10.2-1165-సీ.
“మునినాథ! పార్థుండు వనజనాభుని సహో-
దరి సుభద్రను నే విధమునఁ బెండ్లి
యయ్యెను నా విధం బంతయు నాకును-
దెలియంగ నెఱిఁగింపు ధీవిశాల!”
యనవుడు నా వ్యాసతనయుఁ డాతనిఁ జూచి-
“వినవయ్య! నృప! దేవవిభుని సుతుఁడు
మును తీర్థయాత్రాసముత్సుకుండై చని-
రమణఁ బ్రభాసతీర్థమున నుండి
10.2-1165.1-తే.
యా తలోదరితోడి నెయ్యంబు కలిమిఁ
జూడఁ గోరుచు రాముఁడు సుందరాంగిఁ
గౌరవేంద్రున కీ సమకట్టె ననుచుఁ
దనకు నెఱుఁగ రా నా పురందరసుతుండు.
భావము:
ఓ మునీశ్వరా! మహా ఙ్ఞాని! అర్జునుడు శ్రీకృష్ణుని చెల్లెలు సుభద్రను పరిణయమాడిన సన్నివేశం నాకు వివరంగా చెప్పండి.” ఇలా అడిగిన పరీక్షిత్తునకు శుకమహర్షి సుభద్రాపరిణయం ఇలా చెప్పసాగాడు. “ఓ మహారాజా! వినుము. అర్జునుడు పూర్వం తీర్ధయాత్రకు బయలుదేరి ఉత్సాహంగా ప్రభాసతీర్ధం చేరుకున్నాడు. సుభద్రమీద తనకున్న ప్రేమాతిశయం వలన ఆమెను చూడాలని అనుకున్నాడు. బలరాముడు సుభద్రను దుర్యోధనుడికిచ్చి వివాహం చేయలనుకుంటున్న విషయం అర్జునుడు విన్నాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=81&Padyam=1165
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
: : భాగవతం చదువుకుందాం : :
No comments:
Post a Comment