Thursday, January 9, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 166

iMdu gala

7-275-క.
ఇందు గలఁ డందు లేఁ డని
సందేహము వలదు చక్రి ర్వోపగతుం
డెం దెందు వెదకి చూచిన
నందందే కలఁడు దానవాగ్రణి! వింటే.
          ఓ హిరణ్యకశిప మహారాజా! శ్రీమహావిష్ణువు ఇక్కడ ఉంటాడు; ఇక్కడ ఉండడు; అని చెప్పడానికి లేదు. అయన సర్వోపగతుడు అంటే సర్వకాల సర్వావస్థల అన్నటి యందు ఉండే వాడు. ఈవిషయంలో ఏమాత్రం సందేహం అన్నది లేదు; అందుచేత ఎక్కడైనా సరే వెతికి చూడాలే కాని అక్కడే ఉంటాడయ్యా. రాక్షసరాజా!
ఇది అతిమధురమైన పద్యం. పోతనగారిది ప్రహ్లాద చరిత్రలోది. పదౌచిత్యం, సందర్భౌచిత్యం, పాత్రౌచిత్యం అందంగా అమరిన పద్యం. బాలుర నోట సున్నాముందున్న దకారం అందంగా పలుకుతుంది కదా (పద్యంలో చిక్కగా బొద్దుగా ఉన్నాయి). ప్రతి పదంలో రెండవ అక్షరాలకి సామ్యం ఉండాలన్నది అందమైన ప్రాస నియమం కదా. ఈ రెంటిన చక్కగా సమన్వయం చేసిన తీరు అద్భుతం. చిన్నపిల్లలు చేతులు కాళ్ళు కదుపుతు చెప్తున్నట్లు చెప్తారు కదా. అది పద్యం నడకలోనే స్పురిస్తున్న తీరు ఇంకా బావుంది. తనకే ఎదురు చెప్తాడా అన్న ఆగ్రహంతో ఊగిపోతున్నాడు తండ్రి హిరణ్యకశిపుడు. అంచేత  హరి హరి అంటున్నావు ఎక్కడున్నాడ్రా చూపగలవా?’ అంటు బెదిరిస్తున్నాడు తండ్రి. కొడుకు ప్రహ్లాదుడు నదురు బెదురులేని అయిదేళ్ళ పిల్లాడు. తన బాల్యానికి తగినట్లు అలా చిరునవ్వులతో నటనలు చేస్తూ సర్వోపగతుడు శ్రీహరి అని సమాధానం చెప్పాడు. ఆ సందర్భానికి తగినట్లు పద్యం నడక సాగింది. పలుకుతున్న బాలకుడి పాత్రకు గంభీరమైన సున్నితమైన పదాలు ఎందెందు, అందందు చక్కగా తగి ఉన్నాయి. మరి అప్పుడు ఆ పరమభక్తుని మాట బోటుపోనివ్వని నారాయణుడు నరసింహరూపంలో విశ్వమంతా వ్యాపించి సిద్ధంగానే ఉన్నాడట.
7-275-ka.
iMdu gala@M DaMdu lae@M Dani
saMdaehamu valadu chakri sarvOpagatuM
DeM deMdu vedaki choochina
naMdaMdae kala@MDu daanavaagraNee! viMTae.
          ఇందు = దీనిలో, ఇక్కడ; కలడు = ఉన్నాడు; అందు = దానిలో, అక్కడ; లేడు = లేడు; అని = అని; సందేహము = అనుమానము; వలదు = వద్దు; చక్రి = విష్ణువు {చక్రి - చక్రము ఆయుధముగా గల వాడు, విష్ణువు}; సర్వ = అన్నిటి యందు; ఉపగతుండు = ఉండు వాడు; ఎందెందు = ఎక్కడెక్కడ; వెదకి = వెదకి; చూచినన్ = చూసినచో; అందందే = అక్కడెల్లను; కలడు = ఉన్నాడు; దానవాగ్రణి = రాక్షస రాజా; వింటే = వింటివా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: