Saturday, March 21, 2020

ధ్రువోపాఖ్యానము - 13

4-253-వ.
అయిన పురుషోత్తముఁ బూజించుచు హృదయగతుండును, సాను రాగవిలోకనుండును, వరదశ్రేష్ఠుండును నగు నారాయణు నేకాగ్రచిత్తంబునం ధ్యానంబు చేయుచు బరమ నివృత్తి మార్గంబున ధ్యాతుండైన పురుషోత్తముని దివ్యమంగళస్వరూపంబు చిత్తంబునం దగిలిన మరల మగుడ నేరదు; అదియునుం గాక, యే మంత్రంబేని సప్త వాసరంబులు పఠియించిన ఖేచరులం గనుంగొను సామర్థ్యంబు గలుగు; అట్టి ప్రణవయుక్తం బగు ద్వాదశాక్షర కలితంబును దేశకాల విభాగ వేది బుధానుష్ఠితంబును నయిన ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ యనెడి వాసుదేవ మంత్రంబునం జేసి.
4-254-సీ.
దూర్వాంకురంబుల దూర్వాంకురశ్యాము;
జలజంబులను జారుజలజనయనుఁ
దులసీ దళంబులఁ దులసికా దాముని;
మాల్యంబులను సునైర్మల్య చరితుఁ
బత్రంబులను బక్షిపత్రునిఁ గడు వన్య;
మూలంబులను నాది మూలఘనుని
నంచిత భూర్జత్వగాది నిర్మిత వివి;
దాంబరంబులను పీతాంబరధరుఁ
4-254.1-తే.
దనరు భక్తిని మృచ్ఛిలాదారు రచిత
రూపముల యందుఁ గాని నిరూఢమైన
సలిలముల యందుఁ గాని సుస్థలము లందుఁ
గాని పూజింపవలయు నక్కమలనాభు.

భావము:
అటువంటి పురుషోత్తముని పూజించు. హృదయంలో కుదురుకున్నవాడూ, అనురాగమయ వీక్షణాలు వెదజల్లేవాడూ, వరాలను ఇచ్చేవాడూ అయిన నారాయణుని అచంచలమైన మనస్సుతో ధ్యానించు. అప్పుడు ఆ పురుషోత్తముని దివ్యమంగళ విగ్రహం మనస్సులో సాక్షాత్కరించి స్థిరంగా నిలిచిపోతుంది. ఏ మంత్రాన్ని ఏడు దినాలు జపిస్తే దేవతలను దర్శించే శక్తి కలుగుతుందో, ఓంకారంతో కూడి, పన్నెండు అక్షరాలు కలిగి, దేశకాల విభాగాలను తెలుసుకొని జపించవలసిన ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే ఆ వాసుదేవ మంత్రాన్ని జపించాలి. గరికపోచలవలె శ్యామలవర్ణం కల వాసుదేవుణ్ణి గరికపోచలతో, అందమైన పద్మాలవంటి కన్నులు కలిగినవానిని పద్మాలతో, తులసిదండలు ధరించేవానిని తులసీదళాలతో, మాలిన్యం లేని శీలం కలవానిని పూలమాలలతో, పక్షివాహనుని పత్రాలతో, లోకాలకు ఆదిమూలుడైన మహానుభావుని వనమూలికలతో, పచ్చని పట్టు వస్త్రాలు ధరించేవానిని నారబట్టలతో సేవించాలి. భగవంతుణ్ణి మృణ్మయ, శిలామయ, దారుమయ ప్రతిమలలో కాని, నిర్మల జలాలలో కాని, పవిత్ర స్థలాలలో కాని ఆరాధించాలి.
“ఓం నమో భగవతే వాసుదేవాయః” అనే ద్వాదశాక్షరీ మంత్రోపాసన విధానం నారదమునీశ్వరుడు పంచాబ్దముల ధ్రువునికి ఉపదేశిస్తున్నాడు. అతి శక్తివంతమైన తిరుగులేని మహా మంత్రపూరిత ఘట్టమిది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=11&padyam=254

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: