Tuesday, December 1, 2015

ప్రహ్లాద చరిత్ర - అంధేందూదయముల్

7-168-శార్దూల విక్రీడితము
అంధేందూదయముల్ మహాబధిరశంఖారావముల్ మూకస
ద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసకవధూకాంక్షల్ కృతఘ్నావళీ
బంధుత్వంబులు భస్మహవ్యములు లుబ్ధద్రవ్యముల్ క్రోడస
ద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల రిక్తవ్యర్థసంసారముల్.
            లోకంలో గుడ్డివాడికి వెన్నెల నిరుపయోగం; చెవిటివాడికి శంఖ ధ్వని వినబడదు; మూగవాడికి గ్రంథపఠనం సాధ్యపడదు; నపుంసకుడికి కాంత మీద కోరికలు ఫలించదు; కృతఘ్నుడికి బంధుత్వం కుదరదు; బూడిదలో పోసిన హోమద్రవ్యాలు నిరుపయోగ మైనవి; పిసినిగొట్టు వాడికి సంపదపనికి వచ్చేది కాదు; పందికి పన్నీరు వంటి సువాసనలు తెలియనే తెలియవు; అలాగే విష్ణు భక్తి లేని వారి జీవితాలు నిస్సారము లైనవి, వ్యర్థము లైనవి. అని భావిస్తాను.
           అంధ = గుడ్డివాని పాలిటి; ఇందు = చంద్రుని; ఉదయముల్ = ఉదయించుటలు; మహా = మిక్కిలి; బధిర = చెవిటివానిచెంత; శంఖ = శంఖముయొక్క; ఆరావముల్ = శబ్దములు; మూక = మూగవానిచేత; సత్ = మంచి; గ్రంథ = గ్రంథములను; ఆఖ్యాపనముల్ = చెప్పించుటలు; నపుంసక = మగతనములేనివాని; వధూకాంక్షల్ = మగువలపొందుకోరుటలు; కృతఘ్నా = మేలుమరచెడి; ఆవళీ = సమూహముతోటి; బంధుత్వంబులు = చుట్టరికములు; భస్మ = బూడిదలోపోసిన; హవ్యములు = హోమములు; లుబ్ద = లోభియొక్క; ద్రవ్యముల్ = సంపదలు; క్రోడ = పందికైన; సద్గంధంబుల్ = సువాసనలు; హరి = నారాయణుని; భక్తి = భక్తిని; వర్జితుల = వదలినవారి; రిక్త = శూన్యములైన; వ్యర్థ = ప్రయోజనహీనములైన; సంసారముల్ = సంసారములు.
७-१६८-शार्दूल विक्रीडितमु
अंधेंदूदयमुल् महाबधिरशंखारावमुल् मूकस
द्ग्रंथाख्यापनमुल् नपुंसकवधूकांक्षल् कृतघ्नावळी
बंधुत्वंबुलु भस्महव्यमुलु लुब्धद्रव्यमुल् क्रोडस
द्गंधंबुल् हरिभक्ति वर्जितुल रिक्तव्यर्थसंसारमुल्.  
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: