Tuesday, February 25, 2020

దక్ష యాగము - 43


(శివుడనుగ్రహించుట )

4-147-సీ.
అనఘ! లోకంబుల యందు వర్ణాశ్రమ;
సేతువు లనఁగఁ బ్రఖ్యాతి నొంది
బలసి మహాజన పరిగృహీతంబులై;
యఖిల ధర్మార్థదాయకము లైన
వేదంబులను మఱి వృద్ధి నొందించుట;
కొఱకునై నీవ దక్షుని నిమిత్త
మాత్రునిఁ జేసి యమ్మఖముఁ గావించితి;
వటుగాన శుభమూర్తివైన నీవు
4-147.1-తే.
గడఁగి జనముల మంగళకర్ము లయిన
వారి ముక్తి, నమంగళాచారు లయిన
వారి నరకంబు, నొందింతు భూరిమహిమ
భక్తజనపోష! రాజితఫణివిభూష!
4-148-వ.
అట్లగుటం దత్కర్మంబు లొకానొకనికి విపర్యాసంబు నొందుటకుఁ గారణం బెయ్యదియో? భవదీయ రోషంబు హేతువని తలంచితినేనిఁ ద్వదీయ పాదారవింద నిహిత చిత్తులై సమస్తభూతంబుల యందు నినుం గనుంగొనుచు భూతంబుల నాత్మయందు వేఱుగాఁ జూడక వర్తించు మహాత్ముల యందు నజ్ఞులైనవారి యందుఁబోలె రోషంబు దఱచు వొరయ దఁట; నీకుఁ గ్రోధంబు గలదే?" యని.

భావము:
ఓ భక్తజన పోషణా! పన్నగ భూషణా! లోకాలలో వర్ణాశ్రమాచారాలను వేదాలు నిర్ణయిస్తాయి. గొప్పవారు వేదాలను గౌరవిస్తారు. వేదాలు సర్వ ధర్మార్థాలను ప్రసాదిస్తాయి. ఆ వేదాలను వృద్ధి చేయటం కోసం నీవు దక్షుణ్ణి నిమిత్తమాత్రునిగా చేసి ఆ యజ్ఞం చేయించావు. నీవు మంగళ స్వరూపుడవు. నీవు న్ మహిమచేత శుభకర్మలు చేసేవారికి ముక్తిని, అశుభకర్మలు చేసేవారికి నరకాన్ని కలిగిస్తావు. అయినప్పుడు ఒకరి విషయంలో ఆ కర్మలు తల్లక్రిందులుగా కావటానికి నీ కోపం కారణం అని అనుకుందామా? నీ పాదపద్మాలపై మనస్సు నిల్పి సమస్త ప్రాణులలోను నిన్ను చూస్తూ ఇతర ప్రాణులను తనకంటే వేరుగా ఉండకుండా మహాత్ములు ప్రవర్తిస్తారు. అటువంటి మహాత్ములకు మూర్ఖులకు కలిగినట్లు కోపం కలుగదు కదా! మహానుభావుడవైన నీకు కోపం ఎక్కడిది?

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=147

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: