Saturday, July 31, 2021

శ్రీకృష్ణ విజయము - 296

( పౌండ్రకవాసుదేవుని వధ )

10.2-520-వ.
అట్టియెడ రుధిర ప్రవాహంబులును, మేదోమాంసపంకంబునునై సంగరాంగణంబు ఘోరభంగి యయ్యె; నయ్యవసరంబునం గయ్యంబునకుం గాలుద్రవ్వు నప్పౌండ్రకునిం గనుంగొని; హరి సంబోధించి యిట్లనియె.
10.2-521-మ.
"మనుజేంద్రాధమ! పౌండ్రభూపసుత! నీ మానంబు బీరంబు నేఁ
డనిలో మాపుదు; నెద్దు క్రొవ్వి పెలుచన్నాఁబోతుపై ఱంకెవై
చిన చందంబున దూతచేత నను నాక్షేపించి వల్దన్న పే
రునుఁ జిహ్నంబులు నీపయిన్ విడుతునర్చుల్‌ పర్వనేఁడాజిలోన్
10.2-522-క.
అదిగాక నీదు శరణము
పదపడి యేఁజొత్తు నీవు బల విక్రమ సం
పదగల పోటరి వేనిం
గదలక నిలు" మనుచు నిశితకాండము లంతన్.
10.2-523-మ.
చల మొప్పన్ నిగుడించి వాని రథముం జక్కాడి తత్సారథిం
దల వే త్రుంచి హయంబులన్ నరికి యుద్దండప్రతాపక్రియం
బ్రళయార్కప్రతిమాన చక్రమున నప్పౌండ్రున్ వెసం ద్రుంప వాఁ
డిలఁ గూలెం గులిశాహతిన్నొరగు శైలేంద్రాకృతిన్ భూవరా!

భావము:
అలా శ్రీకృష్ణుడు చేస్తున్న యుద్ధంలో, నెత్తుటి ప్రవాహంతో, మాంసపు బురదతో సంగరాంగణం భయంకరంగా అయిపోయింది. ఆ సమయంలో తనపై కాలుద్రువ్వుతున్న పౌండ్రకుడిని చూసి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. “ఓ రాజాధమా! పౌండ్రకా! ఈరోజు యుద్ధంలో నీ మానం అంతా మంటగలుపుతాను. పౌరుషం అంతా పటాపంచలు చేస్తాను. ఎద్దు క్రొవ్వెక్కి ఆబోతుపై రంకెవేసినట్లు, నా దగ్గరకు దూతను పంపి నన్ను ఆక్షేపించావు. నన్ను వదలివేయమనిన ఆ చక్రాది చిహ్నాలనే నీ మీద నిప్పులు చెలరేగేలా యుద్ధంలో ప్రయోగిస్తాను. అలా చేయలేకపోతే నిన్ను శరణువేడతానులే. నిజంగా నీవు కనుక బలపరాక్రమాలు గల వీరాధివీరుడవు అయితే యుద్ధరంగంలో నిలకడగా ఉండు.” అంటూనే శ్రీకృష్ణుడు వాడి బాణాలను సంధించి, పట్టుదలతో బాణాలు వేసి, వాడి రథాన్ని కూల్చివేసి, వెంటవెంటనే సారథి తల తెగనరికి, గుఱ్ఱాలను సంహరించాడు. ఉద్దండ ప్రతాపంతో ప్రళయకాల సూర్యుడితో సమానమైన తన చక్రాయుధాన్ని ప్రయోగించి, పౌండ్రకుడి శిరస్సును ఖండించాడు. వజ్రాయుధము దెబ్బకి కూలిన పర్వతంలా పౌండ్రకుడు నేలకూలాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=44&Padyam=523

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: