7-208-వ.
అని గురుపుత్రులు
పలికిన రాక్షసేశ్వరుండు "గృహస్థులైన రాజులకు
నుపదేశింపఁ దగిన ధర్మార్థ కామంబులు ప్రహ్లాదునకు
నుపదేశింపుఁ" డని యనుజ్ఞ జేసిన, వారు నతనికిఁ ద్రివర్గంబు నుపదేశించిన
నతండు రాగద్వేషంబులచేత విషయాసక్తులైన వారలకు గ్రాహ్యంబు లైన ధర్మార్థకామంబులుఁ దనకు నగ్రాహ్యంబు లనియును వ్యవహార ప్రసిద్ధికొఱకైన భేదంబు గాని యాత్మభేదంబు లేదనియును ననర్థంబుల
యందర్థకల్పన చేయుట దిగ్భ్రమం బనియు నిశ్చయించి, గురూపదిష్ట శాస్త్రంబులు మంచివని తలంపక గురువులు దమ గృహస్థ కర్మానుష్టానంబులకుం బోయిన సమయంబున.
టీకా:
అని
= అని; గురుపుత్రులు = చండామార్కులు {గురుపుత్రులు - శుక్రాచార్యుని
కుమారులు, చండామార్కులు}; పలికినన్ = చెప్పగా; రాక్షసేశ్వరుండు = రాక్షసరాజ; గృహస్థులు = వివాహమైనవారు; ఐన = అయినట్టి; రాజుల్ = రాజుల; కున్ = కు; ఉపదేశింపన్ = తెలుపుటకు; తగిన = అర్హమైన; ధర్మార్థకామంబులు = ధర్మార్థకామములను; ప్రహ్లాదున్ = ప్రహ్లాదున; కున్ = కు; ఉపదేశింపుడు = తెలియజెప్పండి; అని = అని; అనుజ్ఞ = ఆనుమతి; చేసినన్ = ఇవ్వగా; వారున్ = వారుకూడ; అతని = అతని; కిన్ = కి; త్రివర్గంబున్ = ధర్మార్థకామములను; ఉపదేశించిన = చెప్పగా; అతండు = అతడు; రాగ = అనురాగము; ద్వేషంబుల = విరోధముల; చేతన్ = వలన; విషయ = ఇంద్రియార్థములందు; ఆసక్తులు = ఆసక్తిగలవారు; ఐన = అయిన; వారల = వారి; కిన్ = కి; గ్రాహ్యంబులు = గ్రహింపదగినవి; ఐన = అయిన; ధర్మార్థకామంబులు = ధర్మార్థకామములు; తన = తన; కున్ = కు; అగ్రాహ్యంబులు = గ్రహింపదగినవి కాదు; అనియున్ = అని; వ్యవహార = వ్యవహారముల; ప్రసిద్ది = మిక్కిలి సిధ్ధించుట; కొఱకు = కోసము; ఐన = అయిన; భేదంబు = భేదములే; కాని = తప్పించి; ఆత్మన్ = వానిలో; భేదంబు = భేదము; లేదు = లేదు; అనియున్ = అని; అనర్థంబులన్ = ప్రయోజనములుకానివాని; అందున్ = లో; అర్థ = ప్రయోజనములను; కల్పన = ఊహించుకొనుట; చేయుట = చేయుట; దిగ్భ్రమంబు = భ్రాంతి; అనియున్ = అని; నిశ్చయించి = నిశ్చయించుకొని; గురు = గురువులచే; ఉపదిష్ట = ఉపదేశింపబడిన; శాస్త్రంబులు = చదువులు; మంచివి = మంచివి; అని = అని; తలంపక = భావింపక; గురువులు = గురువులు; తమ = తమ యొక్క; గృహస్థ = ఇంటియందున్న; కర్మ = కార్యములను; అనుష్టానంబుల్ = చేయుట; కున్ = కు; పోయిన = వెళ్ళిన; సమయంబున = సమయమునందు.
భావము:
ఇలా శుక్రుని కొడుకులు బోధించి చెప్పటంతో, ఆ దానవ చక్రవర్తి శాంతించాడు.
“వివాహమైన క్షత్రియులు నేర్చదగిన
ధర్మ అర్థ కామములను ప్రహ్లాదుడికి నేర్పండి” అని ఆదేశించాడు. గురువులు చండామార్కులు ఆవిధంగానే చెప్పసాగారు. కాని “నానా
విధాలైన కోరికలు కలవారికి ఈ
ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం, కామశాస్త్రం కావాలి. కనుక ఈ గురువులు చెప్పే పాఠాలు
మంచివి కావు. లోక వ్యవహారం కోసమే ఈ తేడాలు తప్ప, ఆత్మకు మాత్రం ఏ మార్పులు
లేవు. ప్రయోజనం లేని వీటి గురించి ఏదో ప్రయోజనం ఉంది అనుకోవడం భ్రాంతి మాత్రమే.” అని ప్రహ్లాదుడు నిశ్చయం చేసుకున్నాడు. గురువులు తమ గృహకృత్యాలు, జపాలు, తపాలు మున్నగు నిత్యకృత్యాలు కోసం వెళ్ళే సమయం గమనించాడు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :