Wednesday, January 29, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 186

లలనా

 10.1-1131-మ.
నా! యేటికి తెల్లవాఱె? రవి యేలాదోఁచెఁ బూర్వాద్రిపైఁ?
కాలంబు నహంబుగాక నిశిగాఁ ల్పింపఁ డా బ్రహ్మ దా
ఱేఁడుం గృపలేఁడు; కీరములు దుర్వారంబు; లెట్లోకదే;
దే మాపటికాల మందు మనకుం గంజాక్షు సంభోగముల్.
          ఏమే చెలీ! అప్పుడే ఎందుకు తెల్లవారిపోయిందే! తూర్పుకొండమీద ఆ సూర్యుడు ఎందుకు పొద్దుపొడిచేసేడే బాబు! అవును పగళ్ళన్నవి లేకుండా ఎప్పటికి తెల్లవారని రాత్రిళ్ళుగా ఎందుకు చెయ్యడే ఈ బ్రహ్మదేవుడు! ఈ మన్మథుడేమో మరీ కరుణమాలిన వాడైపోయాడు; చిలకలను చూస్తే వారించేవాళ్ళే లేరు; ఇంకా ఎలాగమ్మా బతకటం! అసలు రాత్రి ఎప్పటికేనా అవుతుందా! ఆ కలువ కన్నుల కన్నయ్యతో కలిసే అదృష్టం లభిస్తుందంటావా!
కృష్ణవిరహదుఃఖంతో ఓపికలులేక ఇళ్లల్లో వేగిపోతూ ఉన్న గోపికలలో ఒకామె తన స్నేహితురాలి దగ్గర ఇలా విలపిస్తోంది. తెల్లవారటం అంటే బ్రహ్మానందం పొందే సమాధి స్థితికి విఘ్నం కలిగి మెళకువ వచ్చేయటం అనుకుంటే, ఇంద్రియాణాం మనశ్చాస్మి అని గీత కనుక రవి అంటే మనస్సు అనుకుంటే, పూర్వాద్రిలో పూర్వ అంటే సమాధి నిండుగా పూర్తికాక ముందే అని, అద్రి అంటే ఈ దేహం అనుకుంటే, మనస్సు తోచటం అంటే తెల్లవారటం అనుకోవచ్చు. అహము అంటే సంసార సంపాదనకై సంచారం చేసే పగలు అనుకుంటే నిశి అంటే నిర్వికల్ప స్థితిలో ఉండే సమయం రాత్రి అనుకుంటే. పగళ్ళు వద్దు రాత్రే కావాలి అనటం. బుద్ధిః తాం మంథాతీతీ మన్మథః అని వ్యుత్పత్తి. ఆ మన్మథుడు మనసుని బ్రహ్మజ్ఞానం తెలుకోమని మథించేస్తున్నాడుట, పోని సంసార లంపటంలో పడుతున్నాడు పడనీ అని జాలిపడకుండా. చిలకలు అంటే సమాధి కుదరకుండా చెదరగొట్టే బాహ్యాభ్యంతరంలో 'తియ్యగా అనిపించే శబ్దప్రపంచం' అనుకుంటే. దానిని ఆపే నాథుడు లేడని విసుగు కలుగుతోంది అనుకోవచ్చు. మాపటివేళ అంటే మళ్ళీ బ్రహ్మజ్ఞానం స్పురించే సమాధిలో ఉండే సమయం. కంజాక్షుడు బ్రహ్మజ్ఞానమే చూపుగా కల ఆ పరబ్రహ్మతో కూడుట ఎప్పటికి లభిస్తుంది అని ఆత్రుతగా ఉంది అనుకోవచ్చు. అందుకని తనను లాలించే తన స్నేహితురాలు తల్లి గురువుకి చెప్పుకుంటోంది.
10.1-1131-ma.
lalanaa! yaeTiki tellavaaRe? ravi yaelaadO@Mche@M boorvaadripai@M?
galakaalaMbu nahaMbugaaka niSigaa@M galpiMpa@M Daa brahma daa
valaRae@MDuM gRpalae@MDu; keeramulu durvaaraMbu; leTlOkadae;
kaladae maapaTikaala maMdu manakuM gaMjaakshu saMbhOgamul.
          లలనా = పడతి {లలన – విలసన శీలయై నామె, స్త్రీ}; ఏటికిన్ = ఎందుకు; తెల్లవాఱెన్ = తెల్లవారినది; రవి = సూర్యుడు; ఏలా = ఎందుకు; తోచెన్ = కనబడెను; పూర్వా = తూర్పు; అద్రి = కొండ; పైన్ = మీద; కలకాలంబు = ఎల్లప్పుడు; అహంబు = పగలు; కాకన్ = కలుగకుండా; నిశి = రాత్రి; కాన్ = అగునట్లు; కల్పింపడు = కలుగజేయడు; = ఆ యొక్క; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; తాన్ = తాను; వలఱేడున్ = మన్మథుడును; కృపలేడు = దయలేనివాడు; కీరములు = చిలుకలు; దుర్వారంబులు = అడ్డగింపరానివి; ఎట్లోకదే = ఎలాగో ఏమిటో; కలదే = ఉన్నదా అసలు; మాపటి = రాత్రి; కాలము = సమయము; అందున్ = దానిలో; మన = మన; కున్ = కు; కంజాక్షు = పద్మాక్షునితో, కృష్ణునితో; సంభోగముల్ = కలియికలు.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: