Saturday, February 29, 2020

దక్ష యాగము - 48

(శివుడనుగ్రహించుట )
4-160-సీ.
అనఘాత్మ! తగ నీవు నబ్జనాభుండును;
బరికింపఁ బ్రాహ్మణాభాసు లయిన
వారల యెడల నెవ్వలన నుపేక్షింప;
రఁట! దృఢవ్రతచర్యు లైనవారి
యెడ నీకుపేక్ష యెక్కడిది? సర్గాదిని;
నామ్నాయ సంప్రదాయప్రవర్త
నము నెఱింగించుట కమర విద్యాతపో;
వ్రత పరాయణులైన బ్రాహ్మణులను
4-160.1-తే.
వరుసఁ బుట్టించితివి; కాన వారి నెపుడుఁ
గేల దండంబుఁ బూని గోపాలకుండు
బలసి గోవుల రక్షించు పగిది నీవు
నరసి రక్షించుచుందు గదయ్య రుద్ర!
4-161-సీ.
తలపోయ నవిదిత తత్త్వవిజ్ఞానుండ;
నైన నాచేత సభాంతరమున
నతి దురుక్త్యంబక క్షతుఁడ వయ్యును మత్కృ;
తాపరాధము హృదయంబు నందుఁ
దలఁపక సుజన నిందాదోషమున నధో;
గతిఁ బొందుచున్న దుష్కర్ము నన్నుఁ
గరుణఁ గాచిన నీకుఁ గడఁగి ప్రత్యుపకార;
మెఱిఁగి కావింప నే నెంతవాఁడ?
4-161.1-తే.
నుతచరిత్ర! భవత్పరానుగ్రహాను
రూప కార్యంబుచేత నిరూఢమైన
తుష్టి నీ చిత్తమందు నొందుదువు గాక;
క్షుద్రసంహార! కరుణాసముద్ర! రుద్ర!"

భావము:
పుణ్యాత్మా! నీవు, విష్ణువు కపట బ్రాహ్మణులను క్షమింపరు. దృఢమైన వ్రతం కల బ్రాహ్మణులను నిర్లక్ష్యం చేయరు. సృష్టి ఆరంభంలో వేదసంప్రదాయాలను ప్రవర్తింపజేయడానికి నీవు బ్రాహ్మణులను సృజించావు. విద్య, తపస్సు, వ్రతం బ్రాహ్మణుల ధర్మాలు. కాబట్టి కర్ర చేత పట్టుకొని గోపాలుడు గోవులను కాపాడే విధంగా నీవు బ్రాహ్మణులను నిత్యం శ్రద్ధగా కాపాడుతూ ఉంటావు. క్షుద్రులను సంహరించే రుద్రా! దయా సముద్రా! నేను తత్త్వజ్ఞానం తెలియని మూర్ఖుడను. మహాసభలో నేను పలికిన చెడ్డ పలుకులు అనే ములుకులచేత నీవు గాయపడ్డావు. అయినా నేను చేసిన నేరాన్ని నీవు మనస్సులో పెట్టుకోలేదు. మహానుభావుణ్ణి నిందించిన పాపంచేత అధోగతికి పోవలసిన పాపాత్ముణ్ణి నన్ను దయతో కాపాడావు. నీకు తిరిగి ఉపకారం చేయటానికి నే నెంతవాణ్ణి? ఓ సచ్చరిత్రా! త్రినేత్రా! ఇతరులను అనుగ్రహించే కార్యాల మూలంగా కలిగే ఆనందాన్ని నీవు పొందుదువు గాక!”

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=161

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

Friday, February 28, 2020

దక్ష యాగము - 47

(శివుడనుగ్రహించుట )

4-157-క.
విను దక్షు నంత మేషము
ఖునిఁ జేసిన నిద్ర మేలుకొని లేచిన పో
ల్కిని నిలిచె దక్షుఁ, డభవుఁడు
కనుఁగొనుచుండంగ నాత్మఁ గౌతుక మొప్పన్.
4-158-వ.
ఇట్లు లేచి నిలిచి ముందఱ నున్న శివునిం గనుంగొనిన మాత్రన శరత్కాలంబున నకల్మషంబైన సరస్సునుంబోలెఁ బూర్వ రుద్రవిద్వేష జనితంబు లైన కల్మషంబులం బాసి నిర్మలుండై యభవుని నుతియింపం దొడంగి మృతిఁ బొందిన సతీ తనయం దలంచి యనురా గోత్కంఠ బాష్పపూరిత లోచనుండును, గద్గదకంఠుండునునై పలుకం జాలక యెట్టకేలకు దుఃఖంబు సంస్తంభించుకొని ప్రేమాతిరేక విహ్వలుం డగుచు సర్వేశ్వరుం డగు హరున కిట్లనియె.
4-159-క.
"విను; నీ కపరాధుఁడ నగు
నను దండించు టది దండనము గాదు మది
న్నను రక్షించుటగా మన
మునఁ దలఁతును దేవ! యభవ! పురహర! రుద్రా!

భావము:
విదురా! విను. శివుడు దక్షుని గొఱ్ఱెతల కలవానిగా చేసి చూస్తుండగా అతడు నిద్రనుండి మేలుకొన్న విధంగా సంతోషంగా లేచాడు.
అలా లేచి నిలిచిన దక్షుడు శివుని చూచినంత మాత్రాన శరత్కాలంలో బురద లేని సరస్సు వలె పూర్వం రుద్రుని ద్వేషించడం వలన కలిగిన దోషాలను పోగొట్టుకొని నిర్మలుడై ఆ శివుణ్ణి స్తుతించాలకున్నాడు. కాని మరణించిన తన కూతురును తలచుకొని ప్రేమతో, తహతహపాటుతో కన్నులలో నీరు నిండగా, డగ్గుత్తిక పడిన కంఠంతో మాట్లాడలేక, ఎట్టకేలకు దుఃఖాన్ని దిగమ్రింగుకొని ప్రేమాతిరేకంతో ఒడలు మరచి ఆ శివునితో ఇలా అన్నాడు. “దేవా! అభవా! పురాంతకా! రుద్రా! విను. నీకు అపరాధం చేసిన నన్ను నీవు శిక్షించడం నాకు అది శిక్ష కాదు. అది నన్ను రక్షించడంగానే భావిస్తాను.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=159

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

Thursday, February 27, 2020

దక్ష యాగము - 46


(శివుడనుగ్రహించుట )

4-155-వ.
అని "దగ్దశీర్షుం డయిన దక్షుం డజముఖుం డగు; భగుండు బర్హి స్సంబంధ భాగంబులు గలిగి మిత్రనామధేయ చక్షుస్సునం బొడగాంచు; పూషుండు పిష్టభుక్కగుచు యజమాన దంతంబులచే భక్షించు; దేవతలు యజ్ఞావశిష్టంబు నాకొసగుటంజేసి సర్వావయవ పూర్ణులై వర్తింతురు; ఖండితాంగులైన ఋత్విగాది జనంబు లశ్వనీదేవతల బాహువులచేతను బూషుని హస్తంబులచేతను లబ్ధబాహు హస్తులై జీవింతురు; భృగువు బస్తశ్మశ్రువులు గలిగి వర్తించు;" అని శివుండా నతిచ్చిన సమస్తభూతంబులును సంతుష్టాంతరంగంబులై “తండ్రీ లెస్సయ్యె” నని సాధువాదంబుల నభినందించిరి: అంతనా శంభుని యామంత్రణంబు వడసి సునాసీర ప్రముఖులగు దేవతలు ఋషులతోడం గూడి రా నజుండును రుద్రునిం బురస్కరించుకొని దక్షాధ్వర వాటంబుకుం జనియె; అంత.
4-156-క.
శర్వుని యోగక్రమమున
సర్వావయవములుఁ గలిగి సన్ముని ఋత్వి
గ్గీర్వాణముఖ్య లొప్పిరి
పూర్వతనుశ్రీల నార్యభూషణ! యంతన్.

భావము:
అని చెప్పి “శిరస్సు దహింపబడిన దక్షుడు గొఱ్ఱెముఖం కలవాడు అవుతాడు. భగుడు దర్భలతో సంబంధించిన యజ్ఞభాగాన్ని పొంది మిత్రనామకమైన నేత్రాలతో చూస్తాడు. పూషుడు పిండములను యజమాని దంతాల ద్వారా భుజిస్తాడు. దేవతలు యజ్ఞశేషాన్ని నాకు సమర్పించడం వల్ల మునుపటి వలె అన్ని అవయవాలు కలిగి సంచరిస్తారు. అవయవాలు ఖండింపబడిన ఋత్విక్కులు మొదలైనవారు అశ్వినీ దేవతల బాహువుల చేతను, పూషుని హస్తాల చేతను తమ తమ బాహువులను, హస్తాలను పొంది బ్రతుకుతారు. భృగువు చింబోతు మీసాలు, గడ్డాము పొందుతాడు” అని శివుడు ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు సమస్త ప్రాణులు సంతోషించి “తండ్రీ! బాగు బాగు” అని మెచ్చుకున్నారు. అప్పుడు ఆ శివుని దగ్గర సెలవు తీసుకొని ఇంద్రుడు మొదలైన దేవతలు ఋషులతో కూడి బయలుదేరారు. బ్రహ్మదేవుడు శివుణ్ణి ముందుంచుకొని దక్షయజ్ఞం జరిగిన ప్రదేశానికి వెళ్ళాడు. అప్పుడు ఓ విదురా! గొప్పవారిచే మన్నింపబడేవాడ! శివుని ఆజ్ఞానుసారంగా మునులు, ఋత్విక్కులు, దేవతలు మొదలైన వారంతా తమ తమ పూర్వశరీరాలను పొంది చక్కగా ప్రకాశించారు. అప్పుడు…

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=155

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

దక్ష యాగము - 45


(శివుడనుగ్రహించుట )

4-151-వ.
అది గావున యజ్ఞభాగార్హుండ వయిన నీకు సవనభాగంబు సమర్పింపని కతన నీచేత విధ్వంస్తంబయి పరిసమాప్తి నొందని దక్షాధ్వరంబు మరల నుద్ధరించి దక్షునిఁ బునర్జీవితుం జేయుము; భగుని నేత్రంబులును, భృగుముని శ్మశ్రువులును, బూషుని దంతంబులును, గృపఁజేయుము; భగ్నాంగు లయిన దేవ ఋత్విఙ్నికాయంబులకు నారోగ్యంబు గావింపుము; ఈ మఖావశిష్టంబు యజ్ఞ పరిపూర్తి హేతుభూతం బయిన భవదీయభాగం బగుం గాక."
4-152-చ.
అని చతురాననుండు వినయంబున వేఁడిన నిందుమౌళి స
య్యనఁ బరితుష్టిఁ బొంది దరహాసము మోమునఁ దొంగలింప ని
ట్లను "హరిమాయచేత ననయంబును బామరు లైనవారు చే
సిన యపరాధ దోషములు చిత్తములో గణియింప నెన్నఁడున్.
4-153-వ.
అట్లయ్యును.
4-154-క.
బలియుర దండించుట దు
ర్భలజన రక్షణము ధర్మపద్ధతి యగుటం
గలుషాత్ముల నపరాధము
కొలఁదిని దండించుచుందుఁ గొనకొని యేనున్."

భావము:
అందువల్ల యజ్ఞభాగానికి అర్హుడవైన నీకు యజ్ఞభాగాన్ని ఇవ్వకపోవడం వల్ల నీవు దక్షుని యజ్ఞాన్ని ధ్వంసం చేశావు. అది అసంపూర్ణంగా మధ్యలో ఆగిపోయింది. అటువంటి దక్షయజ్ఞాన్ని నీవు పునరుద్ధరించు. దక్షుని బ్రతికించు. భగునికి కన్నులను, భృగుమహర్షికి మీసాలను, పూషునికి దంతాలను అనుగ్రహించు. అవయవాలు తుత్తునియలైన దేవతలకు, ఋత్విక్కులకు ఆరోగ్యం ప్రసాదించు. మిగిలిన యజ్ఞకార్యం సమస్తం పూర్తి కావించి ఈ యాగాన్ని నీ భాగంగా స్వీకరించు.” అని బ్రహ్మదేవుడు వినయంతో వేడుకొనగా శివుడు వెంటనే తృప్తిపడి చిరునవ్వుతో దయతో ఇలా అన్నాడు. ‘విష్ణుమాయకు వశులై పామరులు చేసిన దోషాలను నేను మనస్సులో ఎప్పుడూ లెక్కచేయను. అయినా బలవంతులను శిక్షించడం, దుర్బలులను రక్షించడం ధర్మమార్గం కనుక నేను దుష్టులను వారు చేసిన దోషాలకు తగినట్లుగా శిక్షిస్తూ ఉంటాను.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=154

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Tuesday, February 25, 2020

దక్ష యాగము - 44


(శివుడనుగ్రహించుట )

4-149-సీ.
"మఱి భేదబుద్ధిఁ గర్మప్రవర్తనముల;
మదయుతు లయి దుష్టహృదయు లగుచుఁ
బరవిభవాసహ్య భవ మనో వ్యాధులఁ;
దగిలి మర్మాత్మ భేదకము లయిన
బహు దురుక్తుల చేతఁ బరులఁ బీడించుచు;
నుండు మూఢులను దైవోపహతులఁ
గాఁ దలపోసి య క్కపటచిత్తులకు నీ;
వంటి సత్పురుషుఁ డేవలన నైన
4-149.1-తే.
హింసఁ గావింపకుండు సమిద్ధచరిత!
నీలలోహిత! మహితగుణాలవాల!
లోకపాలనకలిత! గంగాకలాప!
హర! జగన్నుతచారిత్ర! యదియుఁ గాక.
4-150-సీ.
అమర సమస్త దేశము లందు నఖిల కా;
లములందుఁ దలఁప దుర్లంఘ్య మహిముఁ
డగు పద్మనాభు మాయా మోహితాత్మకు;
లై భేదదర్శను లైనవారి
వలనను ద్రోహంబు గలిగిన నైనను;
నది దైవకృత మని యన్యదుఃఖ
ముల కోర్వలేక సత్పురుషుండు దయచేయు;
గాని హింసింపఁడు గాన నీవు
4-150.1-తే.
నచ్యుతుని మాయమోహము నందకుంటఁ
జేసి సర్వజ్ఞుఁడవు; మాయచేత మోహి
తాత్ములై కర్మవర్తను లయినవారి
వలన ద్రోహంబుగలిగిన వలయుఁ బ్రోవ.

భావము:
ఓ భవ్యచరితా! నీలలోహితా! పావన గుణ భరితా! లోక పరిపాలా! గంగాధరా! హరా! సకల లోక స్తుత చరిత్రా! మూర్ఖులు మదించి, దుష్టచిత్తులై భేదబుద్ధితో ప్రవర్తిస్తారు. పరుల సంపదను చూచి ఓర్వలేరు. మనోవ్యాధితో క్రుంగిపోతారు. మర్మస్థానాలను భేదించే పరుషవాక్కులతో ఇతరులను బాధిస్తారు. నీవు వారిని దైవానుగ్రహానికి దూరమైన వారినిగా భావిస్తావు. ఆ కపటాత్ములకు నీవంటి సత్పురుషుడు ఏ విధంగానూ హింస కావించడు. సమస్త దేశాలలోను, సర్వ కాలాలలోను ఉల్లంగించరాని మహిమ కల విష్ణువు యొక్క మాయకు చిక్కినవారు భేదదృష్టితో ప్రవర్తిస్తారు. వారు ద్రోహం చేసినట్లైతే సత్పురుషుడు అది దైవకృతంగా భావిస్తాడు. ఆ మహితాత్ముడు ఇతరుల దుఃఖం చూచి ఓర్చుకోలేడు. వారిమీద జాలి పడతాడు. అంతేకాని వారిని హింసింపడు. నీవు విష్ణుమాయకు అతీతుడవు. అందుచేత నీవు సర్వజ్ఞుడవు. విష్ణుమాయకు వశులై కర్మలు ఆచరించేవారు అపరాధం చేసినట్లైతే నీవు క్షమించి వారిని కాపాడాలి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=149

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

దక్ష యాగము - 43


(శివుడనుగ్రహించుట )

4-147-సీ.
అనఘ! లోకంబుల యందు వర్ణాశ్రమ;
సేతువు లనఁగఁ బ్రఖ్యాతి నొంది
బలసి మహాజన పరిగృహీతంబులై;
యఖిల ధర్మార్థదాయకము లైన
వేదంబులను మఱి వృద్ధి నొందించుట;
కొఱకునై నీవ దక్షుని నిమిత్త
మాత్రునిఁ జేసి యమ్మఖముఁ గావించితి;
వటుగాన శుభమూర్తివైన నీవు
4-147.1-తే.
గడఁగి జనముల మంగళకర్ము లయిన
వారి ముక్తి, నమంగళాచారు లయిన
వారి నరకంబు, నొందింతు భూరిమహిమ
భక్తజనపోష! రాజితఫణివిభూష!
4-148-వ.
అట్లగుటం దత్కర్మంబు లొకానొకనికి విపర్యాసంబు నొందుటకుఁ గారణం బెయ్యదియో? భవదీయ రోషంబు హేతువని తలంచితినేనిఁ ద్వదీయ పాదారవింద నిహిత చిత్తులై సమస్తభూతంబుల యందు నినుం గనుంగొనుచు భూతంబుల నాత్మయందు వేఱుగాఁ జూడక వర్తించు మహాత్ముల యందు నజ్ఞులైనవారి యందుఁబోలె రోషంబు దఱచు వొరయ దఁట; నీకుఁ గ్రోధంబు గలదే?" యని.

భావము:
ఓ భక్తజన పోషణా! పన్నగ భూషణా! లోకాలలో వర్ణాశ్రమాచారాలను వేదాలు నిర్ణయిస్తాయి. గొప్పవారు వేదాలను గౌరవిస్తారు. వేదాలు సర్వ ధర్మార్థాలను ప్రసాదిస్తాయి. ఆ వేదాలను వృద్ధి చేయటం కోసం నీవు దక్షుణ్ణి నిమిత్తమాత్రునిగా చేసి ఆ యజ్ఞం చేయించావు. నీవు మంగళ స్వరూపుడవు. నీవు న్ మహిమచేత శుభకర్మలు చేసేవారికి ముక్తిని, అశుభకర్మలు చేసేవారికి నరకాన్ని కలిగిస్తావు. అయినప్పుడు ఒకరి విషయంలో ఆ కర్మలు తల్లక్రిందులుగా కావటానికి నీ కోపం కారణం అని అనుకుందామా? నీ పాదపద్మాలపై మనస్సు నిల్పి సమస్త ప్రాణులలోను నిన్ను చూస్తూ ఇతర ప్రాణులను తనకంటే వేరుగా ఉండకుండా మహాత్ములు ప్రవర్తిస్తారు. అటువంటి మహాత్ములకు మూర్ఖులకు కలిగినట్లు కోపం కలుగదు కదా! మహానుభావుడవైన నీకు కోపం ఎక్కడిది?

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=147

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Monday, February 24, 2020

దక్ష యాగము - 42


(శివుడనుగ్రహించుట )

4-143-క.
"అనఘ! మహాత్ముం డగు వా
మనుఁ డా కశ్యపునకొగి నమస్కారము చే
సినగతి నజునకు నభివం
దన మొగిఁ గావించె హరుఁడు దద్దయుఁ బ్రీతిన్.
4-144-తే.
అంత రుద్రానువర్తు లైనట్టి సిద్ధ
గణ మహర్షి జనంబులు గని పయోజ
గర్భునకు మ్రొక్కి; రంత నా కమలభవుఁడు
శర్వుఁ గని పల్కె మందహాసంబుతోడ.
4-145-తే.
జగములకు నెల్ల యోనిబీజంబు లైన
శక్తి శివకారణుండవై జగతి నిర్వి
కార బ్రహ్మంబ వగు నిన్నుఁ గడఁగి విశ్వ
నాథుఁ గా నెఱిఁగెద నా మనమున నభవ!
4-146-తే.
సమత నది గాక తావకాంశంబు లైన
శక్తి శివరూపములఁ గ్రీడ సలుపు దూర్ణ
నాభి గతి విశ్వ జనన వినాశ వృద్ధి
హేతుభూతుండ వగుచుందు వీశ! రుద్ర!

భావము:
పుణ్యాత్ముడవైన ఓ విదురా! మహాత్ముడైన వామనుడు కశ్యపునకు నమస్కరించినట్లుగా శివుడు బ్రహ్మకు ఎంతో ఇష్టంతో నమస్కారం చేసాడు. అప్పుడు శివుని అనుచరులైన సిద్ధగణాలు, మునులు బ్రహ్మను చూచి నమస్కరించారు. ఆ తరువాత బ్రహ్మ శివుణ్ణి చూచి చిరునవ్వుతో ఇలా అన్నాడు. “ఓ పరమేశ్వరా! లోకాల కన్నింటికి ఉత్పత్తిస్థానం అయిన శక్తివి నీవే. జగత్తుల కన్నింటికీ బీజమైన శివుడు నీవే. నీవు నిర్వికార పరబ్రహ్మవు. నిన్ను విశ్వనాథునిగా నా మనస్సులో తెలుసుకున్నాను. ఓ ఈశ్వరా! రుద్రా! నీవు నీ సమాంశాలైన శివ శక్తి స్వరూపాలతో క్రీడిస్తావు. సాలెపురుగు వలె విశ్వసృష్టికీ, వృద్ధికీ వినాశానికీ నీవే హేతువు అవుతుంటావు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=146

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :