Saturday, January 25, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 182

జనకసుతా

9-734-క.
కసుతాహృచ్చోరా!
కవచోలబ్దవిపిన శైలవిహారా!
కామితమందారా!
కాది మహీశ్వరాతియ సంచారా!
          జనకమహారాజు పుత్రిక సీతాదేవి మనసు దోచుకున్న ఆదర్శ భర్తవు. తండ్రి మాట నిలబెట్టడం కోసం కొండకోనలలో తిరిగి కష్టాలు అనుభవించిన ఆదర్శ పుత్రుడవు. ప్రజల కోరికలను తీర్చుటలో కల్పవృక్షము వంటి ఉత్తమ పాలకుడవు. జనకమహారాజు లాంటి రాజర్షులను సైతం మించిన గొప్ప నడవడికగల మహారాజువి. అయినట్టి శ్రీరామచంద్రప్రభు! నీకు వందనములు
పాదంలో రెండవ అక్షర నియమం ప్రాస కదా, అదే నియమాన్ని ప్రాసాక్షర ముందరి తరువాత కూడ పాటించిన తీరు, యతి స్థానాలు రెండు ఒకే అక్షరం వాడటం ఈ నవమ స్కంధాంత ప్రార్థన పద్యానికి ప్రత్యేక అందాన్ని ఇచ్చాయి.
9-734-ka.
janakasutaahRchchOraa!
janakavachOlabdavipina Sailavihaaraa!
janakaamitamaMdaaraa!
janakaadi maheeSvaraatiSaya saMchaaraa!
జనకసుతాహృచ్చోరా = శ్రీరామా {జనకసుతా హృచ్చోరుడు - జనకునిపుత్రిక సీత హృదయము దోచుకొన్నవాడు, రాముడు}; జనక వచోలబ్ద విపిన శైల విహారా = శ్రీరామా {జనక వచోలబ్ద విపిన శైల విహారుడు - తండ్రి మాట జవదాటక కొండకోనలలో తిరిగినవాడు, రాముడు}; జన కామిత మందారా = శ్రీరామా {జన కామిత మందారుడు - ప్రజల కోరికలు తీర్చుటలో కల్పవృక్షము వంటివాడు, రాముడు}; జనకాది మహీశ్వరాతిశయ సంచారా = శ్రీరామా {జనకాది మహీశ్వరాతిశయ సంచారుడు - జనకుడు మున్నగు రాజర్షులను మించిన ప్రవర్తన కలవాడు, రాముడు}.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: