Tuesday, December 22, 2015

ప్రహ్లాదుని హింసించుట - ఒకవేళ నభిచార

7-199-సీ.
కవేళ నభిచార హోమంబు చేయించునొకవేళ నెండల నుండఁ బంచు
నొకవేళ వానల నుపహతి నొందించునొకవేళ రంధ్రంబు లుక్కఁ బట్టు
నొకవేళఁ దన మాయ నొదవించి బెగడించునొకవేళ మంచున నొంటి నిలుపు
నొకవేళఁ బెనుగాలి కున్ముఖుఁ గావించునొకవేళఁ బాఁతించు నుర్వి యందు;
7-199.1-తే.
నీరు నన్నంబు నిడనీక నిగ్రహించుశల నడిపించు; ఱువ్వించు గండశిలల
దల వ్రేయించు; వేయించు నశరములఁగొడుకు నొకవేళ నమరారి క్రోధి యగుచు.
టీకా:
          ఒకవేళ = ఒకసమయమున; అభిచార = మారణ, శ్యేనయాగాది; హోమంబు = హోమములను; చేయించున్ = చేయించును; ఒకవేళ = ఒకసమయమున; ఎండలన్ = ఎండలలో; ఉండన్ = ఉండుటకు; పంచున్ = పంపించును; ఒకవేళ = ఒకసమయమున; వానలన్ = వానలలో; ఉపహతిన్ = ఉంచబడుటను; ఒందించున్ = పొందించును; ఒకవేళ = ఒకసమయమున; రంధ్రంబుల్ = నవరంధ్రములు; ఉక్కన్ = ఊపిరిసలపకుండగ; పట్టున్ = పట్టుకొనును; ఒకవేళ = ఒకసమయమున; తన = తన యొక్క; మాయన్ = మాయను; ఒదవించి = కలిగించి; బెగడించున్ = భయపెట్టును; ఒకవేళ = ఒకసమయమున; మంచునన్ = మంచునందు; ఒంటిన్ = ఒంటరిగా; నిలుపున్ = నిలబెట్టును; ఒకవేళ = ఒకసమయమున; పెనుగాలి = పెనుగాలి; కిన్ = కి; ఉన్ముఖున్ = ఎదురుగానుండువాని; కావించున్ = చేయును; ఒకవేళ = ఒకసమయమున; పాతించున్ = పాతిపెట్టించును; ఉర్విన్ = మట్టి; అందున్ = లో. 
          నీరున్ = నీళ్ళు; అన్నంబున్ = ఆహారము; ఇడనీక = ఇవ్వనీయకుండగ; నిగ్రహించున్ = ఆపించును; కశలన్ = కొరడాలతో; అడిపించున్ = కొట్టించును; ఱువ్వించున్ = మీదకు విసిరించును; గండశిలలన్ = గండరాళ్ళతో; గదలన్ = గదలతో; వ్రేయించున్ = బాదించును; వేయించున్ = వేయించును; ఘన = పెద్ద; శరములన్ = బాణములతో; కొడుకున్ = కొడుకును; ఒకవేళ = ఒకసమయమున; అమరారి = రాక్షసుడు {అమరారి - అమరుల (దేవతలయొక్క) అరి (శత్రువు), రాక్షసుడు}; క్రోధి = కోపముగలవాడు; అగుచు = అగుచు.
భావము:
            దేవతల పాలిటి శత్రువు అయిన ఆ హిరణ్యకశిపుడు అంతులేని కోపంతో కొడుకును సంహరించడం కోసం చేయరానివి అన్నీ చేశాడు. ఒకరోజు, మారణహోమం చేయించాడు, ఇంకో నాడు, మండుటెండలలో నిలువునా నిలబెట్టాడు, మరొక రోజు ఉపద్రవంగా కురుస్తున్న జడివానలోకి గెంటాడు. కుర్ర వాడి నవ రంధ్రాలు మూసి ఉక్కిరిబిక్కిరి చేయించాడు. మరొక నాడు, అంత చిన్న పసివాడికి తన మాయలు అన్నీ చూపించి భయపెట్టాడు. ఇంకోసారి, గడ్డ కట్టించే చలిగా ఉండే మంచులో ఒంటరిగా ఉంచేశాడు. మరొక రోజు, గాలిదుమారంలో ఎదురుగా నిలబెట్టేశాడు. మరొక సారి భూమిలో పాతి పెట్టేశాడు. ఆఖరుకి అన్నం నీళ్ళు ఇవ్వకుండా కడుపు మాడిపించాడు. కొరడాలతో కొట్టించాడు. గదలతో మోదించాడు. చివరికి చిన్న పిల్లాడు అని చూడకుండా అతని మీదికి రాళ్లు రువ్వించాడు. బాణాలు వేయించాడు. అలా ఒళ్లు తెలియని క్రోధంతో కన్న కొడుకును ఆ క్రూర దానవుడు చేయరాని ఘోరాతి ఘోరాలు అన్నీ చేయించాడు.

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: