10.2-924-క.
పురసతులు విరులు లాజలు
గురుసౌధాగ్రములనుండి కురియఁగ వికచాం
బురుహాక్షుం డంతఃపుర
వర మర్థిం జొచ్చె వైభవం బలరారన్.
10.2-925-వ.
అట్లు యోగీశ్వరేశ్వరుండును, షడ్గుణైశ్వర్యసంపన్నుండును, నిఖిలజగదీశ్వరుండును నైన పురుషోత్తముండు సుఖంబుండె; నంత.
10.2-926-క.
కౌరవ పాండవ పృథు సమ
రారంభ మెఱింగి తీర్థయాత్ర నెపముగా
సీరాంకుఁ డుభయకులులకు
నారయ సముఁ డగుటఁ జేసి యరిగె నరేంద్రా!
భావము:
ఆ సమయంలో నగరంలోని స్త్రీలు మేడలమీద నుండి శ్రీకృష్ణుడిమీద పూలు అక్షతలు కురిపిస్తుండగా, శ్రీకృష్ణుడు మహావైభవంతో అంతఃపురం ప్రవేశించాడు. మహాయోగులకు ఈశ్వరుడు, షడ్గుణైశ్వర్యములు సమృద్ధిగా కలవాడు, సకల జగత్తులకు ప్రభువు అయిన శ్రీకృష్ణుడు అలా నగరం ప్రవేశించి, ద్వారకలో సుఖంగా ఉన్నాడు. ఓ పరీక్షిన్మహారాజా! కౌరవ పాండవులకు యుద్ధం ప్రారంభం కానున్నదని తెలుసుకుని ఇరుపక్షాలకూ కావలసిన వాడు కనుక, బలరాముడు బయలుదేరి తీర్ధయాత్ర నెపంతో వెళ్ళిపోయాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=67&Padyam=926
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
: : భాగవతం చదువుకుందాం : :
No comments:
Post a Comment