Sunday, January 19, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 176

నీపద్యావళుల్

10.1-408-శా.
నీ ద్యావళు లాలకించు చెవులన్ నిన్నాడు వాక్యంబులన్
నీ పేరం బనిచేయు హస్తయుగముల్ నీ మూర్తిపైఁ జూపులన్
నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపైఁ జిత్తముల్
నీ పై బుద్దులు మాకు నిమ్ము కరుణన్ నీరేజపత్రేక్షణా!

          ఓ కమాలల వంటి కన్నులున్న కన్నయ్యా! నీ స్తుతి చేసే పద్యాలను విడువక వింటూ ఉండే చెవులను, నిన్ను విడువక స్తోత్రం చేస్తు ఉండే వాక్కులను మాకు అనుగ్రహించు. ఏ పని చేస్తున్నా నీ పేరనే నీ పనిగానే చేసే చేతలను, ఎప్పుడు విడువక నిన్నే చూసే చూపులను మాకు అనుగ్రహించు. నీ పాదపద్మాలను విడువక నమస్కరించెడి శిరస్సులను, నీమీది ఏకాగ్రమైన భక్తి కలిగి ఉండే మనస్సును, నిరంతరం నీ ధ్యానం పైనే నిలిచి ఉండే బుద్ధిని మాకు దయతో ప్రసాదించు పరమేశ్వరా!
బాలకృష్ణుడు తన నడుముకు కట్టిన రోలు ఈడ్చుకుంటూ రెండు మద్దిచెట్లను కూల్చాడు. వాటినుండి విముక్తులైన గుహ్యకులు కపటబాలుని స్తుతించి మాకు నీ యందు ప్రపత్తిని అనుగ్రహించమని ఇలా వేడుకున్నారు. ఇది భాగవతుల ధర్మాలని నిర్వచించే ఒక పరమాద్భుతమైన పద్యం. అందుకే ఒక శార్దూలాన్ని వదలి, ప్రాసాక్షార నియమాన్ని యతి స్థానాలైన మొదటి, పదమూడవ స్థానాలకు కూడా ప్రసరింపజేసి పంచదార పలుకలకు ప్రత్యేక జిలుగులు అద్దారు పోతనామాత్యులు.

10.1-408-Saa.
nee padyaavaLu laalakiMchu chevulan ni nnaaDu vaakyaMbulan
nee paeraM banichaeyu hastayugamul nee moortipai@M joopulan
nee paadaMbula poMta mrokku Siramul nee saevapai@M jittamul
nee pai buddula maaku nimmu karuNan neeraejapatraekshaNaa!

నీ = నీ యొక్క; పద్య = పద్యముల; ఆవళుల్ = సమూహములను; ఆలకించు = వినెడి; చెవులన్ = చెవులను; నిన్నున్ = నిన్ను; ఆడు = స్తుతించెడి; వాక్యంబులన్ = మాటలను; నీపేరన్ = నీకు సమర్పణగా; పనిచేయు = పనిచేసెడి; హస్త = చేతుల; యుగముల్ = జంటలు; నీ = నీ యొక్క; మూర్తి = స్వరూపము; పైన్ = మీది; చూపులను = దృష్టిని; నీ = నీ యొక్క; పాదంబులన్ = పాదముల; పొంతన్ = దగ్గర; మ్రొక్కు = వాలినమస్కరించెడి; శిరముల్ = తలలు; నీ = నీ; సేవ = సేవచేయుట; పైన్ = అందే; చిత్తముల్ = మనసులు; నీ = నీ; పైన్ = మీది; బుద్ధులు = బుద్ధులు; మా = మా; కున్ = కు; ఇమ్ము = ఇమ్ము; కరుణన్ = దయతో; నీరేజపత్రేక్షణా = శ్రీకృష్ణా {నీరేజ పత్రేక్షణుడు - తామర రేకుల వంటి కన్నులు కల వాడు, విష్ణువు}.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: