Saturday, July 31, 2021

శ్రీకృష్ణ విజయము - 296

( పౌండ్రకవాసుదేవుని వధ )

10.2-520-వ.
అట్టియెడ రుధిర ప్రవాహంబులును, మేదోమాంసపంకంబునునై సంగరాంగణంబు ఘోరభంగి యయ్యె; నయ్యవసరంబునం గయ్యంబునకుం గాలుద్రవ్వు నప్పౌండ్రకునిం గనుంగొని; హరి సంబోధించి యిట్లనియె.
10.2-521-మ.
"మనుజేంద్రాధమ! పౌండ్రభూపసుత! నీ మానంబు బీరంబు నేఁ
డనిలో మాపుదు; నెద్దు క్రొవ్వి పెలుచన్నాఁబోతుపై ఱంకెవై
చిన చందంబున దూతచేత నను నాక్షేపించి వల్దన్న పే
రునుఁ జిహ్నంబులు నీపయిన్ విడుతునర్చుల్‌ పర్వనేఁడాజిలోన్
10.2-522-క.
అదిగాక నీదు శరణము
పదపడి యేఁజొత్తు నీవు బల విక్రమ సం
పదగల పోటరి వేనిం
గదలక నిలు" మనుచు నిశితకాండము లంతన్.
10.2-523-మ.
చల మొప్పన్ నిగుడించి వాని రథముం జక్కాడి తత్సారథిం
దల వే త్రుంచి హయంబులన్ నరికి యుద్దండప్రతాపక్రియం
బ్రళయార్కప్రతిమాన చక్రమున నప్పౌండ్రున్ వెసం ద్రుంప వాఁ
డిలఁ గూలెం గులిశాహతిన్నొరగు శైలేంద్రాకృతిన్ భూవరా!

భావము:
అలా శ్రీకృష్ణుడు చేస్తున్న యుద్ధంలో, నెత్తుటి ప్రవాహంతో, మాంసపు బురదతో సంగరాంగణం భయంకరంగా అయిపోయింది. ఆ సమయంలో తనపై కాలుద్రువ్వుతున్న పౌండ్రకుడిని చూసి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. “ఓ రాజాధమా! పౌండ్రకా! ఈరోజు యుద్ధంలో నీ మానం అంతా మంటగలుపుతాను. పౌరుషం అంతా పటాపంచలు చేస్తాను. ఎద్దు క్రొవ్వెక్కి ఆబోతుపై రంకెవేసినట్లు, నా దగ్గరకు దూతను పంపి నన్ను ఆక్షేపించావు. నన్ను వదలివేయమనిన ఆ చక్రాది చిహ్నాలనే నీ మీద నిప్పులు చెలరేగేలా యుద్ధంలో ప్రయోగిస్తాను. అలా చేయలేకపోతే నిన్ను శరణువేడతానులే. నిజంగా నీవు కనుక బలపరాక్రమాలు గల వీరాధివీరుడవు అయితే యుద్ధరంగంలో నిలకడగా ఉండు.” అంటూనే శ్రీకృష్ణుడు వాడి బాణాలను సంధించి, పట్టుదలతో బాణాలు వేసి, వాడి రథాన్ని కూల్చివేసి, వెంటవెంటనే సారథి తల తెగనరికి, గుఱ్ఱాలను సంహరించాడు. ఉద్దండ ప్రతాపంతో ప్రళయకాల సూర్యుడితో సమానమైన తన చక్రాయుధాన్ని ప్రయోగించి, పౌండ్రకుడి శిరస్సును ఖండించాడు. వజ్రాయుధము దెబ్బకి కూలిన పర్వతంలా పౌండ్రకుడు నేలకూలాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=44&Padyam=523

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 295

( పౌండ్రకవాసుదేవుని వధ )

10.2-517-క.
పరిఘ శరాసన పట్టిస
శర ముద్గర ముసల కుంత చక్ర గదా తో
మర భిందిపాల శక్తి
క్షురికాసిప్రాస పరశుశూలముల వెసన్.
10.2-518-చ.
పరువడి వైచినన్ దనుజభంజనుఁ డంత యుగాంత కాల భీ
కరమహితోగ్ర పావకుని కైవడి నేచి విరోధిసాధనో
త్కరముల నొక్కటన్ శరనికాయములన్ నిగిడించి త్రుంచి భా
స్వరగతి నొత్తె సంచలితశాత్రవసైన్యముఁ బాంచజన్యమున్.
10.2-519-ఉ.
వారని యల్కతోఁ గినిసి వారిజనాభుఁడు వారి సైన్యముల్‌
మారి మసంగినట్లు నుఱుమాడినఁ బీనుఁగుఁబెంటలై వెసం
దేరులు వ్రాలె; నశ్వములు ద్రెళ్ళె; గజంబులు మ్రొగ్గె; సద్భటుల్‌
ధారుణిఁ గూలి; రిట్లు నెఱిదప్పి చనెన్ హతశేషసైన్యముల్‌.

భావము:
పరిఘ, విల్లు అమ్ములు, పట్టిసం, ముసలం, సమ్మెట, ఈటె, చక్రం, గద, చిల్లకోల, బాకు, శక్తి ఆయుధము, చురకత్తి, గొడ్డలి, శూలం మొదలైన ఆయుధాలను చేపట్టి శ్రీకృష్ణుడి మీద వేగంగా ప్రయోగించాడు. దానితో, దానవాంతకుడు కృష్ణుడు భయంకర ప్రళయాగ్ని వలె విజృంభించి విరోధి ప్రయోగించిన ఆయుధాలు అన్నింటినీ తన బాణ సమూహంతో త్రుంచివేశాడు. శత్రుసైన్యాలకు సంచలనం కల్గించే తన పాంచజన్య శంఖాన్ని పూరించాడు. అమితమైన ఆగ్రహంతో సరోజనాభుడు శ్రీకృష్ణుడు, మారి మహామారి వ్యాపించి సంహరించినంత భీకరంగా, వారియొక్క సైన్యాలను నాశనం చేసాడు; రథాలు విరిగిపోయాయి; అశ్వాలు కూలాయి; ఏనుగులు వ్రాలాయి; కాల్బలం గడ్డి కరచింది; ఈ విధంగా రణరంగము అంతా పీనుగుపెంటలు అయిపోయింది; మరణించకుండా మిగిలిన సైన్యం పరాక్రమం చెడి పారిపోయాయి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=44&Padyam=519

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Thursday, July 29, 2021

శ్రీకృష్ణ విజయము - 294

( పౌండ్రకవాసుదేవుని వధ )

10.2-515-వ.
అంతఁ గృష్ణుండు దండయాత్రోత్సుకుఁడై వివిధాయుధ కలితంబును, విచిత్రకాంచనపతాకాకేతు విలసితంబు నగు సుందరస్యందనంబుఁ బటు జవతురంగంబులం బూన్చి దారుకుండు తెచ్చిన, నెక్కి యతిత్వరితగతిం గాశికానగరంబున కరిగినం, బౌండ్రకుండును రణోత్సాహంబు దీపింప నక్షౌహిణీద్వితయంబుతోడం బురంబు వెడలె, నప్పు డతని మిత్రుండైన కాశీపతియును మూఁ డక్షౌహిణులతోడం దోడుపడువాఁడై వెడలె, నిట్లాప్తయుతుండై వచ్చువాని.
10.2-516-సీ.
చక్ర గదా శంఖ శార్ఙ్గాది సాధనుఁ-
  గృత్రిమగౌస్తుభ శ్రీవిలాసు
మకరకుండల హార మంజీర కంకణ-
  మణిముద్రికా వనమాలికాంకుఁ
దరళ విచిత్ర పతంగ పుంగవకేతుఁ-
  జెలువొందు పీతకౌశేయవాసు
జవనాశ్వకలిత కాంచన రథారూఢుని-
  రణకుతూహలు లసన్మణికిరీటు
10.2-516.1-తే.
నాత్మసమవేషు రంగవిహారకలిత
నటసమానునిఁ బౌండ్రభూనాథుఁ గాంచి
హర్ష మిగురొత్త నవ్వెఁ బద్మాయతాక్షుఁ
డంత వాఁడును నుద్వృత్తుఁ డగుచు నడరి.

భావము:
ఆ తరువాత, దారుకుడు అనేక రకాల ఆయుధాలు కలది; బంగారుజెండాతో విలసిల్లుతున్నది; వేగవంతాలైన గుఱ్ఱాలు కట్టినది అయిన రథం సిద్ధంచేసి తీసుకువచ్చాడు. శ్రీకృష్ణుడు పౌండ్రకుడి మీదకు దండయాత్రకు ఉత్సహించి దారుకుడు తెచ్చిన ఆ రథాన్ని అధిరోహించి కాశీనగరానికి వెళ్ళాడు. పౌండ్రకుడు కూడా మిక్కిలి రణోత్సాహంతో రెండు అక్షౌహిణుల సైన్యంతో పట్టణం బయటకు వచ్చాడు. అతని స్నేహితుడైన కాశీరాజు కూడ మూడు అక్షౌహిణుల సైన్యంతో పౌండ్రకునికి సహాయంగా వచ్చాడు. ఈ విధంగా మిత్రసహితుడై యుద్ధరంగానికి వస్తున్న పౌండ్రకుడిని శ్రీకృష్ణుడు చూసాడు. పౌండ్రకుడు శంఖం, చక్రం, గద, శార్ఞ్గంకత్తి మొదలైన ఆయుధాలను ధరించాడు. కృత్రిమమైన కౌస్తుభమణి వక్షాన తగిలించుకున్నాడు. మకరకుండలాలు, హారాలు, కంకణాలు ధరించాడు. కంఠంలో వనమాల వేసుకున్నాడు. గరుడకేతనాన్ని చేకూర్చుకున్నాడు. పీతాంబరాన్ని కట్టాడు. వడిగల గుఱ్ఱాలతో గూడిన బంగారురథాన్ని అధిరోహించాడు. కాంతివంతమైన కిరీటాన్ని తలపై అలంకరించుకుని యుద్ధానికి సిద్ధపడుతున్నాడు. ఇలా తన వేషాన్ని ధరించిన పౌండ్రకుని చూసి రంగస్థల నటునిగా భావించి శ్రీకృష్ణుడు పకపకా నవ్వాడు. ఆ పరిహాసానికి పౌండ్రకుడు మండిపడ్డాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=44&Padyam=516

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Wednesday, July 28, 2021

శ్రీకృష్ణ విజయము - 293

( పౌండ్రకవాసుదేవుని వధ )

10.2-510-ఆ.
ఇంతనుండి యైన నెదిరిఁ దన్నెఱిఁగి నా
చిన్నెలెల్ల విడిచి చేరి కొలిచి
బ్రదుకు మనుము కాక పంతంబు లాడెనా
యెదురు మనుము ఘోర కదనమునను. "
10.2-511-క.
అను దుర్భాషలు సభ్యులు
విని యొండొరు మొగము సూచి విస్మితు లగుచున్
"జనులార! యెట్టి క్రొత్తలు
వినఁబడియెడు నిచట? లెస్స వింటిరె?" యనఁగన్.
10.2-512-వ.
అట్టియెడ కృష్ణుండు వాని కిట్లనియె.
10.2-513-మ.
"వినరా! మీ నృపుఁ డన్న చిహ్నములు నే వే వచ్చి ఘోరాజిలో
దనమీఁదన్ వెస వైవఁ గంకముఖగృధ్రవ్రాతముల్‌ మూఁగఁగా,
ననిలో దర్పము దూలి కూలి వికలంబై సారమేయాళికి
న్ననయంబున్ నశనంబ వయ్యె దను మే నన్నట్లుగా వానితోన్. "

భావము:
నీ శక్తి ఎదుటివారిశక్తి ఇక నుంచి అయినా తెలుసుకుని, నా చిహ్నాలు అన్నింటినీ వదలిపెట్టి నాకు సేవకుడవై బ్రతుకు. కాదు పంతానికి పోతాను అంటావా. యుద్ధానికి సిద్ధపడు.” ఇలా పలికిన దూత దుర్భాషలను సభ్యులంతా విని ఒకరి ముఖం మరొకరు చూచుకుంటూ ఆశ్చర్యపోయారు. “ఈవేళ ఎంత విచిత్రపు మాటలు విన్నాము.” అని అనుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు ప్రౌండ్రకుడి దూతతో ఇలా అన్నాడు. “ఓరీ! సరిగా విను. మీ రాజు ఏ చిహ్నాలను ధరించాను అని నన్ను గురించి చెప్పాడో; అవే చిహ్నాలను రేపు బయలుదేరి వచ్చి తొందరలోనే ఘోరయుద్ధంలో అతని మీద ప్రయోగిస్తాను. యుద్ధంలో శక్తి కోల్పోయి కూలి వికలం అయిపోయిన నిన్ను గ్రద్దలూ రాబందులూ చుట్టుముట్టుతా యని; కుక్కల గుంపులు నిన్ను చీల్చుకొని తింటా యనీ; మేము చెప్పినట్లుగా అతనికి చెప్పు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=44&Padyam=513

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, July 27, 2021

శ్రీకృష్ణ విజయము - 292

( పౌండ్రకవాసుదేవుని వధ )

10.2-508-సీ.
"మనుజేశ బలగర్వమున మదోన్మత్తుఁడై-
  యవనిపై వాసుదేవాఖ్యుఁ డనఁగ
నే నొక్కరుఁడ గాక యితరుల కీ నామ-
  మలవడునే?"యని "యదటు మిగిలి
తెగి హరిదా వాసుదేవుఁ డననుకొను-
  నఁట! పోయి వల దను"మనుచు దూతఁ
బద్మాయతాక్షుని పాలికిఁ బొమ్మన-
  నరిగి వాఁ డంబుజోదరుఁడు పెద్ద
10.2-508.1-తే.
కొలువుఁ గైకొని యుండ సంకోచపడక
"వినుము; మా రాజుమాటగా వనజనాభ!
యవని రక్షింప వాసుదేవాఖ్య నొంది
నట్టి యేనుండ సిగ్గు వోఁ దట్టి నీవు.
10.2-509-క.
నా పేరును నా చిహ్నము
లేపున ధరియించి తిరిగె దిది పంతమె? యిం
తే పో! మదిఁ బరికించిన
నే పంత మెఱుంగు గొల్లఁ డేమిట నైనన్?

భావము:
“భూలోకంలో వాసుదేవుడు అనే పేరు నాకు ఒక్కడికే చెల్లుతుంది. ఇతరులకు ఏమాత్రం చెల్లదు. కృష్ణుడు రాజ్యం పెద్ద సైన్యం కలిగాయనే గర్వంతో పొగరెక్కి వాసుదేవుడనని అనుకుంటున్నాడుట. పోయి వద్దని చెప్పు” అని బలగర్వంతో మదోన్మత్తుడై, కమలాల వంటి కన్నులు ఉన్న శ్రీకృష్ణుడి దగ్గరకు పౌండ్రకుడు ఆ దూతను పంపించాడు. వాడు వెళ్ళి శ్రీకృష్ణుడు సభతీర్చి ఉండగా సంకోచం లేకుండా ఇలా అన్నాడు “ఓ శ్రీకృష్ణా! మా రాజు చెప్పిన మాటలు విను. ‘భూమిని రక్షించడానికి వాసుదేవుడనే పేరు నాకుండగా, నీవు సిగ్గు విడిచి ఆ పేరు పెట్టుకున్నావు. నా పేరూ, నా చిహ్నాలూ ధరించి సంచరిస్తున్నావు. ఇది నీ పంతమా? ఐనా గోవులకాచుకునే గోపాలుడికి పంతమేమిటి?

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=44&Padyam=508

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Monday, July 26, 2021

శ్రీకృష్ణ విజయము - 291

( నృగుడు యూసరవిల్లగుట )

10.2-481-వ.
మఱియును దన ధనంబు పరులచేతఁ గోల్పడిన విప్రుండు దుఃఖమున రోదనంబు సేయ రాలిన యశ్రుకణంబుల నవనిరేణువు లెన్ని తడియు నన్ని వేలేండ్లు తదుపేక్షాపరుండైన పతి దారుణ వేదనలుగల కుంభీపాక నరకంబు నొందు; మఱియు నతనితోడఁ గ్రిందటఁ బది తరంబులవారును, ముందటఁ బది తరంబులవారును మహానరకవేదనలం బొందుదురు; స్వదత్తంబైన నర్ధలోభంబునం జేసి దుశ్శీలుండై యెవ్వఁడు బ్రాహ్మణక్షేత్ర సంభూత ధాన్యధనాదికంబు భుజించు నప్పాపాత్ముం డఱువదివేల సంవత్సరంబులు మలకూపంబునం గ్రిమిరూపంబున వర్తించు; నట్లగుట యెఱింగి విప్రుడెంత తప్పు చేసిన నెన్ని గొట్టిన, నెన్ని దిట్టిన నతని కెదురు పలుకక వినయంబున వందనం బాచరించు పుణ్యాత్ములు నాదు పాలింటివా; రదియునుంగాక యేనును బ్రతిదినంబును భూసురుల నతి వినయంబునఁ బూజింతు; నిట్లు సేయక విపరీతవర్తనులైన తామసుల నేను వెదకి దండింతు; నదిగావున మీరలును బ్రాహ్మణజనంబుల వలనం బరమభక్తి గలిగి మెలంగుం" డని యానతిచ్చి యాదవప్రకరంబులు సేవింప నఖిలలోకశరణ్యుండైన యప్పుండరీకాక్షుండు నిజ నివాసంబునకుం జనియె” నని చెప్పి శుకుం డిట్లనియె.
10.2-482-క.
"ఈ కథఁ జదివిన వారలుఁ
గైకొని వినువారు విగత కలుషాత్మకులై
లౌకికసౌఖ్యము నొందుదు
రా కైవల్యంబుఁ గరతలామలక మగున్.

భావము:
పరుల వలన తన ధనాన్ని కోల్పోయిన బ్రాహ్మణుడు దుఃఖించి నపుడు, స్రవించిన కన్నీటిధారల వలన భూమిమీద ఎన్ని రేణువులు తడుస్తాయో, అన్ని వేల సంవత్సరాలు ఆ రాజ్యాన్ని పాలించేరాజు కుంభీపాక నరకంలో బాధలు అనుభవిస్తాడు. అంతేకాదు అతడికి పదితరాల పూర్వులూ, తర్వాత పదితరాల వారూ నరకవేదనలను పొందుతారు. తాను ఇచ్చినదైనా, మరొకరు ఇచ్చినదైనా బ్రాహ్మణ భూముల నుండి వచ్చిన ధనధాన్యాలను రాజు దుశ్శీలుడై ఆశించకూడదు. అట్లాశించిన పాపాత్ముడు అరవైవేల సంవత్సరములు మలకూపంలో పురుగై బ్రతుకుతాడు. కనుక, ఈ విశేషాలు గ్రహించి బ్రాహ్మణుడు ఎంత తప్పుచేసినా, ఎన్ని కొట్టినా ఎన్ని తిట్టినా, అతనికి ఎదురు చెప్పకుండా వినయంతో నమస్కరించాలి. అటువంటివారే పుణ్యాత్ములు. అటువంటివారే నా అనుగ్రహానికి పాత్రులవుతారు. అంతేకాదు, నేను కూడా ప్రతిరోజూ బ్రాహ్మణులను మిక్కిలి వినయంతో పూజిస్తాను. ఇలా కాకుండా విపరీతంగా ప్రవర్తించే తామసులను నేను వెదకి దండిస్తాను. అందువలన, మీరు బ్రాహ్మణుల పట్ల మిక్కిలి భక్తిపరులై ప్రవర్తించండి.” అని శ్రీకృష్ణుడు ఆనతిచ్చాడు. ఇలా ధర్మబోధ చేసి, యాదవులు సేవిస్తుండగా శ్రీకృష్ణుడు తన మందిరం చేరాడు.” ఇలా చెప్పిన పిమ్మట శుకమహర్షి ఇలా అన్నాడు. “ఈ కథను చదివినవారికీ, విన్నవారికీ, సర్వపాపాలు తొలగిపోతాయి. ఇహలోకంలో సౌఖ్యం ప్రాప్తిస్తుంది. పరలోకంలో మోక్షం సులభంగా లభిస్తుంది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=41&Padyam=482

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Friday, July 23, 2021

శ్రీకృష్ణ విజయము - 290

( నృగుడు యూసరవిల్లగుట )

10.2-479-సీ.
"నరనాథకుల కాననము దహించుటకును-
  నవనీసురులవిత్త మగ్నికీల;
జననాయకుల నిజైశ్వర్యాబ్ధి నింకింప-
  బ్రాహ్మణక్షేత్రంబు బాడబంబు;
పార్థివోత్తముల సంపచ్ఛైలములఁ గూల్ప-
  భూసురధనము దంభోళిధార;
జగతీవరుల కీర్తి చంద్రిక మాప వి-
  ప్రోత్తము ధనము సూర్యోదయంబు;
10.2-479.1-తే.
విప్రతతి సొమ్ముకంటెను విషము మేలు
గరళమునకును బ్రతికృతి గలదు గాని
దాని మాన్పంగ భువి నౌషధములు లేవు
గాన బ్రహ్మస్వములు గొంట గాదు పతికి.
10.2-480-క.
ఎఱుఁగమి నైనను భూసుర
వరులధనం బపహరింప వలవదు పతికిన్;
మఱపున ననలము ముట్టిన
దరికొని వెసఁ గాల్పకున్నె తను వెరియంగన్?

భావము:
రాజవంశం అనే అడవిని దహించే అగ్నిజ్వాల బ్రాహ్మణుల ధనం; జగపతుల ఐశ్వర్యం అనే సముద్రాన్ని ఇంకించే బడబానలం విప్రక్షేత్రం; నరనాథుల సంపద అనే పర్వతాలకు భూసురుల ధనం వజ్రాయుధం; భూపతుల కీర్తి అనే వెన్నెలను తొలగించే సూర్యోదయం విప్రుల సంపద; బ్రాహ్మణుల ధనం కంటే విషం మేలు; విషానికి విరుగుడు ఉన్నది కానీ, బ్రాహ్మణ ధనాపహరణ వలన ప్రాప్తించే పాపానికి ప్రాయశ్చిత్తం లేదు; అందుచేత, క్షత్రియులు బ్రాహ్మణుల ధనాన్ని అపహరించడం మంచిది కాదు. తెలిసి కాని, తెలియక కాని, విప్రుల సొమ్ము రాజు అపహరించ రాదు, తెలియక అగ్నిని ముట్టుకున్నా, శరీరం బొబ్బలెక్కి బాధపెడుతుంది తప్ప, ఆ అగ్ని దహించకుండా ఉండదు కదా.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=41&Padyam=480

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :