Thursday, August 6, 2015

బ్రహ్మవరములిచ్చుట - అని పలికి

7-84-వచనము
అని పలికి వనమక్షికాపిపీలికాభక్షితం బైన రక్షోవిభుని దేహంబు మీఁదం గమండలు జలంబులు ప్రోక్షించిన నద్దానవేంద్రుండు గమలాసనకరకమల కమనీయ కనకమయ దివ్యామోఘ కమండలు నిర్గత నిర్మల నీరధారా బిందుసందోహ సంసిక్త సకలాంగుం డయి తపంబు చాలించి సాంద్రకీచకసంఘాత సంఛాదిత వామలూరుమధ్యంబు వెలువడి మహాప్రభావ బలసౌందర్యతారుణ్య సహితుండును, వజ్రసంకాశ దేహుండును, దప్తసువర్ణుండును నై నీరసేంధననికర నిర్గత వహ్నియునుంబోలె వెలుంగుచుం జనుదెంచి.
            బ్రహ్మదేవుడు ఇలా అని ఈగలు, చీమలు కొరికిన రాక్షసరాజు హిరణ్యకశిపుని శరీరంపై కమండలంలోని నీళ్ళు చిలకరించాడు. అతను తపస్సు చాలించి దట్టమైన వెదురుపొదలతో నిండిన పుట్టలోంచి బయటకు వచ్చాడు. కమండలం సామాన్యమైనదా. అది పద్మాసనుడు తన హస్తపద్మాలతో పట్టుకొనే బహు దివ్యమైన బంగారు కమండలం. అంతటి అమోఘమైన కమండలం లోంచి వెలువడిన నీటి బిందువులతో అతను తడిసాడుగొప్ప తేజస్సు, బలం, సౌందర్యం, యౌవనం సంతరించుకున్నాడు. అతని దేహం వజ్రంలా దృఢంగా అయింది. పుటంపెట్టిన బంగారంలా మెరిసిపోతోంది. అలా అతను ఎండిన కట్టెలలోనుండి వచ్చే మంటలలా ఉజ్వలంగా మెరిసిపోతున్నాడు.
-८४-वचनमु
अनि पलिकि वनमक्षिकापिपीलिकाभक्षितं बैन रक्षोविभुनि देहंबु मीँदं गमंडलु जलंबुलु प्रोक्षिंचिन नद्दानवेंद्रुंडु गमलासनकरकमल कमनीय कनकमय दिव्यामोघ कमंडलु निर्गत निर्मल नीरधारा बिंदुसंदोह संसिक्त सकलांगुं डयि तपंबु चालिंचि सांद्रकीचकसंघात संछादित वामलूरुमध्यंबु वेलुवडि महाप्रभाव बलसौंदर्यतारुण्य सहितुंडुनु, वज्रसंकाश देहुंडुनु, दप्तसुवर्णुंडुनु नै नीरसेंधननिकर निर्गत वह्नियुनुंबोले वेलुंगुचुं जनुदेंचि.
          అని = అని; పలికి = చెప్పి; వన = అడవి; మక్షికా = ఈగలు; పిపీలికా = చీమలచేతను; భక్షితంబు = కొరకబడినది; ఐన = అయిన; రక్షోవిభుని = హిరణ్యకశిపుని {రక్షోవిభుడు - రక్షః (రాక్షసులకు) విభుడు (ప్రభువు), హిరణ్యకశిపుడు}; దేహంబు = శరీరము; మీదన్ = పైన; కమండలు = కమండలములోని; జలంబులు = నీరు; ప్రోక్షించినన్ = జల్లగా; = ; దానవేంద్రుండు = హిరణ్యకశిపుడు {దానవేంద్రుడు - దానవ (రాక్షసుల)కు ఇంద్రుడు (ప్రభువు), హిరణ్యకశిపుడు}; కమలాసన = బ్రహ్మదేవుని {కమలాసనుడు - కమలమును ఆసనముగా కలవాడు, బ్రహ్మదేవుడు}; కర = చేతులు యనెడి; కమల = పద్మముల; కమనీయ = అందమైన; కనకమయ = బంగారపు; దివ్య = దివ్యమైన; అమోఘ = వ్యర్థముకాని, తిరుగులేని; కమండలు = కమండలమునుండి; నిర్గత = వెలువడిన; నిర్మల = స్వచ్ఛమైన; నీర = నీటి; ధారా = ధారలయొక్క; బిందు = చుక్కల; సందోహ = సమూహములచే; సంసిక్త = తడసిన; సకల = సర్వ; అంగుండు = అవయవములుగలవాడు; అయి = ; తపంబున్ = తపస్సును; చాలించి = ఆపివేసి; సాంద్ర = దట్టమైన; కీచక = వెదురుపొదల; సంఘాత = సమూహములచే; సంఛాదిత = కప్పబడిన; వామలూరు = పుట్ట; మధ్యంబు = నడుమనుండి; వెలువడి = బయటకొచ్చి; మహా = గొప్ప; ప్రభావ = మహిమ; బల = శక్తి; సౌందర్య = అందము; తారుణ్య = ప్రాయములతో; సహితుండును = కూడినవాడు; వజ్ర = వజ్రముతో; సంకాశ = పోల్చదగిన; దేహుండును = శరీరముగలవాడు; తప్త = పుటముపెట్టిన; సువర్ణుండును = బంగారురంగుమేనుగలవాడు; = అయ్యి; నీరస = ఎండిన, తడిలేని; ఇంధన = కట్టెలనుండి; నిర్గత = వెలువడిన; వహ్నియున్ = అగ్ని; పోలెన్ = వలె; వెలుంగుచున్ = ప్రకాశించుచు; చనుదెంచి = వచ్చి.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: