7-193-ఉ.
తన్ను నిశాచరుల్ పొడువ దైత్యకుమారుఁడు మాటిమాటి "కో!
పన్నగశాయి! యో! దనుజభంజన! యో! జగదీశ! యో! మహా
పన్నశరణ్య! యో! నిఖిలపావన!" యంచు నుతించుఁ గాని తాఁ
గన్నుల నీరు దేఁడు భయకంపసమేతుఁడు గాఁడు భూవరా!
టీకా:
తన్నున్ = తనను; నిశాచరుల్ = రాక్షసులు {నిశాచరులు - నిశ (రాత్రి) యందు చరులు (తిరుగువారు), రాక్షసులు}; పొడువన్ = పొడవగా; దైత్య = రాక్షస; కుమారుడు = బాలుడు; మాటిమాటికిన్ = అస్తమాను {మాటిమాటికి - ప్రతిమాటకు, అస్తమాను}; ఓ = ఓ; పన్నగశాయి = హరి {పన్నగశాయి - పన్నగ (శేషసర్పము)
పైనశాయి(శయనించువాడు), విష్ణువు}; ఓ = ఓ ; దనుజభంజన = హరి {దనుజభంజనుడు - దనుజ (రాక్షసులను) భంజనుండు (సంహరించువాడు), విష్ణువు}; ఓ = ఓ ; జగదీశ = హరి {జగదీశుడు - జగత్ (విశ్వమంతటకు) ఈశుడు (ప్రభువు), విష్ణువు}; ఓ = ఓ ; మహాపన్నశరణ్య = హరి {మహాపన్నశరణ్యుడు - మహా (గొప్ప) ఆపన్న (ఆపదలను పొందినవారికి) శరణ్యుడు (శరణమునిచ్చువాడు), విష్ణువు}; ఓ = ఓ ; నిఖిలపావన = హరి {నిఖిలపావనుడు - నిఖిల (సమస్తమును) పావనుడు (పవిత్రముజేయువాడు), విష్ణువు}; అంచున్ = అనుచు; నుతించున్ = కీర్తించును; కాని = అంతే కాని; తాన్ = తను; కన్నులన్ = కళ్ళమ్మట; నీరు = కన్నీరు; తేడు = తీసుకురాడు; భయ = భయముచే; కంప = వణుకు; సమేతుడు = తోకూడినవాడు; కాడు = కాడు; భూవరా = రాజా {భూవర - భూమికి వరుడు(భర్త), రాజు}.
భావము:
ఓ ధర్మరాజా! ఇలా రాక్షసులు తనను ఎంత క్రుమ్మినా, ప్రహ్లాదుడు మాటిమాటికీ “ఓ శేషశయనా! ఓ
రాక్షసాంతకా! ఓ లోకనాయకా! ఓ దీనరక్షాకరా! ఓ సర్వపవిత్రా!” అని రకరకాలుగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాడు తప్పించి; కన్నీళ్ళు పెట్టటం లేదు; ఏ మాత్రం భయపడటం లేదు; కనీసం జంకటం లేదు.
७-१९३-उ.
तन्नु निशाचरुल् पोडुव
दैत्यकुमारुँडु माटिमाटि "को!
पन्नगशायि! यो! दनुजभंजन!
यो! जगदीश! यो! महा
पन्नशरण्य! यो!
निखिलपावन!" यंचु नुतिंचुँ गानि ताँ
गन्नुल नीरु देँडु
भयकंपसमेतुँडु गाँडु भूवरा!
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment