాలు కల శ్రీహరి చేత రక్షింపబడే నీ కుమారుడు సమస్త లోకాలు ప్రస్తుతించే కీర్తి సంపదతో ప్రసిద్ధికెక్కిన చరిత్ర కలవాడు. అతనికోసం దుఃఖించడ మెందుకు?

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=11&padyam=263

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

ధ్రువోపాఖ్యానము - 15

4-257-తే.
పద్మభవ సూనుఁ డుత్తానపాదు కడకు
నరిగి యా రాజుచే వివిధార్చనముల
నంది సంప్రీతుఁడై యున్నతాసనమున
నెలమిఁ గూర్చుండి యాతని వలను చూచి.
4-258-వ.
ఇట్లనియె.
4-259-క.
"భూనాయక! నీ విపుడా
మ్లానాస్యుఁడ వగుచుఁజాల మదిలోఁ జింతం
బూనుట కేమి కతం?" బన
నా నారదుతోడ నాతఁ డనియెన్ మరలన్.
4-260-క.
"మునివర! వివేకశాలియు
ననఘుఁడు నైదేండ్ల బాలుఁ డస్మత్ప్రియ నం
దనుఁ డదయుఁడ నగు నాచే
తను బరిభవ మొంది చనియెఁ దల్లియుఁ దానున్.

భావము:
నారదుడు ఉత్తానపాదుని దగ్గరకు వెళ్ళి, ఆ రాజు చేసిన నానావిధాలైన పూజలను అందుకొని, ఆనందంతో ఉన్నతాసనంపై కూర్చున్నవాడై ఆ రాజు వంక చూచి ఇలా అన్నాడు. “రాజా! నీ వదనసరోజం వాడి ఉన్నది. నీ మనస్సులోని విచారానికి కారణం ఏమిటి?” అని ప్రశ్నించిన నారదునితో ఉత్తానపాదుడు ఇలా అన్నాడు. “మునీంద్రా! నా ప్రియపుత్రుడు ధ్రువుడు ఐదేండ్లవాడు. మంచి తెలివితేటలు గలవాడు; పాపం ఎరుగనివాడు; అతనిని నేను దయమాలి అవమానించాను. అందుకు వాడు అలిగి తల్లితో పాటు వెళ్ళిపోయాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=11&padyam=260

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

Saturday, March 21, 2020

ధ్రువోపాఖ్యానము - 14

4-255-క.
ధృత చిత్తుఁడు శాంతుండు ని
యత పరిభాషణుఁడు సుమహితాచారుఁడు వ
ర్ణిత హరిమంగళ గుణుఁడును
మితవన్యాశనుఁడు నగుచు మెలఁగఁగ వలయున్.
4-256-వ.
ఉత్తమశ్లోకుండగు పుండరీకాక్షుండు నిజమాయా స్వేచ్ఛావతార చరితంబుల చేత నంచింత్యముగా నెద్దిచేయు నద్ది హృదయగతంబుగా ధ్యానంబు చేయం దగు; మఱియుఁ గార్యబుద్ధిం జేసి చేయంబడు పూజావిశేషంబులు వాసుదేవమంత్రంబున సర్వేశ్వరునికి సమర్పింప వలయు; ఇట్లు మనోవాక్కాయ కర్మంబులచేత మనోగతం బగునట్లుగా భక్తి యుక్తంబు లయిన పూజల చేతఁ బూజింపం బడి, సర్వేశ్వరుండు మాయాభిభూతులు గాక సేవించు పురుషులకు ధర్మాది పురుషార్థంబులలో ననభిమతార్థంబు నిచ్చు; విరక్తుం డగువాఁడు నిరంతర భావం బయిన భక్తియోగంబునం జేసి మోక్షంబుకొఱకు భజియించు" నని చెప్పిన విని ధ్రువుండు నారదునకుం బ్రదక్షిణ పూర్వకంబుగా నమస్కరించి మహర్షి జనసేవ్యంబై సకలసిద్ధుల నొసంగుచు భగవత్పాద సరోజాలంకృతం బయిన మధువనంబునకుం జనియె; అంత.

భావము:
మనోనిగ్రహం కలవాడై, శాంతుడై, మితభాషియై, సదాచార సంపన్నుడై, శ్రీహరి కళ్యాణగుణాలను వర్ణిస్తూ కందమూలాలను మితంగా స్వీకరిస్తూ ఉండాలి. పురుషోత్తముడైన పుండరీకాక్షుడు తన మాయామహిమతో ఇచ్ఛానుసారంగా పెక్కు అవతారాలను ధరించి చేసిన లీలావిశేషాలను మనస్సులో భావించాలి. ఆత్మార్పణ బుద్ధితో చేసే పూజలను ద్వాదశాక్షర మంత్రంతో వాసుదేవునకు సమర్పించాలి. ఈ విధంగా త్రికరణ శుద్ధిగా భక్తితో పూజించేవారు విష్ణుమాయలో చిక్కుకొనరు. వారికి భగవంతుడు ధర్మార్థకామమోక్షాలు అనే పురుషార్థాలలో కోరిన దానిని అనుగ్రహిస్తాడు. విరక్తితో ముక్తిని కోరువాడు, ఎడతెగని భక్తిభావంతో సేవిస్తూ ఉంటాడు” అని నారదుడు ఉపదేశించగా ధ్రువుడు అతనికి ప్రదక్షిణం చేసి, నమస్కరించి, మహర్షులు నివసించేది, కోరిన కోరికలను ప్రసాదించేది, భగవంతుని పాదపద్మాలచేత అలంకరింపబడింది అయిన మధువనానికి బయలుదేరాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=11&padyam=256

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 



ధ్రువోపాఖ్యానము - 13

4-253-వ.
అయిన పురుషోత్తముఁ బూజించుచు హృదయగతుండును, సాను రాగవిలోకనుండును, వరదశ్రేష్ఠుండును నగు నారాయణు నేకాగ్రచిత్తంబునం ధ్యానంబు చేయుచు బరమ నివృత్తి మార్గంబున ధ్యాతుండైన పురుషోత్తముని దివ్యమంగళస్వరూపంబు చిత్తంబునం దగిలిన మరల మగుడ నేరదు; అదియునుం గాక, యే మంత్రంబేని సప్త వాసరంబులు పఠియించిన ఖేచరులం గనుంగొను సామర్థ్యంబు గలుగు; అట్టి ప్రణవయుక్తం బగు ద్వాదశాక్షర కలితంబును దేశకాల విభాగ వేది బుధానుష్ఠితంబును నయిన ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ యనెడి వాసుదేవ మంత్రంబునం జేసి.
4-254-సీ.
దూర్వాంకురంబుల దూర్వాంకురశ్యాము;
జలజంబులను జారుజలజనయనుఁ
దులసీ దళంబులఁ దులసికా దాముని;
మాల్యంబులను సునైర్మల్య చరితుఁ
బత్రంబులను బక్షిపత్రునిఁ గడు వన్య;
మూలంబులను నాది మూలఘనుని
నంచిత భూర్జత్వగాది నిర్మిత వివి;
దాంబరంబులను పీతాంబరధరుఁ
4-254.1-తే.
దనరు భక్తిని మృచ్ఛిలాదారు రచిత
రూపముల యందుఁ గాని నిరూఢమైన
సలిలముల యందుఁ గాని సుస్థలము లందుఁ
గాని పూజింపవలయు నక్కమలనాభు.

భావము:
అటువంటి పురుషోత్తముని పూజించు. హృదయంలో కుదురుకున్నవాడూ, అనురాగమయ వీక్షణాలు వెదజల్లేవాడూ, వరాలను ఇచ్చేవాడూ అయిన నారాయణుని అచంచలమైన మనస్సుతో ధ్యానించు. అప్పుడు ఆ పురుషోత్తముని దివ్యమంగళ విగ్రహం మనస్సులో సాక్షాత్కరించి స్థిరంగా నిలిచిపోతుంది. ఏ మంత్రాన్ని ఏడు దినాలు జపిస్తే దేవతలను దర్శించే శక్తి కలుగుతుందో, ఓంకారంతో కూడి, పన్నెండు అక్షరాలు కలిగి, దేశకాల విభాగాలను తెలుసుకొని జపించవలసిన ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే ఆ వాసుదేవ మంత్రాన్ని జపించాలి. గరికపోచలవలె శ్యామలవర్ణం కల వాసుదేవుణ్ణి గరికపోచలతో, అందమైన పద్మాలవంటి కన్నులు కలిగినవానిని పద్మాలతో, తులసిదండలు ధరించేవానిని తులసీదళాలతో, మాలిన్యం లేని శీలం కలవానిని పూలమాలలతో, పక్షివాహనుని పత్రాలతో, లోకాలకు ఆదిమూలుడైన మహానుభావుని వనమూలికలతో, పచ్చని పట్టు వస్త్రాలు ధరించేవానిని నారబట్టలతో సేవించాలి. భగవంతుణ్ణి మృణ్మయ, శిలామయ, దారుమయ ప్రతిమలలో కాని, నిర్మల జలాలలో కాని, పవిత్ర స్థలాలలో కాని ఆరాధించాలి.
“ఓం నమో భగవతే వాసుదేవాయః” అనే ద్వాదశాక్షరీ మంత్రోపాసన విధానం నారదమునీశ్వరుడు పంచాబ్దముల ధ్రువునికి ఉపదేశిస్తున్నాడు. అతి శక్తివంతమైన తిరుగులేని మహా మంత్రపూరిత ఘట్టమిది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=11&padyam=254

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :