7-88-వచనము
దేవా! నీవు ముఖ్యప్రాణం బగుటంజేసి ప్రజాపతివి; మనోబుద్ధి చిత్తేంద్రియంబులకు నధీశ్వరుండవు; మహాభూతగణంబులకు నాధారభూతుండవు; త్రయీతనువునం గ్రతువులు విస్తరింతువు; సకల విద్యలు నీ తనువులు; సర్వార్థసాధకులకు సాధనీయుండ; వాత్మనిష్ఠాగరిష్ఠులకు ధ్యేయంబగు నాత్మవు; కాలమయుండవై జనులకు నాయుర్నాశంబు జేయుదువు; జ్ఞానవిజ్ఞానమూర్తి; వాద్యంతరహితుండ; వంతరాత్మవు; మూఁడు మూర్తులకు మూలంబగు పరమాత్మవు; జీవలోకంబునకు జీవాత్మవు; సర్వంబును నీవ నీవుగానిది లేశంబును లేదు; వ్యక్తుండవు గాక పరమాత్మవై పురాణపురుషుండవై యనంతుడవైన నీవు ప్రాణేంద్రియ మనోబుద్ధి గుణంబుల నంగీకరించి, పరమేష్ఠిపద విశేషంబున నిలిచి, స్థూలశరీరంబునం జేసి యింతయుం బ్రపంచింతువు; భగవంతుఁడవైన నీకు మ్రొక్కెద" నని మఱియు నిట్లనియె.
బ్రహ్మదేవా! నువ్వు సూత్రాత్మవు. ప్రాణానికి ప్రాణానివి. ప్రజాపతివి. ప్రజలుచే జపించ తగినవాడవు. మనస్సుకి, బుద్ధికి, చిత్తానికి, ఇంద్రియాలకి అధిపతివి. భూమి, నీరు, వాయువు, తేజస్సు, ఆకాశము అనే పంచమహాభూతాలకు ఆధార మైనవాడవు. వేదం అనే శరీరంతో యజ్ఞయాగాదులను వ్యాప్తి చేయువాడవు. సమస్త విద్యలు నీ శరీరమే. అత్యున్నత ఆధ్యాత్మిక విద్యా సాధకులచే ధ్యానింప బడువాడవు. బ్రహ్మవిద్యావేత్తల చేత ధ్యానింప బడువాడవు. పరమాత్మవు. కాలస్వరూపుడవు అయి ప్రజల ఆయుస్సులను నశింపచేసే వాడవు నీవే. జ్ఞాన విజ్ఞానాలు మూర్తీభవించినవాడవు. మొదలు తుది లేని వాడవు. జీవులలోని అంతరాత్మవు. త్రిమూర్తులు అగు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు మూలమైన పరమాత్మవు. జీవకోటికి జీవాత్మవు. ఈ సృష్టిలోని సర్వం నీవే. నీవు కానిది మరేదీ లేదు. నిన్ను ఎవరు తెలిసికోలేరు. నీవు పరమాత్మవు. పురాణపురుషుడవు. అనంతుడవు. అట్టి నీవు ప్రాణం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, గుణాలు పొంది పరమేష్ఠి పదవిని అందుకున్నావు. స్థూల శరీరంతో ఈవిధంగా విస్తరిస్తావు. నీవు భగవానుడవు. నీకు నమస్కారములు.” అని స్తుతించి ఇంకా ఇలా అన్నారు.
७-८८-वचनमु
देवा! नीवु मुख्यप्राणं बगुटंजेसि प्रजापतिवि; मनोबुद्धि चित्तेंद्रियंबुलकु
नधीश्वरुंडवु; महाभूतगणंबुलकु
नाधारभूतुंडवु; त्रयीतनुवुनं
ग्रतुवुलु विस्तरिंतुवु; सकल विद्यलु नी तनुवुलु; सर्वार्थसाधकुलकु साधनीयुंड; वात्मनिष्ठागरिष्ठुलकु ध्येयंबगु नात्मवु; कालमयुंडवै जनुलकु नायुर्नाशंबु
जेयुदुवु; ज्ञानविज्ञानमूर्ति; वाद्यंतरहितुंड; वंतरात्मवु; मूँडु
मूर्तुलकु मूलंबगु परमात्मवु; जीवलोकंबुनकु जीवात्मवु; सर्वंबुनु नीव नीवुगानिदि लेशंबुनु लॅदु; व्यक्तुंडवु गाक परमात्मवै पुराणपुरुषुंडवै यनंतुडवैन नीवु प्राणेंद्रिय
मनोबुद्धि गुणंबुल नंगीकरिंचि, परमेष्ठिपद विशॅषंबुन निलिचि, स्थूलशरीरंबुनं जेसि यिंतयुं ब्रपंचिंतुवु; भगवंतुँडवैन नीकु
म्रोक्केद" ननि मर्रियु निट्लनिये.
దేవా = బ్రహ్మదేవుడా; నీవు = నీవు; ముఖ్యఫ్రాణంబు = సూత్రాత్మ; అగుటన్ = అగుట; చేసి = వలన; ప్రజాపతివి = ప్రజలకు జపన హేతువవు; మనః = మనసు; బుద్ధి = బుద్ధి; చిత్ = చిత్తు; ఇంద్రియంబుల్ = ఇంద్రియముల; కున్ = కు; అధీశ్వరుండవు = ప్రభువవు; మహా = గొప్ప; భూత = జీవ; గణంబుల్ = రాశుల; కున్ = కు; ఆధారభూతుండవు = ఆధారమైనవాడవు; త్రయీ = వేదత్రయమయమైన; తనువునన్ = శరీరముతో; క్రతువులు = యజ్ఞములు; విస్తరింతువు = వ్యాప్తిచేసెదవు; సకల = సమస్తమైన; విద్యలు = విద్యలు; నీ = నీ యొక్క; తనువులున్ = శరీరములు; సర్వార్థసాధకుల్ = సర్వార్థసాధకులు {సర్వార్థసాధకులు - సర్వోత్తమైన ప్రయోజనమనకై (పరమహంస పదవికై) సాధన చేయువారు}; కున్ = కు; సాధనీయుండవు = సాధన చేయబడ దగిన వాడవు; ఆత్మ = బ్రహ్మవిద్యా; నిష్టా = నిష్టగలవారియందు; గరిష్టుల్ = శ్రేష్ఠుల; కున్ = కు; ధ్యేయంబు = ధ్యానింపదగినది; అగు = అయిన; ఆత్మవు = పరమాత్మవు; కాలమయుండవు = కాలస్వరూపివి; ఐ = అయ్యి; జనుల్ = ప్రజల; కున్ = కు; ఆయుః = జీవితకాలమును; నాశంబు = హరించుట; చేయుదువు = చేసెదవు; జ్ఞాన = పరావిద్య; విజ్ఞాన = అపరవిద్యల; మూర్తివి = స్వరూపివి; ఆద్యంతరహితుండవు = మొదలు తుది లేనివాడవు; అంతరాత్మవు = జీవులలోపలి చైతన్యమవు; మూడుమూర్తుల = త్రిమూర్తులతత్వమున {త్రిమూర్తులు - బ్రహ్మవిష్ణుమహేశ్వరులు}; కున్ = కు; మూలంబు = మూలాధారము; అగు = అయిన; పరమాత్మవు = పరమాత్మవు; జీవ = ప్రాణులు; లోకంబున్ = సర్వుల; కున్ = కు; జీవ = ప్రాణస్వరూపమై; ఆత్మవు = లోపలనుండెడివాడవు; సర్వంబును = సమస్తమును; నీవ = నీవే; నీవు = నీవు; కానిది = కానట్టిది; లేశంబును = కొంచముకూడ; లేదు = లేదు; వ్యక్తుండవు = తెలియగలవాడవు; కాక = కాకుండగ; పరమాత్మవు = పరమాత్మవు; ఐ = అయ్యి; పురాణపురుషుండవు = ఆదిమూర్తివి; ఐ = అయ్యి; అనంతుడవు = అంతములేనివాడవు; ఐన = అయిన; నీవు = నీవు; ప్రాణ = ప్రాణములు; ఇంద్రియ = ఇంద్రియములు; మనః = మనస్సు; బుద్ధి = బుద్ధి; గుణంబులన్ = త్రిగుణములను; అంగీకరించి = స్వీకరించి; పరమేష్ఠి = బ్రహ్మదేవ {పరమేష్ఠి - పరమ (అత్యుత్తమమైన) ఇష్ఠి (యత్నము గలవాడు), బ్రహ్మ}; పదవిన్ = అధికారమైన; విశేషంబునన్ = విశిష్ఠతయందు; నిలిచి = స్థిరుడవై; స్థూలశరీరంబునన్ = బాహ్యశరీరము; చేసి = వలన; ఇంతయున్ = ఈ సృష్టినంతను; ప్రపంచింతువు = విస్తరింపజేయుదువు; భగవంతుడవు = పూజ్యుడవు; ఐన = అయిన; నీకున్ = నీకు; మ్రొక్కెదన్ = నమస్కరించెదను; అని = అని; మఱియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment