(శివుడనుగ్రహించుట )
4-157-క.
విను దక్షు నంత మేషము
ఖునిఁ జేసిన నిద్ర మేలుకొని లేచిన పో
ల్కిని నిలిచె దక్షుఁ, డభవుఁడు
కనుఁగొనుచుండంగ నాత్మఁ గౌతుక మొప్పన్.
4-158-వ.
ఇట్లు లేచి నిలిచి ముందఱ నున్న శివునిం గనుంగొనిన మాత్రన శరత్కాలంబున నకల్మషంబైన సరస్సునుంబోలెఁ బూర్వ రుద్రవిద్వేష జనితంబు లైన కల్మషంబులం బాసి నిర్మలుండై యభవుని నుతియింపం దొడంగి మృతిఁ బొందిన సతీ తనయం దలంచి యనురా గోత్కంఠ బాష్పపూరిత లోచనుండును, గద్గదకంఠుండునునై పలుకం జాలక యెట్టకేలకు దుఃఖంబు సంస్తంభించుకొని ప్రేమాతిరేక విహ్వలుం డగుచు సర్వేశ్వరుం డగు హరున కిట్లనియె.
4-159-క.
"విను; నీ కపరాధుఁడ నగు
నను దండించు టది దండనము గాదు మది
న్నను రక్షించుటగా మన
మునఁ దలఁతును దేవ! యభవ! పురహర! రుద్రా!
భావము:
విదురా! విను. శివుడు దక్షుని గొఱ్ఱెతల కలవానిగా చేసి చూస్తుండగా అతడు నిద్రనుండి మేలుకొన్న విధంగా సంతోషంగా లేచాడు.
అలా లేచి నిలిచిన దక్షుడు శివుని చూచినంత మాత్రాన శరత్కాలంలో బురద లేని సరస్సు వలె పూర్వం రుద్రుని ద్వేషించడం వలన కలిగిన దోషాలను పోగొట్టుకొని నిర్మలుడై ఆ శివుణ్ణి స్తుతించాలకున్నాడు. కాని మరణించిన తన కూతురును తలచుకొని ప్రేమతో, తహతహపాటుతో కన్నులలో నీరు నిండగా, డగ్గుత్తిక పడిన కంఠంతో మాట్లాడలేక, ఎట్టకేలకు దుఃఖాన్ని దిగమ్రింగుకొని ప్రేమాతిరేకంతో ఒడలు మరచి ఆ శివునితో ఇలా అన్నాడు. “దేవా! అభవా! పురాంతకా! రుద్రా! విను. నీకు అపరాధం చేసిన నన్ను నీవు శిక్షించడం నాకు అది శిక్ష కాదు. అది నన్ను రక్షించడంగానే భావిస్తాను.
http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=159
: : భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
2 comments:
భాగవతోత్తమా! రాంభట్ల ఆదిత్యవారూ నమోన్నమః
మీ బ్లాగును చూసిన వారు ధన్యులు.
మేలైన పోస్టు. తెలుగు వెలుగుల ప్రకాశానికి పోతన పద్యాలు ఊతమిస్తాయి. పోతనామాత్యుల పద్యాలలో ఆధ్యాత్మిక రహాస్యాలే ఉంటాయి, అంటారు.
Post a Comment