Tuesday, May 31, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౫౫(555)

( సుభద్రా పరిణయంబు ) 

10.2-1167-క.
రాముఁడు తత్కపటాకృతిఁ
దా మదిఁ దెలియంగలేక దగ నొకనాఁ డా
భూమీవర తాపసుఁ బో
రామింగని యాత్మమందిరమునకుఁ దెచ్చెన్.
10.2-1168-ఆ.
తెచ్చి భిక్షసేయ దేవేంద్రతనయుండు
గుడుచుచుండి యచటఁ గోరి మెలఁగు
నసమబాణు మోహనాస్త్రంబుకైవడి
వీరమోహి నన విహారలీల.
10.2-1169-వ.
అట్లు సుభద్ర విహరించుచున్న సమయంబున.

భావము:
రాజా! బలరాముడికి అర్జునుడి కపట వేషం విషయం తెలియలేదు. అతడు సన్యాసిగా మెలగుచున్న ఆ అర్జునుణ్ణి చూసి తన మందిరానికి తీసుకుని వచ్చాడు. అలా బలరాముడు భక్తితో కపటసన్యాసి ఐన అర్జునునికి భిక్ష సమర్పించడం కోసం ఆహ్వానించి అర్చించాడు. ఆ మాయాతాపసి అక్కడే ఆరగిస్తూ ఉన్నాడు. అర్జునుని సమక్షంలో మన్మథుని సమ్మోహనాస్త్రంలా ఉన్న సుభద్ర కోరి విహరిస్తున్నది. ఆలాగున సుభద్ర అతని సమీపంలో సంచరిస్తున్న సమయంలో...

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=81&Padyam=1168

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Saturday, May 28, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౫౪(554)

( సుభద్రా పరిణయంబు ) 

10.2-1166-వ.
అట్లు సుభద్రా దర్శనోత్సాహంబు దన మనంబున సందడిగొనం, ద్రిదండివేషంబు ధరియించి, ద్వారకాపురంబునకుం జనుదెంచి, యప్పౌరజనంబులు భక్తిస్నేహంబుల ననిశంబుఁ బూజింపం దన మనోరథసిద్ధి యగునంతకుం గనిపెట్టుకొని, వానకాలంబు సనునంతకు నప్పట్టణంబున నుండు సమయంబున.

భావము:
ప్రేమాతిశయం వలన సుభద్రను చూడాలని మిక్కుటమైన ఉబలాటం అర్జునునికి కలిగింది. అతడు సన్యాసివేషం ధరించి ద్వారకాపురి ప్రవేశించాడు. అక్కడి పౌరులు అతనిని సేవించసాగారు. తన సంకల్పం సఫలం చేసుకోవటం కోసం వర్షాకాలం దాటిపోయే టంత వరకూ ఆ ద్వారకా పట్టణంలోనే ఉన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=81&Padyam=1166

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Friday, May 27, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౫౩(553)

( సుభద్రా పరిణయంబు ) 

10.2-1165-సీ.
“మునినాథ! పార్థుండు వనజనాభుని సహో-
  దరి సుభద్రను నే విధమునఁ బెండ్లి
యయ్యెను నా విధం బంతయు నాకును-
  దెలియంగ నెఱిఁగింపు ధీవిశాల!”
యనవుడు నా వ్యాసతనయుఁ డాతనిఁ జూచి-
  “వినవయ్య! నృప! దేవవిభుని సుతుఁడు
మును తీర్థయాత్రాసముత్సుకుండై చని-
  రమణఁ బ్రభాసతీర్థమున నుండి
10.2-1165.1-తే.
యా తలోదరితోడి నెయ్యంబు కలిమిఁ
జూడఁ గోరుచు రాముఁడు సుందరాంగిఁ
గౌరవేంద్రున కీ సమకట్టె ననుచుఁ
దనకు నెఱుఁగ రా నా పురందరసుతుండు.

భావము:
ఓ మునీశ్వరా! మహా ఙ్ఞాని! అర్జునుడు శ్రీకృష్ణుని చెల్లెలు సుభద్రను పరిణయమాడిన సన్నివేశం నాకు వివరంగా చెప్పండి.” ఇలా అడిగిన పరీక్షిత్తునకు శుకమహర్షి సుభద్రాపరిణయం ఇలా చెప్పసాగాడు. “ఓ మహారాజా! వినుము. అర్జునుడు పూర్వం తీర్ధయాత్రకు బయలుదేరి ఉత్సాహంగా ప్రభాసతీర్ధం చేరుకున్నాడు. సుభద్రమీద తనకున్న ప్రేమాతిశయం వలన ఆమెను చూడాలని అనుకున్నాడు. బలరాముడు సుభద్రను దుర్యోధనుడికిచ్చి వివాహం చేయలనుకుంటున్న విషయం అర్జునుడు విన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=81&Padyam=1165

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

శ్రీకృష్ణ విజయము - ౫౫౨(552)

( మృతులైన సహోదరులఁదెచ్చుట ) 

10.2-1163-క.
చచ్చిన బాలురఁ గ్రమ్మఱఁ
దెచ్చుట గడుఁ జిత్ర మనుచు దేవకి మదిలో
నచ్చెరువడి యిది యంతయు
నచ్చపు హరిమాయ గాక! యని తలఁచె నృపా!
10.2-1164-క.
పరమాత్ముఁ డఖిల జగదీ
శ్వరుఁడగు కృష్ణుండు సేయు సత్కృత్యంబుల్‌
పరికింప నెన్నఁ బెక్కులు
ధరణీవర!" యనిన రాజు తా ముని కనియెన్.

భావము:
ఓ రాజా! అలా మరణించిన పుత్రులను మళ్ళీ తీసుకురావడం బాగా చిత్రమని ఆశ్చర్యపడిన దేవకీదేవి, ఇదంతా శ్రీకృష్ణుని మాయా మహత్వమే తప్ప ఇతరం కాదు అని అనుకుంది. ఓ మహారాజా! పరమాత్ముడు, లోకాధినాథుడు అయిన శ్రీకృష్ణుడు చేసిన సత్కార్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయి.” అని శుకమహర్షి తెలుపగా, ఆయనతో పరీక్షిత్తు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=80&Padyam=1164

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Wednesday, May 25, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౫౧(551)

( మృతులైన సహోదరులఁదెచ్చుట ) 

10.2-1162-వ.
అట్లు కౌఁగిటం జేర్చి నిజాంకపీఠంబున నునిచి, శిరంబులు మూర్కొని, చిబుకంబులు పుణుకుచుం బ్రేమాతిశయమున మేనం బులకలొలయం జన్నిచ్చిన, వారును వైష్ణవమాయామోహితులై స్తన్యపానంబు సేయుచు భగవంతు డయిన రథాంగపాణి యంగ సంగంబున విగతకల్మషులై విధిశాపసాగరంబు హరిదయాకటాక్షంబను నావచేతం దరించి నిజస్వరూపంబులు ధరించి, కృష్ణునకుఁ దలిదండ్రులకు వందనం బాచరించి గగనపథంబున నిజస్థానంబున కరిగి; రంత దేవకీదేవి తన మనంబున.

భావము:
అలా లాలించి, తన చిన్నారి తనయులను దేవకీదేవి ఆలింగనం చేసుకుని, ఒడిలో కూర్చోబెట్టుకుంది. వారి నడినెత్తిన ముద్దిడింది, గడ్డం పుణికింది. పెల్లుబికిన ప్రేమతో ఆమె దేహం పులకలెత్తంది. వారికి చన్నిచ్చింది. వారు వైష్ణవ మాయా ప్రభావానికి వశులై తల్లిపాలు త్రాగారు. శ్రీకృష్ణుని స్పర్శవలన నిర్మలులు అయ్యారు. శ్రీహరి దయ అనే పడవ సహాయంతో బ్రహ్మశాపం అనే సాగరాన్ని దాటి స్వస్వరూపాలు ధరించి తమ తమ స్థానాలు చేరుకున్నారు. అంతట దేవకీదేవి తన మనసులో అచ్చెరువొందింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=80&Padyam=1162

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, May 24, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౫౦(550)

( మృతులైన సహోదరులఁదెచ్చుట ) 

10.2-1159-వ.
అట్లు వారలం దోడితెచ్చి తల్లి కిట్లనియె.
10.2-1160-క.
"కనుఁగొనుము వీరె నీ నం
దను" లని జనయిత్రికడ ముదంబున వారి
న్నునిచిన నద్దేవకియును
ఘనపుత్త్రస్నేహ మోహకలితాత్మకయై.
10.2-1161-క.
చన్నులు దిగ్గనఁ జేపఁగఁ
గన్నులనానందబాష్పకణములుదొరఁగం
గ్రన్నన కౌఁగిట నిడి "ననుఁ
గన్నన్నలు వచ్చి" రనుచుఁ గౌతుక మొప్పన్.

భావము:
అలా ఆరుగురు శిశువులను తీసుకుని వచ్చి తల్లి దేవకీదేవితో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. “అమ్మా! ఇరిగో వీరే నీ బిడ్డలు చూడు” అంటూ ఆ బాలకులను తల్లి దేవకీదేవి ముందుకు తెచ్చాడు. ఆమెలో పుత్రవాత్సల్యం పొంగిపొరలింది. ఆ మాతృమూర్తి చన్నులు చేపాయి. కన్నుల్లో ఆనందాశ్రువులు జాలువారాయి. వారిని కౌగలించుకుని “నా కన్నబిడ్డలు వచ్చారు,” అని లాలించింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=80&Padyam=1161

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

Monday, May 23, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౪౯(549)

( మృతులైన సహోదరులఁదెచ్చుట ) 

10.2-1157-క.
వీరలఁ దోకొని యిపుడే
ధారుణికిన్నేగి జనని తాపము వాపన్
వీరలు నంతట శాపముఁ
దీఱి మదీయప్రసాదధీయుతు లగుచున్.
10.2-1158-క.
పొలుపుగ సుగతిం బొందఁగఁ
గల" రని హరి యానతిచ్చి కరుణాన్వితుఁడై
బలిచే ననుమతిఁ గొని వా
రలఁ దోకొని వచ్చె నిద్ధరామండలికిన్.

భావము:
వీరిని తీసుకు వెళ్ళి భూలోకంలోఉన్న మా తల్లి శోకాన్నిపోగొడతాము. అంతటితో వీరు శాపవిముక్తులు కాగలరు; మా అనుగ్రహం వలన దివ్యజ్ఞానం కలవారు కాగలరు. తదుపరి, నా అనుగ్రహం వలన వీరికి సుగతి ప్రాప్తిస్తుంది.” ఈవిధంగా పలికి కరుణామయుడైన కృష్ణుడు బలిచక్రవర్తి అనుమతి పొంది భూలోకానికి దేవకీతనయులను తమ కూడా తీసుకుని వచ్చాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=80&Padyam=1158

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :