aNuvOgaaka
2-66-మ.
అణువోగాక కడున్ మహావిభవుఁడో, యచ్ఛిన్నుఁడో, ఛిన్నుఁడో,
గుణియో, నిర్గుణుఁడో,
యటంచు విబుధుల్ గుంఠీభవత్తత్త్వమా
ర్గణులై యే విభుపాదపద్మ భజనోత్కర్షంబులం దత్త్వ వీ
క్షణముం జేసెద రట్టి విష్ణుఁ బరమున్ సర్వాత్ము
సేవించెదన్.
ఆ పరమాత్ముడు అతి సూక్ష్మమైన అణుస్వరూపుడా? లేక విశ్వమంతా
వ్యాపించిన మహాస్వరూపుడా? దేశకాలాదులచేత అపరిచ్ఛిన్నుడా? లేక పరిచ్ఛిన్నుడా? ఆయన సగుణుడా? లేక
నిర్గుణుడా? అంటు పండితులు వ్యర్థమైన తత్త్వాన్వేషణలు చేసి చేసి చివరకి ఏ
భగవంతుని పాదపద్మాలను ఆశ్రయించి అతిశయంగా భజించుట ద్వారా తత్త్వస్వరూపాన్ని
గుర్తించగలరో అట్టి సర్వవ్యాపకుడు, సర్వోత్కృష్టుడు, సర్వాత్మకుడు అయిన ఆ
పరాత్పరుడిని కొలిచెదను.
శుకమహర్షి శ్రీహరి కృత సృష్ట్యాదుల రహస్యాలు మున్నగునవి
పరీక్షిత్తునకు వివరించ ఉద్యుక్తుడు అవుతూ దైవ గురు ప్రశంస చేసిన సందర్భంలోది ఈ
పద్యం. యద్భావం తత్భవతి అన్నట్లు చూసే దృష్టికి అనుకూలమైన విధంగా దర్శనమిచ్చే ఆ
పరమాత్మ భక్తిమార్గంలో చేరిన వారికే ఆయా సర్వ దృష్టులలో దర్శించే సమస్తాన్ని
సమన్వయం చేసి సత్యమైన తత్త్వస్వరూప దర్శనం అనుగ్రహిస్తాడు.
2-66-ma.
aNuvOgaaka
kaDun mahaavibhavu@MDO, yachChinnu@MDO, Chinnu@MDO,
guNiyO,
nirguNu@MDO, yaTaMchu vibudhul guMTheebhavattattvamaa
rgaNulai yae
vibhupaadapadma bhajanOtkarshaMbulaM dattva vee
kshaNamuM
jaeseda raTTi vishNu@M baramun sarvaatmu saeviMchedan.
అణువో = అత్యంత సూక్ష్మరూపుడా; కాక = లేక; కడున్ = అత్యధికమైన; మహా = గొప్ప; విభవుఁడో = వైభవము కలవాడా; అచ్ఛిన్నుడో = విభజింపశక్యముకానవాడా; ఛిన్నుడో = సమస్తమందు తన అంశ కలవాడా; గుణియో = సమస్త గుణములు తానైన వాడా; నిర్గుణుడో = గుణ రహితుడా; అటంచున్ = అనుకొనుచు; విభుధుల్ = మహాజ్ఞానులు; కుంఠీభవత్ = మొక్కపోయిన, కుంటిదైన; తత్త్వ = తత్త్వమును, యథార్థ జ్ఞానమును; మార్గణులు = అన్వేషించువారలు; ఐ = అయ్యి; ఏ = ఏ; విభున్ = ప్రభువు యొక్క; పాద = పాదములు అను; పద్మ = పద్మములను; భజన = కొలుచు; ఉత్కర్షంబులన్ = విశిష్టతలచేత; తత్త్వ = యథార్థ జ్ఞానమును; వీక్షణమున్ = చూచుటను; చేసెదరు = చేయుదురు; అట్టి = అటువంటి; విష్ణున్ = విష్ణుమూర్తిని; పరమున్ = అత్యున్నతుని; సర్వాత్మున్ = సర్వమునకు ఆత్మయైన వానిని; సేవించెదన్ = కొలిచెదను.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment