Friday, December 31, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౩౭(437)

( బలరాముని తీర్థయాత్ర ) 

10.2-933-క.
ధాత్రీవర సమధిక చా
రిత్రుఁడు హలపాణి పలికె ధృతి "నాత్మా వై
పుత్రక నామాసి యను ప
విత్రశ్రుతి వాక్యసరణి విశదం బగుటన్.
10.2-934-క.
ఈ సూతసూనుఁ డిపుడు మ
హాసత్త్వము నాయువును ననామయమును వి
ద్యా సామర్థ్యము గలిగి సు
ధీసత్తములార! యీక్షితిన్ విలసిల్లున్."
10.2-935-వ.
అని సూతుం బునర్జీవితుంగాఁ జేసి మునులం జూచి యిట్లనియె. 

భావము:
ఓ రాజా! “ఆత్మా వైపుత్ర నామాసి”, (తానే పుత్రరూపంలో తిరిగి జన్మిస్తాడు) అనే వేదవచనానికి తగినట్లు మహానుభావుడైన బలరాముడు ఇలా అన్నాడు. “ఓ మహర్షులారా! ఇప్పుడు ఈ సూతుని కుమారుడు ఆయువు, ఆత్మశక్తి, రోగం లేని తనువు, విద్యాదక్షత పొంది ఈ లోకంలో విరాజిల్లుతాడు.” ఇలా అనుగ్రహించి బలరాముడు, సూతుడిని బ్రతికించి మునులతో మరల ఇలా అన్నాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=68&Padyam=934 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Wednesday, December 29, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౩౬(436)

( బలరాముని తీర్థయాత్ర ) 

10.2-932-వ.
అదియునుం గాక పరమపావనుండవైన నీవు ధర్మంబుదప్పిన నెవ్వరు మాన్పంగలరు? కావునఁ బ్రాయశ్చిత్తంబు గైకొని నడపకున్న ధర్మంబు నిలువ; దట్లుగావున దీనికిఁ బ్రతీకారంబు పుట్టింపు” మనిన నతండు వారలం గనుంగొని “తామసంబున నిట్టి పాపంబు సేయంబడియె; దీనికి ముఖ్యపక్షంబునఁ బ్రతికృతి యెఱింగింపుండు, వీనికి నాయువును బహుసత్త్వంబును నొసంగిన మీకిష్టంబగునే నట్లు నాయోగమాయచేఁ గావింతు” నన నమ్మునులు "నీయస్త్రమాహాత్మ్యంబునకు మృత్యువునకు మాకు నెవ్విధంబున వైకల్యంబు నొందకుండునట్లు గావింపు"మనిన నతం డందఱం జూచి యప్పుడు. 

భావము:
అంతే కాకుండా, పరమ పవిత్రుడవైన నీవే ధర్మం తప్పితే, అధర్మాన్ని ఎవరు అడ్డుకుంటారు? దీనికి ప్రాయశ్చిత్తం చేయకపోతే ధర్మం మనుగడకే ప్రమాదం. కనుక, నీవు ఆ ప్రాయశ్చిత కార్యం తలపెట్టాలి.” ఇలా పలుకుతున్న మహర్షుల మాటలు వినిన బలరాముడు వారితో “తొందరపాటు వలన ఇంతటి పాపం చేశాను. దీనికి చేయవలసిన ప్రాయశ్చిత్తం ఏమిటో చెప్పండి. మీకు ఇష్టం అయితే, నా యోగమాయా ప్రభావంతో సూతుణ్ణి బ్రతికించి, అతడిని మహాశక్తిమంతునిగా చేస్తాను.” అన్నాడు. అంతట “నీ అస్త్రమహాత్మ్యానికి, మృత్యు నియమానికి, మాకు ఎలాటి ధర్మవిఘాతం కలుగకుండా, బలరామ! నీ ఇష్ట ప్రకారం చేయుము” అని ఋషులు బలరాముడితో అన్నారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=68&Padyam=932 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, December 28, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౩౫(435)

( బలరాముని తీర్థయాత్ర ) 

10.2-930-క.
“అనఘా! యితనికి బ్రహ్మా
సన మే మిచ్చుటను నీవు సనుదే నితఁ డా
సనము దిగఁడయ్యె నింతయు
మును నీమది నెఱుఁగ నర్థముం గలదె? హలీ!
10.2-931-క.
ఎఱిఁగెఱిఁగి బ్రహ్మహత్యా
దురితంబున నీమనంబు దూకొనెఁ బాపో
త్తరణప్రాయశ్చిత్తము
దొరఁకొని కావింపు మయ్య దుర్జనహరణా! 

భావము:
“మహాత్మా! బలరామ! ఈ సూతునికి మేము అధ్యక్ష స్థానము ఇచ్చి ఈ ఉన్నతాసనంపై కూర్చుండబెట్టాము. అందుకనే నీవు వచ్చినప్పుడు ఇతడు లేవ లేదు. ఇదంతా నీకు తెలియని విషయం కాదు. నీకు తెలియని ధర్మం అంటూ ఉందా? ఓ బలరామా! దుష్టశిక్షణ చేసే నీవే, తెలిసి తెలిసి బ్రహ్మహత్యా పాపానికి ఒడిగట్టావు. ఈ పాపం నిష్కృతి కావడానికి నీవు ప్రాయశ్చిత్తం చేసుకోవలెను. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=68&Padyam=931 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Monday, December 27, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౩౪(434)

( బలరాముని తీర్థయాత్ర ) 

10.2-928-క.
ఆ నెఱిఁ దనుఁ గని ప్రత్యు
త్థాన నమస్కారవిధులు దగ నడపక పెం
పూనిన పీఠముపై నా
సీనుండగు సూతు శేముషీవిఖ్యాతున్.
10.2-929-వ.
కనుంగొని యతని సమీపంబున నున్న విప్రవరులం జూచి రాముండు రోషించి “వీఁడు నన్నుఁ గని లేవకుండుటకు హేతు వెయ్యదియొకో? ఈ ప్రతిలోమజాతుండు మునిగణ సభాస్థలంబునఁ దానొక్క ముఖ్యుండ పోలె దురభిమానంబున శక్తిమనుమని వలనంగొన్ని కథలు గాథలు గఱచి విద్వద్గణ్యుని విధంబున విఱ్ఱవ్రీఁగెడును; నీచాత్ముం డభ్యసించు విద్య లెల్లను మనంబున విచారించి చూచిన మదకారణంబులు గాని సత్త్వగుణగరిష్ఠంబులు గావు; ధర్మసంరక్షణంబు సేయ నవతరించిన మాకు నిట్టి దుష్టమర్దనం బవశ్యకర్తవ్యం, బని తలఁచి హస్తంబున ధరించిన కుశాగ్రంబున నా సూతుని వధించిన నక్కడి మునీంద్రు లెల్ల హాహాకారంబులతోడం దాలాంకునిఁ జూచి యిట్లనిరి. 

భావము:
కాని ప్రజ్ఞాసమేతుడైన సూతుడు తక్కిన మునులలాగ బలరామునికి ఎదురువచ్చి స్వాగతమిచ్చి అతిధి పూజలు చేయకుండా ఉన్నతాసనంమీద కూర్చుని ఉన్నాడు. అలా కూర్చుని ఉన్న సూతుని బలరాముడు కనుగొని. తనను పూజించక ఉన్న సూతునిపై బలరాముడు ఆగ్రహించాడు. అతడు అక్కడ ఉన్న ఋషులతో “వీడు నన్ను చూసి కూడా ఎందుకు లేవలేదో? ఈ సూతుడు మహర్షులున్న సభలో తానే పెద్దను అని అనుకుంటూ దురభిమానంతో ప్రవర్తించాడు. వ్యాసమహర్షి దగ్గర కొన్ని కథలు గాథలు నేర్చుకున్నాడు. దానికే విద్వాంసుడను అని విఱ్ఱవీగుతున్నాడు. నీచులు అభ్యసించే విద్య వారిలో మదాన్నే పెంచుతుంది కానీ సాత్వికగుణాన్ని పెంచదు. మేము ధర్మ సంరక్షణ కోసం పుట్టాము. ఇలాంటి దుష్టుల్ని శిక్షించడం మా కర్తవ్యం.” అని పలుకుతూ, తన చేతిలోని దర్భపుల్లతో ఆ సూతుడిని వధించాడు. అది చూసి అక్కడి మునీశ్వరులు అందరు హాహాకారాలు చేశారు. వారు బలరాముడితో ఇలా అన్నారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=68&Padyam=929 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Sunday, December 26, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౩౩(433)

( బలరాముని తీర్థయాత్ర ) 

10.2-927-వ.
అట్లు సని మొదలం ప్రభాసతీర్థంబున నవగాహంబు సేసి, యందు దేవర్షిపితృతర్పణంబులు సంప్రీతిం గావించి విమలతేజోధను లగు భూసురప్రవరులు దనతో నరుగుదేరం గదలి చని క్రమంబున సరస్వతియు బిందుసరోవరంబును వజ్రతీర్థంబును విశాలానదియు సరయువును యమునయు జాహ్నవీతీర్థంబును గనుంగొనుచు నచటనచట నవగాహన దేవర్షిపితృతర్పణ బ్రాహ్మణ సంతర్పణంబు లను భూసుర యుక్తుండై నడపుచుం జని సకలలోకస్తుత్యంబును నిఖిలముని శరణ్యంబు నగు నైమిశారణ్యంబు సొచ్చి; యందు దీర్ఘసత్త్రంబు నడపుచున్న ముని జనంబులం గనుం గొనిన; వారును ప్రత్యుత్థానంబు సేసి రామునకు వినతులై యాసన పూజా విధానంబులు గావించిన నతండును బ్రముదిత మానసుం డగుచు సపరివారంబుగాఁ గూర్చున్న యెడ. 

భావము:
అలా తీర్ధయాత్రలకు అని బయలుదేరిన బలరాముడు, ప్రభాసతీర్ధానికి వెళ్ళి స్నానం చేసి ప్రీతితో దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తర్పణాలు వదిలాడు. బ్రాహ్మణోత్తములు కూడా వస్తుండగా అతడు అక్కడ నుండి బయలుదేరాడు. క్రమముగా సరస్వతి, బిందుసరోవరం, వజ్రతీర్థం, విశాలానది, సరయువు, యమున, గంగ మున్నగు పుణ్యనదుల్లో స్నానాలు చేసి, దేవతలకు, ఋషులకు, పితృగణాలకు తర్పణాలు సమర్పించాడు. బ్రాహ్మణులకు సంతర్పణలు చేసాడు. పిమ్మట బలరాముడు లోకములు సమస్తము నందు స్తుతిపాత్రము, మునీంద్రులకు నివాసస్థానము అయిన నైమిశారణ్యం ప్రవేశించాడు. అప్పుడు అక్కడి మునులు దీర్ఘసత్రయాగం జరుపుతూ ఉన్నారు. వారందరూ బలరాముడికి ఎదురేగి వినయంగా స్వాగతం పలికి అతిథి మర్యాదలు చేశారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=68&Padyam=926 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Saturday, December 25, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౩౨(432)

( దంతవక్త్రుని వధించుట) 

10.2-924-క.
పురసతులు విరులు లాజలు
గురుసౌధాగ్రములనుండి కురియఁగ వికచాం
బురుహాక్షుం డంతఃపుర
వర మర్థిం జొచ్చె వైభవం బలరారన్.
10.2-925-వ.
అట్లు యోగీశ్వరేశ్వరుండును, షడ్గుణైశ్వర్యసంపన్నుండును, నిఖిలజగదీశ్వరుండును నైన పురుషోత్తముండు సుఖంబుండె; నంత.
10.2-926-క.
కౌరవ పాండవ పృథు సమ
రారంభ మెఱింగి తీర్థయాత్ర నెపముగా
సీరాంకుఁ డుభయకులులకు
నారయ సముఁ డగుటఁ జేసి యరిగె నరేంద్రా! 

భావము:
ఆ సమయంలో నగరంలోని స్త్రీలు మేడలమీద నుండి శ్రీకృష్ణుడిమీద పూలు అక్షతలు కురిపిస్తుండగా, శ్రీకృష్ణుడు మహావైభవంతో అంతఃపురం ప్రవేశించాడు. మహాయోగులకు ఈశ్వరుడు, షడ్గుణైశ్వర్యములు సమృద్ధిగా కలవాడు, సకల జగత్తులకు ప్రభువు అయిన శ్రీకృష్ణుడు అలా నగరం ప్రవేశించి, ద్వారకలో సుఖంగా ఉన్నాడు. ఓ పరీక్షిన్మహారాజా! కౌరవ పాండవులకు యుద్ధం ప్రారంభం కానున్నదని తెలుసుకుని ఇరుపక్షాలకూ కావలసిన వాడు కనుక, బలరాముడు బయలుదేరి తీర్ధయాత్ర నెపంతో వెళ్ళిపోయాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=67&Padyam=926 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Friday, December 24, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౩౧(431)

( దంతవక్త్రుని వధించుట) 

10.2-920-చ.
జలరుహలోచనుండు నిజసాధనమై తనరారు చక్రమున్
వలనుగఁ బూన్చి వైవ నది వారక వాని శిరంబు ద్రుంచె న
బ్బలియుఁడు సౌభ సాల్వ శిశుపాల సహోదర తత్సహోదరా
వలుల వధించి తత్కులము వారి ననేకులఁ ద్రుంచె నీ గతిన్.
10.2-921-వ.
అయ్యవసరంబున.
10.2-922-క.
నర ముని యోగి సురాసుర
గరుడోరగ సిద్ధ సాధ్య గంధర్వ నభ
శ్చర కిన్నర కింపురుషులు
హరిమహిమ నుతించి రద్భుతానందములన్. 

భావము:
కృష్ణుడు తన చక్రాయుధం పూని వేయడంతో, అది వాని శిరస్సును ఖండించింది. అలా బలవంతుడైన శ్రీకృష్ణుడు సౌభకంతో పాటు, సాల్వుణ్ణీ, శిశుపాలుణ్ణీ, వాని తమ్ముడు విదూరథుణ్ణీ, వారి సోదరులతో సహా సంహరించాడు. ఇంతేకాక, వారి వంశం వారిని చాలా మందిని చంపాడు. అలా సాల్వాదులను అంతమొందించిన సమయంలో మానవులు, మునులు, యోగులు, దేవతలు, రాక్షసులు, గరుడులు, నాగులు, సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, ఖేచరులు మొదలైన వారంతా ఆశ్చర్యానందాలతో శ్రీకృష్ణుని ప్రభావాన్ని స్తుతించారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=67&Padyam=922 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :