Wednesday, October 9, 2019

తెలుగు భాగవతం (ద్వాదశ స్కంధం) - 12


( కల్కి అవతారము )

12-19-తే.
"ఉత్తమశ్లోకుఁ డననెవ్వఁ డున్నవాడు;
సన్నుతుండగు నెవ్వఁడు సకల దిశల;
నట్టి పరమేశ్వరునిఁ జిత్తమందు నిలిపి
తద్గుణంబులు వర్ణింపు ధరణినాథ! "

భావము:
“ఓ మహారాజా! ఉత్తములచే కీర్తింపతగిన వాడు, సర్వదిక్కులలో స్తుతింపబడువాడు అయిన పరమేశ్వరుని మనసులో నిలుపుకొని అతని గుణాలను కీర్తించు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=12&Ghatta=3&padyam=19

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగుపడదాం మనం అందరం : :

Monday, October 7, 2019

తెలుగు భాగవతం (ద్వాదశ స్కంధం) - 11


( కల్కి అవతారము )

12-18-వ.
గర్వాంధులయిన నరపతులం జూచి భూదేవి హాస్యంబు సేయు; “శత్రు క్షయంబు సేసి యెవ్వరికి నీక తామ యేలుచుండెద” మనియెడి మోహంబునం బితృపుత్రభ్రాతలకు భ్రాంతి గల్పించి, యన్యోన్య వైరానుబంధంబులం గలహంబు సేసి, రణరంగంబులఁ దృణప్రాయంబులుగా దేహాదులు వర్జించి, నిర్జరలోకప్రాప్తులైన పృథు యయాతి గాధి నహుష భరతార్జున మాంధాతృ సగర రామ ఖట్వాంగ ధుంధుమార రఘు తృణబిందు పురూరవ శంతను గయ భగీరథ కువలయాశ్వ కకుత్థ్స నిషధ హిరణ్యకశిపు వృత్ర రావణ నముచి శంబర భౌమ హిరణ్యాక్ష తారకాదులైన రాజులును, దైత్యులును ధరణికి మమత్వంబునం జేసి కదా కాలవశంబున నాశంబు నొంది? రది యంతయు మిథ్యగాన సర్వంబునుం బరిత్యజించి “జనార్దన, వైకుంఠ, వాసుదేవ, నృసింహ” యని నిరంతర హరి కథామృతపానంబు సేసి, జరా రోగ వికృతులం బాసి హరిపదంబు నొందు మని చెప్పి.

భావము:
గర్వవశులై కన్ను మిన్ను కానక సంచరించే రాజులను చూసి భూదేవి నవ్వుకుంటుంది. “శత్రువులను సంహరించి, భూమిని గ్రహించి ఎవరికీ ఇవ్వకుండ, తామే ఏలుకుంటూ ఉంటాం.” అనే మోహంతో ఉంటారు. అదేవిధంగా తండ్రీకొడుకులకు, అన్నదమ్ములకు ఆశ పుట్టించి, పరస్పరం వైరాలు పెంచుకుంటారు. కలహించి యుద్ధరంగంలో గడ్డిపరకలను విడిచినట్టు శరీరాలను విడిచిపెట్టి దేవలోకాన్ని పొందిన పృథువు, యయాతి, గాధి, నహుషుడు, భరతుడు, అర్జునుడు, మాంధాత, సగరుడు, రాముడు, ఖట్వాంగుడు, ధుంధుమారుడు, రఘువు, తృణబిందువు, పురూరవుడు, శంతనుడు, గయుడు, భగీరథుడు, కువలయాశ్వుడు, కకుత్థ్సుడు, నిషధుడు, హిరణ్యకశిపుడు, వృత్రుడు, రావణుడు, నముచి, శంబరుడు, భౌముడు, హిరణ్యాక్షుడు, తారకుడు, మొదలైన రాజులు, రాక్షసులు రాజ్యం మీద మమత్వం పెంచుకుంటూ, కాలానికి లొంగి నాశనం అయిపోయారు. ఇది అంతా ఉత్తి మిథ్య తప్పించి యదార్థం కాదు. కాబట్టి వీటి అంతటినీ విడిచిపెట్టి “జనార్ధన, వైకుంఠ, వాసుదేవ, నరసింహ” అని ఎల్లప్పుడూ శ్రీహరి కథాసుథలు ఆస్వాదిస్తూ ముసలితనం, రోగం అనే వికారాలను దూరం చేసుకొని విష్ణుస్థానమును చేరుకో” అని శుకముని పరీక్షిత్తుకు చెప్పి, మరల ఇలా చెప్పసాగాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=12&Ghatta=3&padyam=18

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగుపడదాం మనం అందరం : :

తెలుగు భాగవతం (ద్వాదశ స్కంధం) - 10


( కల్కి అవతారము )

12-16-క.
ధర్మము సత్యముఁ గీర్తియు
నిర్మలదయ విష్ణుభక్తి నిరుపమ ఘన స
త్కర్మ మహింసావ్రతమును
నర్మిలి గలవారె పుణ్యు లవనీనాథా!
12-17-తే.
ఈ జగంబేలు తొల్లిటి రాజవరులు
కాలవశమున నాయువు ల్గోలుపోయి
నామమాత్రావశిష్ఠు లైనారు; గాన
సలుపవలవదు మమత నెచ్చట నృపాల!

భావము:
ఓ మహారాజా! ధర్మం, సత్యం, కీర్తి, నిర్మలమైన దయ, విష్ణుభక్తి, అనుపమ మహనీయ సత్కర్మ, అహింసావ్రతం అనే సుగుణాలు కలవారు మహా పుణ్యాత్ములు. మహారాజా! ఈ లోకాన్ని పాలించిన పూర్వ కాలపు రాజోత్తములు కాలానికి లొంగి, ప్రాణాలు కోల్పోయారు. కేవలం నామమాత్రావశిష్టులు అయ్యారు. మమత్వము అనేది చెప్పటానికి కూడ ఎప్పుడూ ఎక్కడా పనికి రాదు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=12&Ghatta=3&padyam=17

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగుపడదాం మనం అందరం : :

Sunday, October 6, 2019

తెలుగు భాగవతం (ద్వాదశ స్కంధం) - 9


( కల్కి అవతారము )

12-14-చ.
నరవర! తొంటి భూపతుల నామ గుణంబులు, వృత్తచిహ్నముల్,
సిరియును, రూప సంపదలుఁ, జెన్నగురాజ్యము, లాత్మవిత్తముల్
వరుస నడంగెఁ గాని, యట వారల కీర్తులు నిర్మలంబులై
యురవడి భూమిలో నిలిచి యున్నవి నేఁడును రాజశేఖరా!
12-15-వ.
శంతనుని యనుజండగు దేవాపియు, నిక్ష్వాకువంశజుండగు మరుత్తును, యోగయుక్తులై కలాపగ్రామనిలయులై కలియుగాంతంబున వాసుదేవప్రేరితులై, ప్రజల నాశ్రమాచారంబులు దప్పకుండ నడపుచు, నారాయణస్మరణంబు నిత్యం బొనర్చి, కైవల్యపదప్రాప్తులగుదు; రిక్కరణి నాలుగుయుగంబుల రాజులును నే నెఱింగించిన పూర్వరాజన్యులును, వీరందఱును సమస్తవస్తు సందోహంబుల యందు మమత నొంది యుత్సాహవంతులై యుండి పిదప నీ భూతలంబువదలి నిధనంబు నొందిరి; కావునఁ గాలంబుజాడ యెవ్వరికిం గానరాదు; మత్పూర్వులు హరిధ్యాన పరవశులై దయాసత్యశౌచశమదమాది ప్రశస్తగుణంబులం బ్రసిద్ధు లై నడచి; రట్లు గావున.

భావము:
ఓ రాజోత్తమా! పూర్వరాజుల పేర్లు, గుణాలు, ప్రవర్తనచిహ్నాలు, సిరిసంపదలు, అందచందాలు, రాజ్యాలు, ఐశ్వర్యాలు సర్వం వరుసగా అణగారి పోయాయి. కాని వారి యశస్సులు ఈనాటికి కూడ ఎంతో ఎక్కువగా నిర్మలంగా ధాత్రిలో నిలచి ఉన్నాయి. శంతనుని తమ్ముడు దేవాపి, ఇక్ష్వాకు వంశస్థు డైన మరుత్తు యోగాన్ని అవలంబించి కలాప గ్రామంలో కలియుగాంతం వరకూ ఉంటారు. వారు వాసుదేవుని వలన ప్రేరణ పొందుతారు. ప్రజలు అందరు ఆశ్రమాచారాలు పాటించేలా నడిపిస్తూ నిత్యం నారాయణస్మరణ గావిస్తూ కైవల్యం పొందుతారు. ఈవిధంగా నాలుగు యుగాల రాజులు ఇంతకు ముందు నేను చెప్పిన రాజులు అందరు లోకంలోని సమస్త వస్తువుల మీద మమకారం పెంచుకుని ఉత్సాహంతో జీవితాన్ని గడిపి ఈ భూమండలాన్ని విడిచిపెట్టి మరణం వడిలోకి చేరారు. కాలగమనాన్ని ఎవరు గమనించలేరు. మా పెద్దలు విష్ణుధ్యాన పరాయణులై తమ జీవితాలు గడిపారు. దయా, సత్యం, శౌచం, శమం, దమం మున్నగు సద్గుణాలతో ప్రసిద్ధులై కీర్తిమంతులు అయ్యారు. అందుచేత....

http://telugubhagavatam.org/?tebha&Skanda=12&Ghatta=3&padyam=15

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగుపడదాం మనం అందరం : :

తెలుగు భాగవతం (ద్వాదశ స్కంధం) - 8


( కల్కి అవతారము )

12-13-వ.
అనిన నట్లగాక, యని చెప్పఁ దొడంగె; “వినుము; సప్తర్షి మండలాంతర్గతంబు లయిన పూర్వ ఋక్షద్వయి సమమధ్యంబు నందు నిశాసమయంబున నొక్క నక్షత్రంబు గానిపించిన కాలంబు మనుష్య మానంబున శతవత్సరపరిమితంబయ్యె నే నా సమయంబున జనార్దనుండు నిజపదంబునఁ బొదలె; నా వేళనె ధాత్రీమండలంబు కలి సమాక్రాంతం బయ్యెఁ; గృష్ణుం డెంతకాలంబు భూమి యందుఁ బ్రవర్తించె, నంత కాలంబునుగలి సమాక్రాంతంబు గాదు; మఘానక్షత్రం బందు సప్తర్షులు నే ఘస్రంబునఁ జరియింతు రా ఘస్రంబునఁ గలి ప్రవేశించి వేయునిన్నూఱు వర్షంబు లయి యుండు; నా ఋషిసంఘంబు పూర్వాషాడ కరిగినం గలి ప్రవృద్ధంబు నొందు; నే దివసంబున హరి పరమపదప్రాప్తుం డయ్యె; నా దివసంబు నంద కలి ప్రవేశించి దివ్యాబ్జసహస్రంబు సనిన యనంతరంబు నాలవ పాదంబునఁ గృతయుగ ధర్మంబు ప్రాప్తం బగు.

భావము:
“సరే అలాగే చెప్తాను, విను” అని శుకముని పరీక్షిత్తు మహారాజుకు ఇలా చెప్పసాగాడు. “సప్తర్షి మండలంలోని పూర్వనక్షత్రాలకు రెండింటికీ సరిగ్గా మధ్య ప్రదేశంలో రాత్రి వేళ ఒక నక్షత్రం కనిపించింది. అది కనిపించాక, మానవ గణన ప్రకారం నూరు సంవత్సరాలు గడిచేక జనార్థనుడైన శ్రీకృష్ణుడు స్వస్థానానికి వెళ్ళిపోయాడు. అవేళనే కలి ప్రవేశించాడు. శ్రీకృష్ణుడు భూమిమీద ఉన్నంత కాలం కలి భూమిమీద అడుగు మోపలేదు. సప్తర్షులు మఘానక్షత్రంలో ప్రవేశించే నాటికి కలి ప్రవేశించి పండ్రెండువందల సంవత్సరాలు అవుతుంది. ఆ సప్తఋషులు పూర్వాషాడలో ప్రవేశించినప్పుడు కలి ప్రవర్ధమానుడు అవుతాడు, శ్రీకృష్ణుడు లోకాన్ని విడచి పరమపదమైన తన లోకాన్ని చేరుకున్న దినముననే కలి ప్రవేశించాడు. ఈ విధంగా వెయ్యి దివ్యసంవత్సరాలు గడిచాక, నాలుగవ పాదంలో కృతయుగ ధర్మం ప్రతిష్ఠితం అవుతుంది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=12&Ghatta=3&padyam=13

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగుపడదాం మనం అందరం : :

Saturday, October 5, 2019

తెలుగు భాగవతం (ద్వాదశ స్కంధం) - 7


( కల్కి అవతారము )

12-12-క.
మునినాథ! యే విధంబున
ఘనతరముగఁ జంద్ర సూర్య గ్రహముల జాడల్
సనుఁ? గాలవర్తనక్రమ
మొనరఁగ నెఱిఁగింపవయ్య ముదము దలిర్పన్.

భావము:
అప్పుడు పరీక్షిత్తు “మునివరా! చంద్రగ్రహం సూర్యగ్రహం సంచరించే మార్గాలు ఏవి? కాలవర్తన క్రమం ఏమిటి? నాకు చెప్తే సంతోషిస్తాను. నాకు చెప్తావా?” అని అడిగాడు

http://telugubhagavatam.org/?tebha&Skanda=12&Ghatta=3&padyam=12

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగుపడదాం మనం అందరం : :

తెలుగు భాగవతం (ద్వాదశ స్కంధం) - 6


( కల్కి అవతారము )

12-11-వ.
అట్లుగాన జనంబులు లోభులై, జారత్వ చోరత్వాదులచేత ద్రవ్యహీనులై వన్యశాక మూల ఫలంబులు భుజించుచు, వన గిరి దుర్గంబులం గృశీభూతులై దుర్భిక్ష, శీత, వాతాతప, క్షుధా, తాపంబులచేత భయంపడి, ధనహీనులై యల్పాయుష్కులు, నల్పతరశరీరులునై యుండ రాజులు చోరులై సంచరించుచు,నధర్మప్రవర్తనులై వర్ణాశ్రమ ధర్మంబులు విడనాడి, శూద్రప్రాయులై యుండెద; రంత నోషధు లల్పఫలదంబులు, మేఘంబులు జలశూన్యంబులు, సస్యంబులు నిస్సారంబులు నగు; నిట్లు ధర్మమార్గంబు దక్కి యున్నయెడ ముకుందుండు దుష్టనిగ్రహ శిష్టపరిపాలనంబుల కొఱకు శంబల గ్రామంబున విష్ణుయశుం డను విప్రునకుఁ గల్క్యవతారుండై దేవతా బృందంబులు నిరీక్షింప, దేవదత్త ఘోటకారూఢుండై దుష్టమ్లేచ్ఛజనంబులం దన మండలాగ్రంబున ఖండీభూతులం జేయు; నప్పుడు ధాత్రీమండలంబు విగతక్రూరజన మండలంబై తేజరిల్లు; నంత నరులు విష్ణుధ్యాన వందన పూజాది విధానాసక్తులై నారాయణపరాయణు లయి వర్తిల్లెద; రిట్లు కల్క్యవతారంబున నిఖిల జనులు ధన్యు లయ్యెద; రంతటఁ గృతయుగ ధర్మంబయి నడచుచుచుండు; జంద్ర భాస్కర శుక్ర గురువులేక రాశి గతులయినం, గృతయుం బయి తోఁచు; రాజేంద్రా! గత వర్తమాన భావికాలంబులు; భవజ్జన్మంబు మొదలు నందాభిషేక పర్యంతంబుఁ పంచదశాధికశతోత్తర సహస్ర హాయనంబులయి యుండు; నంతట నారాయణుం డఖిల దుష్ట రాజద్వంసంబు గావించి ధర్మంబు నిలిపి వైకుంఠనిలయం డగు;”నని చెప్పిన.

భావము:
అలా కావడంతో ఆ కాలంలోని ప్రజలు దురాశ, వ్యభిచారము, దొంగతనము మున్నగు దుర్గుణాలకు లొంగి, ధనహీనులు అవుతారు. అడవులందు కూరలు, దుంపల, పళ్ళు తింటూ; కొండగుహలలో మెసలుతూ, కృశించి, కరువు కాటకాలకు, చలికి, గాలికి ఎండకు ఆకలికి భయపడిపోతారు. వారి ఆయుర్ధాయం తరిగిపోతుంది. వారి శరీరాలు కూడ చిక్కి చిక్కి చిన్నవైపోతాయి. ఇంక రాజులు తామే దొంగలై తిరుగుతారు. అధర్మంగా సంచరిస్తూ, వర్ణాశ్రమ ధర్మాలను విడచిపెట్టి, శూద్ర సమానులై తిరుగుతారు. ఆ కాలంలో, ఓషధులు ఫలించడం కూడ తగ్గిపోతుంది. మబ్బులు వట్టిపోయి వర్షాలు కురవవు. పండిన పంటలలో పస ఉండదు. ఈ మాదిరిగా లోకం ధర్మమార్గాన్ని తప్పి ఉన్నప్పుడు విష్ణుమూర్తి దుష్టశిక్షణకోసం శంబల గ్రామంలో విష్ణు యశుడనే విప్రుడికి కొడుకు అయి విష్ణుమూర్తి కల్కి పేర అవతారిస్తాడు. దేవతలు అందరూ చూస్తుండగా దేవదత్తం అనే అశ్వాన్ని అధిరోహించి కల్కి భగవానుడు దుష్టులు అయిన మ్లేచ్ఛులను తన కత్తితో తుత్తునియలు చేస్తాడు. అప్పుడు భూమండలం దుష్టజన రహితం కావడంతో, ప్రకాశిస్తుంది. ప్రజలలో విష్ణుభక్తి కుదురుకుంటుంది ధ్యానవందనార్చనాదు లందు ఆసక్తి కలిగి ప్రజలు నారాయణ భక్తిపరాయణులై మెలగుతారు. అలా కల్క్యావతారుని వలన సకల జనులు ధన్యులు అవుతారు. సర్వత్రా కృతయుగ ధర్మమే నడుస్తూ ఉంటుంది. చంద్రుడు, సూర్యుడు, శుక్రుడు, బృహస్పతి ఒకే రాశిలో ప్రవేశించి నప్పుడు కృతయుగం ఆరంభం అవుతుంది. ఓ పరీక్షిన్మహారాజా! నీవు పుట్టింది మొదలుకొని నందాభిషేకంవరకూ జరిగిన జరుగుతున్న జరుగబోవు కాలం వెయ్యినూటపదిహేను సంవత్సరములు. మిగిలిన కాలాన్ని నువ్వే గణించవచ్చు. ఆ తరువాత నారాయణుడు దుష్టరాజులను అందరినీ సంహరించి, ధర్మాన్ని నిలబెట్టి, మళ్ళా వైకుంఠానికి వెళ్ళిపోతాడు.” అని శుకమహాముని చెప్పాడు...

http://telugubhagavatam.org/?tebha&Skanda=12&Ghatta=3&padyam=11

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగుపడదాం మనం అందరం : :