Wednesday, March 25, 2020

ధ్రువోపాఖ్యానము - 17


4-264-ఉ.
కావున నమ్మహాత్ముఁడు సుకర్మము చేత సమస్త లోకపా
లావళి కందరాని సముదంచిత నిత్యపదంబునం బ్రభు
శ్రీ విలసిల్లఁ జెందుఁ దులసీదళదాము భజించి; యా జగ
త్పావనుఁడైన నీ సుతు ప్రభావ మెఱుంగవు నీవు భూవరా!
4-265-వ.
అదియునుం గాక.
4-266-క.
నీ కీర్తియు జగముల యం
దాకల్పము నొందఁజేయు నంచిత గుణర
త్నాకరుఁ డిట కేతెంచును
శోకింపకు మతనిఁ గూర్చి సుభగచరిత్రా!"
4-267-క.
అని నారదుండు పలికిన
విని మనమున విశ్వసించి విభుఁడును బ్రియ నం
దనుఁ జింతించుచు నాదర
మునఁ జూడం డయ్యె రాజ్యమును బూజ్యముగన్.
4-268-వ.
అంత నక్కడ నా ధ్రువుండు.
4-269-క.
చని ముందటఁ గనుఁగొనె మధు
వనమును ముని దేవ యోగి వర్ణిత గుణ పా
వనమును దుర్భవ జలద ప
వనమును నిఖిలైక పుణ్యవరభవనంబున్.

భావము:
రాజా! ఉత్తానపాదా! లోకపావనుడైన నీ పుత్రుని ప్రభావం నీకు తెలియదు కాని. మహాత్ముడైన నీ కుమారుడు తన పుణ్యంతో తులసీదళదాముడైన నారాయణుని సేవించి లోకపాలకులు సైతం పొందరాని నిత్యపదానికి అధీశ్వరు డవుతాడు. అంతేకాక పుణ్యాత్మా! నీ కుమారుడు నీ కీర్తిని కల్పాంతం వరకు సుస్థిరంగా ఉండేటట్లు చేస్తాడు. అతడు సుగుణ రత్నాకరుడు. అచిరకాలంలోనే నీ దగ్గరకు వస్తాడు. నీ పుత్రుని కోసం నీవు దుఃఖించవద్దు.” అని నారదుడు చెప్పిన మాటలను రాజు తన మనస్సులో విశ్వసించి, ప్రియపుత్రుని తలచుకొంటూ రాజ్యపాలన పట్ల పూర్తిగా నిరాదరం చూపసాగాడు. ఆ సమయంలో అక్కడ ధ్రువుడు పోయి పోయి ఎదురుగా మధువనాన్ని చూశాడు. దాని పవిత్రతను మునులు, దేవతలు, యోగులు మొదలైన వారు వర్ణించారు. అది సంసారమనే మబ్బును చెదరగొట్టే ప్రభంజనం వంటిది. సకల పుణ్యాలకు తావైనది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=11&padyam=269

: :  భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

No comments: