Saturday, March 21, 2020

ధ్రువోపాఖ్యానము - 14

4-255-క.
ధృత చిత్తుఁడు శాంతుండు ని
యత పరిభాషణుఁడు సుమహితాచారుఁడు వ
ర్ణిత హరిమంగళ గుణుఁడును
మితవన్యాశనుఁడు నగుచు మెలఁగఁగ వలయున్.
4-256-వ.
ఉత్తమశ్లోకుండగు పుండరీకాక్షుండు నిజమాయా స్వేచ్ఛావతార చరితంబుల చేత నంచింత్యముగా నెద్దిచేయు నద్ది హృదయగతంబుగా ధ్యానంబు చేయం దగు; మఱియుఁ గార్యబుద్ధిం జేసి చేయంబడు పూజావిశేషంబులు వాసుదేవమంత్రంబున సర్వేశ్వరునికి సమర్పింప వలయు; ఇట్లు మనోవాక్కాయ కర్మంబులచేత మనోగతం బగునట్లుగా భక్తి యుక్తంబు లయిన పూజల చేతఁ బూజింపం బడి, సర్వేశ్వరుండు మాయాభిభూతులు గాక సేవించు పురుషులకు ధర్మాది పురుషార్థంబులలో ననభిమతార్థంబు నిచ్చు; విరక్తుం డగువాఁడు నిరంతర భావం బయిన భక్తియోగంబునం జేసి మోక్షంబుకొఱకు భజియించు" నని చెప్పిన విని ధ్రువుండు నారదునకుం బ్రదక్షిణ పూర్వకంబుగా నమస్కరించి మహర్షి జనసేవ్యంబై సకలసిద్ధుల నొసంగుచు భగవత్పాద సరోజాలంకృతం బయిన మధువనంబునకుం జనియె; అంత.

భావము:
మనోనిగ్రహం కలవాడై, శాంతుడై, మితభాషియై, సదాచార సంపన్నుడై, శ్రీహరి కళ్యాణగుణాలను వర్ణిస్తూ కందమూలాలను మితంగా స్వీకరిస్తూ ఉండాలి. పురుషోత్తముడైన పుండరీకాక్షుడు తన మాయామహిమతో ఇచ్ఛానుసారంగా పెక్కు అవతారాలను ధరించి చేసిన లీలావిశేషాలను మనస్సులో భావించాలి. ఆత్మార్పణ బుద్ధితో చేసే పూజలను ద్వాదశాక్షర మంత్రంతో వాసుదేవునకు సమర్పించాలి. ఈ విధంగా త్రికరణ శుద్ధిగా భక్తితో పూజించేవారు విష్ణుమాయలో చిక్కుకొనరు. వారికి భగవంతుడు ధర్మార్థకామమోక్షాలు అనే పురుషార్థాలలో కోరిన దానిని అనుగ్రహిస్తాడు. విరక్తితో ముక్తిని కోరువాడు, ఎడతెగని భక్తిభావంతో సేవిస్తూ ఉంటాడు” అని నారదుడు ఉపదేశించగా ధ్రువుడు అతనికి ప్రదక్షిణం చేసి, నమస్కరించి, మహర్షులు నివసించేది, కోరిన కోరికలను ప్రసాదించేది, భగవంతుని పాదపద్మాలచేత అలంకరింపబడింది అయిన మధువనానికి బయలుదేరాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=11&padyam=256

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 



No comments: