Thursday, February 27, 2020

దక్ష యాగము - 45


(శివుడనుగ్రహించుట )

4-151-వ.
అది గావున యజ్ఞభాగార్హుండ వయిన నీకు సవనభాగంబు సమర్పింపని కతన నీచేత విధ్వంస్తంబయి పరిసమాప్తి నొందని దక్షాధ్వరంబు మరల నుద్ధరించి దక్షునిఁ బునర్జీవితుం జేయుము; భగుని నేత్రంబులును, భృగుముని శ్మశ్రువులును, బూషుని దంతంబులును, గృపఁజేయుము; భగ్నాంగు లయిన దేవ ఋత్విఙ్నికాయంబులకు నారోగ్యంబు గావింపుము; ఈ మఖావశిష్టంబు యజ్ఞ పరిపూర్తి హేతుభూతం బయిన భవదీయభాగం బగుం గాక."
4-152-చ.
అని చతురాననుండు వినయంబున వేఁడిన నిందుమౌళి స
య్యనఁ బరితుష్టిఁ బొంది దరహాసము మోమునఁ దొంగలింప ని
ట్లను "హరిమాయచేత ననయంబును బామరు లైనవారు చే
సిన యపరాధ దోషములు చిత్తములో గణియింప నెన్నఁడున్.
4-153-వ.
అట్లయ్యును.
4-154-క.
బలియుర దండించుట దు
ర్భలజన రక్షణము ధర్మపద్ధతి యగుటం
గలుషాత్ముల నపరాధము
కొలఁదిని దండించుచుందుఁ గొనకొని యేనున్."

భావము:
అందువల్ల యజ్ఞభాగానికి అర్హుడవైన నీకు యజ్ఞభాగాన్ని ఇవ్వకపోవడం వల్ల నీవు దక్షుని యజ్ఞాన్ని ధ్వంసం చేశావు. అది అసంపూర్ణంగా మధ్యలో ఆగిపోయింది. అటువంటి దక్షయజ్ఞాన్ని నీవు పునరుద్ధరించు. దక్షుని బ్రతికించు. భగునికి కన్నులను, భృగుమహర్షికి మీసాలను, పూషునికి దంతాలను అనుగ్రహించు. అవయవాలు తుత్తునియలైన దేవతలకు, ఋత్విక్కులకు ఆరోగ్యం ప్రసాదించు. మిగిలిన యజ్ఞకార్యం సమస్తం పూర్తి కావించి ఈ యాగాన్ని నీ భాగంగా స్వీకరించు.” అని బ్రహ్మదేవుడు వినయంతో వేడుకొనగా శివుడు వెంటనే తృప్తిపడి చిరునవ్వుతో దయతో ఇలా అన్నాడు. ‘విష్ణుమాయకు వశులై పామరులు చేసిన దోషాలను నేను మనస్సులో ఎప్పుడూ లెక్కచేయను. అయినా బలవంతులను శిక్షించడం, దుర్బలులను రక్షించడం ధర్మమార్గం కనుక నేను దుష్టులను వారు చేసిన దోషాలకు తగినట్లుగా శిక్షిస్తూ ఉంటాను.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=154

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: