Tuesday, May 24, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౫౦(550)

( మృతులైన సహోదరులఁదెచ్చుట ) 

10.2-1159-వ.
అట్లు వారలం దోడితెచ్చి తల్లి కిట్లనియె.
10.2-1160-క.
"కనుఁగొనుము వీరె నీ నం
దను" లని జనయిత్రికడ ముదంబున వారి
న్నునిచిన నద్దేవకియును
ఘనపుత్త్రస్నేహ మోహకలితాత్మకయై.
10.2-1161-క.
చన్నులు దిగ్గనఁ జేపఁగఁ
గన్నులనానందబాష్పకణములుదొరఁగం
గ్రన్నన కౌఁగిట నిడి "ననుఁ
గన్నన్నలు వచ్చి" రనుచుఁ గౌతుక మొప్పన్.

భావము:
అలా ఆరుగురు శిశువులను తీసుకుని వచ్చి తల్లి దేవకీదేవితో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. “అమ్మా! ఇరిగో వీరే నీ బిడ్డలు చూడు” అంటూ ఆ బాలకులను తల్లి దేవకీదేవి ముందుకు తెచ్చాడు. ఆమెలో పుత్రవాత్సల్యం పొంగిపొరలింది. ఆ మాతృమూర్తి చన్నులు చేపాయి. కన్నుల్లో ఆనందాశ్రువులు జాలువారాయి. వారిని కౌగలించుకుని “నా కన్నబిడ్డలు వచ్చారు,” అని లాలించింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=80&Padyam=1161

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

No comments: