Monday, February 24, 2020

దక్ష యాగము - 42


(శివుడనుగ్రహించుట )

4-143-క.
"అనఘ! మహాత్ముం డగు వా
మనుఁ డా కశ్యపునకొగి నమస్కారము చే
సినగతి నజునకు నభివం
దన మొగిఁ గావించె హరుఁడు దద్దయుఁ బ్రీతిన్.
4-144-తే.
అంత రుద్రానువర్తు లైనట్టి సిద్ధ
గణ మహర్షి జనంబులు గని పయోజ
గర్భునకు మ్రొక్కి; రంత నా కమలభవుఁడు
శర్వుఁ గని పల్కె మందహాసంబుతోడ.
4-145-తే.
జగములకు నెల్ల యోనిబీజంబు లైన
శక్తి శివకారణుండవై జగతి నిర్వి
కార బ్రహ్మంబ వగు నిన్నుఁ గడఁగి విశ్వ
నాథుఁ గా నెఱిఁగెద నా మనమున నభవ!
4-146-తే.
సమత నది గాక తావకాంశంబు లైన
శక్తి శివరూపములఁ గ్రీడ సలుపు దూర్ణ
నాభి గతి విశ్వ జనన వినాశ వృద్ధి
హేతుభూతుండ వగుచుందు వీశ! రుద్ర!

భావము:
పుణ్యాత్ముడవైన ఓ విదురా! మహాత్ముడైన వామనుడు కశ్యపునకు నమస్కరించినట్లుగా శివుడు బ్రహ్మకు ఎంతో ఇష్టంతో నమస్కారం చేసాడు. అప్పుడు శివుని అనుచరులైన సిద్ధగణాలు, మునులు బ్రహ్మను చూచి నమస్కరించారు. ఆ తరువాత బ్రహ్మ శివుణ్ణి చూచి చిరునవ్వుతో ఇలా అన్నాడు. “ఓ పరమేశ్వరా! లోకాల కన్నింటికి ఉత్పత్తిస్థానం అయిన శక్తివి నీవే. జగత్తుల కన్నింటికీ బీజమైన శివుడు నీవే. నీవు నిర్వికార పరబ్రహ్మవు. నిన్ను విశ్వనాథునిగా నా మనస్సులో తెలుసుకున్నాను. ఓ ఈశ్వరా! రుద్రా! నీవు నీ సమాంశాలైన శివ శక్తి స్వరూపాలతో క్రీడిస్తావు. సాలెపురుగు వలె విశ్వసృష్టికీ, వృద్ధికీ వినాశానికీ నీవే హేతువు అవుతుంటావు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=146

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: