(శివుడనుగ్రహించుట )
4-155-వ.
అని "దగ్దశీర్షుం డయిన దక్షుం డజముఖుం డగు; భగుండు బర్హి స్సంబంధ భాగంబులు గలిగి మిత్రనామధేయ చక్షుస్సునం బొడగాంచు; పూషుండు పిష్టభుక్కగుచు యజమాన దంతంబులచే భక్షించు; దేవతలు యజ్ఞావశిష్టంబు నాకొసగుటంజేసి సర్వావయవ పూర్ణులై వర్తింతురు; ఖండితాంగులైన ఋత్విగాది జనంబు లశ్వనీదేవతల బాహువులచేతను బూషుని హస్తంబులచేతను లబ్ధబాహు హస్తులై జీవింతురు; భృగువు బస్తశ్మశ్రువులు గలిగి వర్తించు;" అని శివుండా నతిచ్చిన సమస్తభూతంబులును సంతుష్టాంతరంగంబులై “తండ్రీ లెస్సయ్యె” నని సాధువాదంబుల నభినందించిరి: అంతనా శంభుని యామంత్రణంబు వడసి సునాసీర ప్రముఖులగు దేవతలు ఋషులతోడం గూడి రా నజుండును రుద్రునిం బురస్కరించుకొని దక్షాధ్వర వాటంబుకుం జనియె; అంత.
4-156-క.
శర్వుని యోగక్రమమున
సర్వావయవములుఁ గలిగి సన్ముని ఋత్వి
గ్గీర్వాణముఖ్య లొప్పిరి
పూర్వతనుశ్రీల నార్యభూషణ! యంతన్.
భావము:
అని చెప్పి “శిరస్సు దహింపబడిన దక్షుడు గొఱ్ఱెముఖం కలవాడు అవుతాడు. భగుడు దర్భలతో సంబంధించిన యజ్ఞభాగాన్ని పొంది మిత్రనామకమైన నేత్రాలతో చూస్తాడు. పూషుడు పిండములను యజమాని దంతాల ద్వారా భుజిస్తాడు. దేవతలు యజ్ఞశేషాన్ని నాకు సమర్పించడం వల్ల మునుపటి వలె అన్ని అవయవాలు కలిగి సంచరిస్తారు. అవయవాలు ఖండింపబడిన ఋత్విక్కులు మొదలైనవారు అశ్వినీ దేవతల బాహువుల చేతను, పూషుని హస్తాల చేతను తమ తమ బాహువులను, హస్తాలను పొంది బ్రతుకుతారు. భృగువు చింబోతు మీసాలు, గడ్డాము పొందుతాడు” అని శివుడు ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు సమస్త ప్రాణులు సంతోషించి “తండ్రీ! బాగు బాగు” అని మెచ్చుకున్నారు. అప్పుడు ఆ శివుని దగ్గర సెలవు తీసుకొని ఇంద్రుడు మొదలైన దేవతలు ఋషులతో కూడి బయలుదేరారు. బ్రహ్మదేవుడు శివుణ్ణి ముందుంచుకొని దక్షయజ్ఞం జరిగిన ప్రదేశానికి వెళ్ళాడు. అప్పుడు ఓ విదురా! గొప్పవారిచే మన్నింపబడేవాడ! శివుని ఆజ్ఞానుసారంగా మునులు, ఋత్విక్కులు, దేవతలు మొదలైన వారంతా తమ తమ పూర్వశరీరాలను పొంది చక్కగా ప్రకాశించారు. అప్పుడు…
http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=155
: : భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
No comments:
Post a Comment