Monday, December 21, 2015

ప్రహ్లాదుని హింసించుట - ఒకమాటు దిక్కుంభియూధంబు

7-198-సీ.
కమాటు దిక్కుంభియూధంబుఁ దెప్పించికెరలి డింభకునిఁ ద్రొక్కింపఁ బంపు
నొకమాటు విషభీకరోరగ శ్రేణులడువడి నర్భకుఁ ఱవఁ బంపు
నొకమాటు హేతిసంఘోగ్రానలములోన; విసరి కుమారుని వ్రేయఁ బంపు
నొకమాటు కూలంకషోల్లోల జలధిలోమొత్తించి శాబకు ముంపఁ బంపు;
7-198.1-ఆ.
విషముఁ బెట్టఁ బంపువిదళింపఁగాఁ బంపు; దొడ్డ కొండచఱులఁ ద్రోయఁ బంపుఁ
ట్టి కట్టఁ బంపుబాధింపఁగాఁ బంపుబాలుఁ గినిసి దనుజపాలుఁ డధిప!
టీకా:
          ఒకమాటు = ఒకమారు; దిక్కుంభి = దిగ్గజముల {అష్టదిగ్గజములు - 1ఐరావతము 2పుండరీకము 3వామనము 4కుముదము 5అంజనము 6పుష్పదంతము 7సార్వభౌమము 8సుప్రతీకము అనెడి అష్టదిక్కులందలి దివ్యమైన ఏనుగులు}; యూధంబున్ = గుంపును; తెప్పించి = తెప్పించి; కెరలి = చెలరేగి; డింభకుని = బాలుని; త్రొక్కింపన్ = తొక్కించుటకు; పంపున్ = పంపించును; ఒకమాటు = ఒకమారు; విష = విషముగలిగిన; భీకర = భయప్రదమైన; ఉరగ = పాముల; శ్రేణులన్ = వరుసలను; కడు = మిక్కిలి; వడిన్ = తీవ్రముగా; అర్భకున్ = బాలుని; కఱవన్ = కాటువేయుటకు; పంపున్ = పంపించును; ఒకమాటు = ఒకమారు; హేతి = మంటల; సంఘ = సమూహముతో; ఉగ్ర = భయంకరమైన; అనలము = అగ్ని; లోనన్ = లోనికి; విసిరి = విసిరేసి; కుమారునిన్ = పుత్రుని; వ్రేయన్ = కాల్చివేయుటకు; పంపున్ = పంపించును; ఒకమాటు = ఒకమారు; కూలన్ = గట్టులను, చెలియలికట్టలను; కష = ఒరుసుకొనెడి; ఉల్లోల = పెద్ద అలలుగల; జలధి = సముద్రము; లోన్ = అందు; మొత్తించి = కొట్టించి; శాబకున్ = బాలుని; ముంపన్ = ముంచివేయుటకు; పంపున్ = పంపించును. 
          విషమున్ = విషమును; పెట్టన్ = పెట్టుటకు; పంపున్ = పంపించును; విదళింపగాన్ = చీల్చివేయుటకు; పంపున్ = పంపించును; దొడ్డ = పెద్ద; కొండచఱులన్ = కొండకొనలనుండి; త్రోయన్ = తోసివేయుటకు; పంపున్ = పంపించును; పట్టి = పట్టుకొని; కట్టన్ = కట్టివేయుటకు; పంపున్ = పంపించును; బాధింపగాన్ = పీడించుటకు; పంపున్ = పంపించును; బాలున్ = పిల్లవానిని; కినిసి = కినికి వహించి; దనుజపాలున్ = రాక్షసరాజు; అధిప = రాజా.
భావము:
            ధర్మరాజా! ఆ రాక్షసరాజుకి అనుమానంతో పాటు మరింత కోపం పెరిగిపోయింది. ఒకసారి, దిగ్గజాల లాంటి మదించిన ఏనుగులను తెప్పించి తన కొడుకును క్రింద పడేసి తొక్కించమని పంపాడు; ఇంకోసారి, అతి భీకరమైన అనేక పెద్ద విషసర్పాల చేత గట్టిగా కరిపించమని పంపించాడు; మరోసారి, ఆ పిల్లవాడిని భగభగ ఉగ్రంగా మంటలతో మండుతున్న అగ్నిగుండాలలో పడేయండి అన్నాడు; ఇంకోమాటు, ఆ చిన్న పిల్లవాడిని పట్టుకొని బాగా చితగ్గొట్టి, నడిసముద్రంలో ముంచేసి రండని చెప్పాడు; విషం పెట్టి చంపేయమన్నాడు; కత్తితో నరికేయమన్నాడు; ఎత్తైన కొండ శిఖరాల మీద నుంచి క్రింద లోయలలోకి తోసేయమన్నాడు; కదలకుండా కట్టిపడేయమన్నాడు;. అలా ఆ హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడికి రకరకాల చిత్రహింసలు పెట్టించాడు

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: