Sunday, August 2, 2015

బ్రహ్మవరములిచ్చుట - అని దేవతలు


7-80-వచనము
అని దేవతలు విన్నవించిన స్వయంభూతుండును భగవంతుండును నైన నలుమొగంబులప్రోడ భృగుదక్షాదులతోడ మందరపర్వతంబునకు వచ్చి యందు నియమయుక్తుండును, బిపీలకావృత మేదోమాంసచర్మరక్తుండును, వల్మీకతృణవేణు పరిచ్ఛన్నుండును, మహాతపఃప్రభావ సంపన్నుండును నై నీరంధ్ర నిబిడ నీరద నికర నివిష్ట నీరజబంధుండునుం బోలె నివసించి యున్న నిర్జరారాతిం జూచి వెఱఁగుపడి నగుచు నిట్లనియె.
          ఈ విధంగా దేవతలు హిరణ్యకశిపుడి తపస్సు ఆపించమని మనవి చేసారు. స్వయంభువుడు, చతుర్ముఖుడు అయిన ఆ భగవంతుడు భృగు మహర్షి, ధక్ష ప్రజాపతి మెదలగు ప్రముఖులను వెంటపెట్టుకుని అతను తపస్సు చేస్తున్న మంథర పర్వతానికి బయలుదేరాడు. అక్కడ ఆ రాక్షసుడు కఠోర నియమాలతో దీక్షపట్టి మహా గొప్ప తపస్సు చేస్తున్నాడు. వంటినిండా చీమలు పట్టేసి మజ్జ, మాంసం, చర్మం కొరుక్కుతింటున్నాయి. చుట్టూ పుట్టలూ, గడ్డిదుబ్బులూ, వెదురుపొదలూ పెరిగిపోయి, వాటి మధ్య మరుగుపడి కనిపించటంలేదు. నల్లటి దట్టమైన నీటిమేఘాలచే కప్పబడిన సూర్యునిలా, మహా తపస్సు యొక్క ప్రభావంతో ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇది చూసి చతుర్ముఖబ్రహ్మ ఆశ్చర్యంతో చిరునవ్వులు నవ్వుతూ హిరణ్యకశిపుడితో ఇలా అన్నాడు. 
ब्रह्मवरमुलिच्चुट
७-८०-वचनमु
अनि देवतलु विन्नविंचिन स्वयंभूतुंडुनु भगवंतुंडुनु नैन नलुमोगंबुलप्रोड भृगुदक्षादुलतोड मंदरपर्वतंबुनकु वच्चि यंदु नियमयुक्तुंडुनु, बिपीलकावृत मेधोमांसचर्मरक्तुंडुनु, वल्मीकतृणवेणु परिच्छन्नुंडुनु, महातपःप्रभाव संपन्नुंडुनु नै नीरंध्र निबिड नीरद निकर निविष्ट नीरजबंधुंडुनुं बोले निवसिंचि युन्न निर्जरारातिं जूचि वेर्रँगुपडि नगुचु निट्लनिये.
          అని = అని; దేవతలు = దేవతలు; విన్నవించిన = మనవి చేయగా; స్వయంభూతుండును = తనంత తనే పుట్టినవాడు; భగవంతుండు = ఐశ్వర్యములు కలుగుటచే పూజ్యు డైనవాడు; ఐన = అయిన; నలుమొగములప్రొడ = బ్రహ్మదేవుడు {నలుమొగములప్రోడ - నలు (నాలుగు 4) మొగముల (ముఖములుగల) ప్రోడ (పెద్ద), బ్రహ్మ}; భృగు = భృగువు; దక్ష = దక్షుడు; ఆదుల = మొదలగువారి; తోడ = తోటి; మందర = మందరము యనెడి; పర్వతంబున్ = పర్వతమున; కున్ = కు; వచ్చి = వచ్చి; అందున్ = అక్కడ; నియమ = తపోనియములతో; యుక్తుండును = కూడినవాడు; పిపీలకా = చీమలు; ఆవృత = పట్టిన; మేద = కొవ్వు; మాంస = మాంసము; చర్మ = చర్మము; రక్తుండును = రక్తములుగలవాడును; వల్మీక = పుట్టలు; తృణ = గడ్డిదుబ్బులు; వేణు = వెదురుపొదలతో; పరిచ్ఛన్నుండును = కప్పబడినవాడు; మహా = గొప్ప; తపస్ = తపస్సు యొక్క; ప్రభావ = మహిమ అనెడి; సంపన్నుండును = సంపదలు గలవాడు; = అయ్యి; నీరంధ్ర = తెఱపిలేక; నిబిడ = మూగిన; నీరద = మబ్బుల; నికర = సమూహము లందు; నివిష్ట = చుట్టబడినట్టి; నీరజబంధుండున్ = సూర్యుని; పోలెన్ = వలె; నివసించి = నిలబడి; ఉన్న = ఉన్నట్టి; నిర్జరారాతి = హిరణ్యకశిపుని {నిర్ఝరారాతి - నిర్ఝర (దేవతల) ఆరాతి (శత్రువు), రాక్షసుడు}; చూచి = గమనించి; వెఱగుపడి = నివ్వెరపోయి; నగుచున్ = నవ్వుతు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: