7-200-వ.
మఱియు ననేక
మారణోపాయంబులఁ బాపరహితుం డైన పాపని రూపుమాపలేక యేకాంతంబున దురంత చింతా పరిశ్రాంతుండయి రాక్షసేంద్రుండు దన మనంబున.
7-201-ఉ.
ముంచితి వార్ధులన్, గదల మొత్తితి, శైలతటంబులందు ద్రొ
బ్బించితి, శస్త్రరాజిఁ బొడిపించితి, మీఁద నిభేంద్రపంక్తి ఱొ
ప్పించితి; ధిక్కరించితి; శపించితి; ఘోరదవాగ్నులందుఁ ద్రో
యించితిఁ; బెక్కుపాట్ల నలయించితిఁ; జావఁ డి దేమి చిత్రమో
టీకా:
మఱియున్ = ఇంకను; అనేక = అనేకమైన; మారణ = చంపెడి; ఉపాయంబులన్ = ఉపాయములతో; పాప = పాపము; రహితుండు = లేనివాడు; ఐన = అయిన; పాపని = బాలుని; రూపుమాపన్ = చంపివేయ; లేకన్ = అలవికాక; ఏకాంతంబునన్ = ఒంటరిగా; దురంత = దాటరాని; చింతా = వగపుచేత; పరిశ్రాంతుండు = అలసినవాడు; అయి = అయ్యి; రాక్షసేంద్రుండు = రాక్షసరాజు; తన = తన యొక్క; మనంబునన్ = మనసులో.
ముంచితిని = ముంచవేసితిని; వార్ధులన్ = సముద్రములలో; గదలన్ = గదలతో; మొత్తితిన్ = మొత్తాను; శైల = పర్వత; తటంబుల్ = చరియల; అందున్ = అందునుండి; ద్రొబ్బించితిన్ = తోయింపించేను; శస్త్ర = కత్తుల; రాజిన్ = అనేకముచే; పొడిపించితిన్ = పొడిపించేను; మీదన్ = శరీరము పైకి; ఇభ = ఏనుగులలో; ఇంద్ర = గొప్పవాని; పంక్తిన్ = గుంపుచేత; ఱొప్పించితిన్ = తొక్కించితిని; ధిక్కరించితిన్ = బెదిరించితిని; శపించితిని = తిట్టితిని; ఘోర = భయంకరమైన; దవాగ్నులు = కార్చిచ్చులు; అందున్ = లో; త్రోయించితిన్ = తోయించితిని; పెక్కు = అనేకమైన; పాట్లన్ = బాధలచే; అలయించితిన్ = కష్టపెట్టితిని; చావడు = చనిపోడు; ఇది = ఇది; ఏమి = ఏమి; చిత్రమో = వింతయోకదా.
భావము:
అంతేకాక, ఏ పాపం ఎరుగని ఆ పసివాడైన ఆ ప్రహ్లాదుడిని, ఎలాగైనా చంపాలని ఎన్నో విధాల ప్రయత్నించాడు. కాని
సాధ్యంకాలేదు. ఆ దానవ చక్రవర్తి హిరణ్యకశిపుడు మనసంతా నిండిన అంతులేని దిగులుతో ఇలా ఆలోచించసాగాడు.
“సముద్రాలలో ముంచింపించాను; గదలతో చావ మోదించాను; కొండలమీద నుంచి
తోయించాను; కత్తులతో పొడిపించాను; క్రింద పడేసి ఏనుగులతో
తొక్కింపించాను; కొట్టించాను; తిట్టించాను; ఎన్నో రకాలుగా
బాధింపించాను; నిప్పుల్లోకి
పడేయించాను; అయినా ఈ కుర్రాడు ప్రహ్లాదుడు చచ్చిపోడు. ఇదెంతో వింతగా ఉందే.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment