Thursday, July 29, 2021

శ్రీకృష్ణ విజయము - 294

( పౌండ్రకవాసుదేవుని వధ )

10.2-515-వ.
అంతఁ గృష్ణుండు దండయాత్రోత్సుకుఁడై వివిధాయుధ కలితంబును, విచిత్రకాంచనపతాకాకేతు విలసితంబు నగు సుందరస్యందనంబుఁ బటు జవతురంగంబులం బూన్చి దారుకుండు తెచ్చిన, నెక్కి యతిత్వరితగతిం గాశికానగరంబున కరిగినం, బౌండ్రకుండును రణోత్సాహంబు దీపింప నక్షౌహిణీద్వితయంబుతోడం బురంబు వెడలె, నప్పు డతని మిత్రుండైన కాశీపతియును మూఁ డక్షౌహిణులతోడం దోడుపడువాఁడై వెడలె, నిట్లాప్తయుతుండై వచ్చువాని.
10.2-516-సీ.
చక్ర గదా శంఖ శార్ఙ్గాది సాధనుఁ-
  గృత్రిమగౌస్తుభ శ్రీవిలాసు
మకరకుండల హార మంజీర కంకణ-
  మణిముద్రికా వనమాలికాంకుఁ
దరళ విచిత్ర పతంగ పుంగవకేతుఁ-
  జెలువొందు పీతకౌశేయవాసు
జవనాశ్వకలిత కాంచన రథారూఢుని-
  రణకుతూహలు లసన్మణికిరీటు
10.2-516.1-తే.
నాత్మసమవేషు రంగవిహారకలిత
నటసమానునిఁ బౌండ్రభూనాథుఁ గాంచి
హర్ష మిగురొత్త నవ్వెఁ బద్మాయతాక్షుఁ
డంత వాఁడును నుద్వృత్తుఁ డగుచు నడరి.

భావము:
ఆ తరువాత, దారుకుడు అనేక రకాల ఆయుధాలు కలది; బంగారుజెండాతో విలసిల్లుతున్నది; వేగవంతాలైన గుఱ్ఱాలు కట్టినది అయిన రథం సిద్ధంచేసి తీసుకువచ్చాడు. శ్రీకృష్ణుడు పౌండ్రకుడి మీదకు దండయాత్రకు ఉత్సహించి దారుకుడు తెచ్చిన ఆ రథాన్ని అధిరోహించి కాశీనగరానికి వెళ్ళాడు. పౌండ్రకుడు కూడా మిక్కిలి రణోత్సాహంతో రెండు అక్షౌహిణుల సైన్యంతో పట్టణం బయటకు వచ్చాడు. అతని స్నేహితుడైన కాశీరాజు కూడ మూడు అక్షౌహిణుల సైన్యంతో పౌండ్రకునికి సహాయంగా వచ్చాడు. ఈ విధంగా మిత్రసహితుడై యుద్ధరంగానికి వస్తున్న పౌండ్రకుడిని శ్రీకృష్ణుడు చూసాడు. పౌండ్రకుడు శంఖం, చక్రం, గద, శార్ఞ్గంకత్తి మొదలైన ఆయుధాలను ధరించాడు. కృత్రిమమైన కౌస్తుభమణి వక్షాన తగిలించుకున్నాడు. మకరకుండలాలు, హారాలు, కంకణాలు ధరించాడు. కంఠంలో వనమాల వేసుకున్నాడు. గరుడకేతనాన్ని చేకూర్చుకున్నాడు. పీతాంబరాన్ని కట్టాడు. వడిగల గుఱ్ఱాలతో గూడిన బంగారురథాన్ని అధిరోహించాడు. కాంతివంతమైన కిరీటాన్ని తలపై అలంకరించుకుని యుద్ధానికి సిద్ధపడుతున్నాడు. ఇలా తన వేషాన్ని ధరించిన పౌండ్రకుని చూసి రంగస్థల నటునిగా భావించి శ్రీకృష్ణుడు పకపకా నవ్వాడు. ఆ పరిహాసానికి పౌండ్రకుడు మండిపడ్డాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=44&Padyam=516

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: