Tuesday, January 28, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 185

తనవెంటన్

8-98-మ.
వెంటన్ సిరి; లచ్చివెంట నవరోవ్రాతమున్; దాని వె
న్కనుఁ బక్షీంద్రుఁడు; వాని పొంతను ధనుః కౌమోదకీ శంఖ చ
క్ర నికాయంబును; నారదుండు; ధ్వజినీకాంతుండు రా వచ్చి రొ
య్య వైకుంఠపురంబునం గలుగువా రాబాలగోపాలమున్.
          అలా విష్ణుమూర్తి గజేంద్రుని రక్షించటం కోసం లక్ష్మీదేవి కొంగు వదలను కూడ వదలకుండా తటాలున బయలుదేరటంతో – విష్ణువు వెనుక లక్ష్మీ దేవి, ఆమె వెనకాతల అంతఃపుర స్త్రీలు, వారి వెనుక గరుడుడు, ఆయన పక్కనే విల్లూ గదా శంఖచక్రాలు నారదుడు విష్వక్సేనుడు వస్తున్నారు. వారి వెనువెంట వరసగా వైకుంఠపరంలో ఉన్న వాళ్ళందరు కూడా వస్తున్నారు.
ఇది పోతనగారు ప్రసాదించిన పరమాద్భుత పద్యాలలో ఒకటి. పండిత పామరుల నోళ్ళలో తరచుగా నానుతుండే పద్యం. నడకలో భావంలో ఉత్తమ స్థాయి అందుకున్నది. చదువుతుంటేనే వేగంగా పయనమౌతున్న విష్ణుమూర్తి వెనుక అంత వేగంగాను వెళ్తున్న లక్ష్మీదేవి సూదిమొనగా గల బాణంములుకులాగ అనుసరిస్తున్న పరివారం మనోనేత్రానికి దర్శనమిస్తుంది. *{విష్ణుమూర్తి - (అ) ఆయుధములు 1ధనుస్సు శాఙ్గము 2గద కౌమోదకి 3శంఖము పాంచజన్యము 4చక్రము సుదర్శనము 5కత్తి నందకము (ఆ) రథము శతానందము (ఇ) సేనానాయకుడు విష్వక్సేనుడు (ఈ) వాహనం గరుత్మంతుడు}
8-98-ma.
tana veMTan siri; lachchiveMTa navarOdhavraatamun; daani ve
nkanu@M baksheeMdru@MDu; vaanipoMtanu dhanu@h kaumOdakee SaMkha cha
kra nikaayaMbunu; naaraduMDu; dhvajineekaaMtuMDu raa vachchi ro
yyana vaikuMThapuraMbunaM galuguvaa raabaalagOpaalamun.
          తన = అతని; వెంటన్ = వెనుక; సిరి = లక్ష్మీదేవి; లచ్చి = లక్ష్మీదేవి; వెంటన్ = వెనుక; అవరోధ = అంతఃపుర స్త్రీ; వ్రాతమున్ = సమూహమును; దాని = వాని; వెన్కనున్ = వెనుక; పక్షీంద్రుడు = గరుత్మంతుడు {పక్షీంద్రుడు - పక్షులకు ఇంద్రుడు (ప్రభువు), గరుడుడు}; వాని = అతని; పొంతను = పక్కనే; ధనుస్ = విల్లు {విష్ణుమూర్తి - (అ) ఆయుధములు 1ధనుస్సు శాఙ్గము 2గద కౌమోదకి 3శంఖము పాంచజన్యము 4చక్రము సుదర్శనము 5కత్తి నందకము (ఆ)రథము శతానందము (ఇ)సేనానాయకుడు విష్వక్సేనుడు (ఈ)వాహనం గరుత్మంతుడు}; కౌమోదకీ = కౌమోదకి యనెడి గద; శంఖ = శంఖము; చక్ర = చక్రముల; నికాయంబునున్ = సమూహము; నారదుండు = నారదుడు; ధ్వజినీకాంతుండు = విష్వక్సేనుడు {ధ్వజినీకాంతుండు - (విష్ణుమూర్తి యొక్క) ధ్వజినీ (సేనా) కాంతుడు (నాయకుడు), విష్వక్సేనుడు}; రాన్ = రాగా; వచ్చిరి = వచ్చితిరి; ఒయ్యన = శ్రీఘ్రముగ; వైకుంఠ = వైకుంఠమనెడి; పురంబునన్ = పట్టణమునందు; కలుగు = ఉండెడి; వారు = వారు; ఆబాలగోపాలమున్ = సర్వులును.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: