Saturday, December 12, 2015

ప్రహ్లాదుని హింసించుట - పంచాబ్దంబులవాడు

7-186-వ.
అని రాక్షసవీరుల నీక్షించి యిట్లనియె.
7-187-శా.
"పంచాబ్దంబులవాఁడు తండ్రి నగు నా క్షంబు నిందించి య
త్కించిద్భీతియు లేక విష్ణు నహితుం గీర్తించుచున్నాఁడు వ
ల్దంచుం జెప్పిన మానఁ డంగమునఁ బుత్రాకారతన్ వ్యాధి జ
న్మించెన్ వీని వధించి రండు దనుజుల్ మీమీ పటుత్వంబులన్."
టీకా:
            అని = అని; రాక్షసవీరులన్ = వీరులైన రాక్షసులను; ఈక్షించి = చూసి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
            పంచ = ఐదు (5); అబ్దంబుల = సంవత్సరములవయసు; వాడు = వాడు; తండ్రి = తండ్రి; అగు = అయిన; నా = నా; పక్షంబున్ = మతమును; నిందించి = నిందించి; యత్ = ఏ; కించిత్ = కొంచముయైన; భీతిన్ = భయము; లేక = లేకుండగ; విష్ణున్ = నారాయణుని; అహితున్ = విరోధిని; కీర్తించుచున్నాడు = స్తుతించుచున్నాడు; వల్దు = వద్దు; అంచున్ = అనుచు; చెప్పినన్ = చెప్పినపప్పటికి; మానండు = మానివేయడు; అంగమునన్ = దేహములో; పుత్ర = కుమారుని; ఆకారతన = రూపుతో; జన్మించెన్ = పుట్టెను; వీని = ఇతని; వధించి = చంపి; రండు = రండి; దనుజుల్ = రాక్షసులారా; మీమీ = మీయొక్క; పటుత్వంబులన్ = బలముకొలది.
భావము:
            పినతండ్రిని చంపాడని బాధపడకుండా ఈ పిల్లాడు చూడండి ఆ శత్రువును కీర్తిస్తున్నాడు అని పలికి, హిరణ్యకశిపుడు వీరులైన తన రాక్షస భటులను ఇలా ఆదేశించాడు.
            “రాక్షసులారా! వీడేమో ఇంతా చేసి అయిదేండ్ల వాడు. చూడండి, కన్న తండ్రిని నన్నే ఎదిరిస్తున్నాడు. నన్ను లెక్క చేయకుండా, నదురు బెదురు లేకుండా, నా ఎదుటే శత్రువైన హరిని పొగడుతున్నాడు. “వద్దురా కన్నా!” అని నచ్చజెప్పినా వినటం లేదు. నా శరీరంలో పుట్టిన వ్యాధిలా పుత్రరూపంలో పుట్టుకొచ్చాడు. అందుచేత, మీరు ఈ ప్రహ్లాదుడిని తీసుకెళ్లి వధించి రండి. మీమీ పరాక్రమాలు ప్రదర్శించండి,” అని ఆదేశించి ఇంకా ఇలా అన్నాడు.

७-१८६-व. 
अनि राक्षसवीरुल नीक्षिंचि यिट्लनिये.
७-१८७-शा. 
"पंचाब्दंबुलवाँडु तंड्रि नगु ना पक्षंबु निंदिंचि य
त्किंचिद्भीतियु लेक विष्णु नहितुं गीर्तिंचुचुन्नाँडु व
ल्दंचुं जेप्पिन मानँ डंगमुनँ बुत्राकारतन् व्याधि ज

न्मिंचेन् वीनि वधिंचि रंडु दनुजुल् मीमी पटुत्वंबुलन्."

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: