Saturday, January 18, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 174

రాజీవసదృశలోచన

 7-480-క.
రాజీవ సదృశలోచన!
రాజీవభవాది దేవరాజి వినుత వి
బ్రాజిత కీర్తి లతావృత
రాజీవ భవాండ భాండ! ఘుకుల తిలకా!

          సప్తమ స్కంధాంత స్తోత్రం – శ్రీరామచంద్ర ప్రభు! నీవు కలువల వంటి కన్నులు ఉన్న అందగాడవు. నిన్ను బ్రహ్మదేవుడు మున్నగు సకల దేవతలు సదా స్తుతిస్తు ఉంటారు. నీ కీర్తి సమస్త బ్రహ్మాండాల సమూహం అంతటా వ్యాపించి తళతళలాడుతు ఉంటుంది. నీవు రఘువంశానికి వన్నె తెచ్చిన వాడవయ్యా రామయ్య.

7-480-ka.
raajeeva sadRSalOchana!
raajeevabhavaadi daevaraaji vinuta vi
braajita keerti lataavRta
raajeeva bhavaaMDa bhaaMDa! raghukula tilakaa!

          రాజీవ సదృశ లోచన = శ్రీరామా {రాజీవ సదృశ లోచనుడు - రాజీవ (తామరల) సదృశ(వంటి) లోచనుడు, కన్నులు గలవాడు, రాముడు}; రాజీవభ వాది దేవ రాజి వినుత = శ్రీరామా {రాజీవభ వాది దేవ రాజి వినుతుడు - రాజీవభవ (బ్రహ్మదేవుడు) ఆది (మున్నగు) దేవ (దేవతల) రాజి (సమూహములచే) నుత (స్తుతింపబడిన వాడు), రాముడు}; విబ్రాజిత కీర్తిలతావృత రాజీవభవాండ భాండ = శ్రీరామా {విబ్రాజిత కీర్తిలతావృత రాజీవభవాండ భాండుడు - విభ్రాజిత(మిక్కలి మెరయు చున్న) కీర్తి (కీర్తి యనెడి) లతా (తీగలచే) ఆవృత (చుట్టబడిన) రాజీవభవాండ(బ్రహ్మాండము అనెడి) భాండుడు (భాండము గల వాడు), రాముడు}; రఘుకుల తిలకా = శ్రీరామా {రఘుకుల తిలకుడు - రఘుకుల (రఘు వంశమునకు) తిలకుడు (వన్నె తెచ్చిన వాడు), రాముడు}.

~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: