Friday, June 17, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౬౯(569)

( శ్రుతదేవ జనకుల చరిత్రంబు ) 

10.2-1189-వ.
అని యభ్యర్థించినం బ్రసన్నుండై యప్పుండరీకాక్షుండు నిమికుల ప్రదీపకుండైన జనకచక్రవర్తిం గరుణించి, యమ్మిథిలానగరంబునం బౌరజనంబులకు నున్నత శోభనంబులు గావించుచుం గొన్నిదినంబు లుండె; నంత.
10.2-1190-మ.
శ్రుతదేవుండును మోదియై మునిజనస్తోమంబుతో నిందిరా
పతిఁ దోకొంచు నిజాలయంబునకు నొప్పన్నేగి, యచ్చోట స
మ్మతి దర్భాస్తరణంబులన్నునిచి, సమ్యగ్జ్ఞానపారీణుఁడై
సతియుం దానుఁ బదాబ్జముల్‌ గడిగి చంచద్భక్తిఁ దత్తోయముల్‌.

భావము:
ఈ రీతిని నిమి వంశోద్ధారకుడు అయిన జనకుడు వేడగా శ్రీకృష్ణుడు అతని భక్తికి ప్రసన్నుడై మిథిలానగరంలో ప్రజలకు ఆనందాన్ని కలిగిస్తూ కొన్నాళ్ళ పాటు అక్కడే ఉన్నాడు. అంతట శ్రుతదేవుడు కూడ పరమానందంతో శ్రీకృష్ణుడిని మునులనూ తన ఇంటిలోకి తీసుకు వెళ్ళాడు. వారికి దర్భాసనాలు ఇచ్చి అతడు, అతని భార్యా వారి పాదపద్మాలను కడిగి, ఆ నీటిని...

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=82&Padyam=1190

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Thursday, June 16, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౬౮(568)

( శ్రుతదేవ జనకుల చరిత్రంబు ) 

10.2-1187-తే.
"కృష్ణ! పరమాత్మ! యదుకుల క్షీరవార్ధి
పూర్ణచంద్రమ! దేవకీపుత్త్ర! సుజన
వినుత! నారాయణాచ్యుత! వేదవేద్య!
భక్తజనపోషపరితోష! పరమపురుష!
10.2-1188-ఉ.
శ్రీ పురుషోత్తమాఖ్య! యదుసింహకిశోరక! భక్తలోకర
క్షాపరతంత్ర! నీవు మునిసంఘముఁ గొన్నిదినంబు లుండవే
నీ పదపద్మ రేణువులు నెమ్మి మదీయగృహంబు సోఁకినం
దాపసవంద్య! యే నిపుడ ధన్యుఁడ నయ్యెదఁగాదె మాధవా!”

భావము:
“పరమపురుషా! శ్రీకృష్ణా! యదుకుల క్షీరసాగరానికి పూర్ణచంద్రుడా! దేవకీనందనా! అచ్యుతా! నారాయణా! సజ్జన నుత! వేదవేద్యా! భక్తజనవత్సల! నీకు ప్రణామం. ఓ యదు సింహమా! నందకిశోరా! భక్తరక్షణ పరాయణా! పురుషోత్తముడు అనే సార్థక నామధేయం కలవాడ! నీవూ ఈ మునులు కొన్నాళ్ళపాటు ఇక్కడే ఉండండి. నీ పాదధూళి నా గృహములో సోకితే చాలు నేను ధన్యుడిని అవుతాను కదా.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=82&Padyam=1188

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Wednesday, June 15, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౬౭(567)

( శ్రుతదేవ జనకుల చరిత్రంబు ) 

10.2-1186-వ.
అట్టి లోకవిదితం బయిన భవద్వాక్యంబు నిక్కంబుగా భవదీయ పాదారవిందంబు లందు నొకానొకవేళ లేశమాత్రధ్యానంబుగల నా గృహంబున కకించనుండని చిత్తంబునం దలంపక భక్తవత్సలుండ వగుటంజేసి విజయం జేసితివి; భవత్పాదపంకేరుహ ధ్యానసేవారతిం దగిలిన మహాత్ములు త్వద్ధ్యానంబు వదలం జాలుదురే? నిరంతరంబును శాంతచిత్తులై నిష్కించనులై యోగీంద్రులై నీ వలనం గోరిక గలవారలకు నిన్నైన నిత్తువు గదా!” యని వెండియు నిట్లనియె.

భావము:
ఆ నీ మాట సార్థకం అయ్యేలా, నీ పాదపద్మాల మీద ఏదో రవంత భక్తి గల నన్నుదరిద్రుడని అనుకోకుండా నా యింటికి వచ్చావు. ఇది నీ భక్తవాత్సల్యానికి నిదర్శనం. నీ పాదసేవలో ఆనందించే మహాత్ములు దాన్ని వదలలేరు. ఎప్పుడూ శాంతస్వభావులై, నిష్కాములై, నీ యందు భక్తిగల యోగిశ్రేష్ఠులకు నిన్ను నీవు సమర్పించుకుంటావు కదా.” అని పలికి బహుళాశ్వుడు మరల ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=82&Padyam=1186

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Tuesday, June 14, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౬౬(566)

( శ్రుతదేవ జనకుల చరిత్రంబు ) 

10.2-1184-వ.
ఇట్లు సమర్పించి, యనంతరంబ యమ్మిథిలేశ్వరుండైన జనకుండు పరమానందంబును బొంది.
10.2-1185-చ.
హరిపదపద్మయుగ్మము నిజాంకతలంబునఁ జేర్చి యొత్తుచుం
"బురుషవరేణ్య! యీ నిఖిలభూతగణావలి యాత్మలందు సు
స్థిరమతిఁ గర్మసాక్షివి సుధీవర! నీ పదభక్తకోటితో
నరయ నుమాధినాథ చతురాస్యులుఁ బోలరటందు వెప్పుడున్.

భావము:
ఈవిధంగా కృష్ణాదులను పరమానందంగా గౌరవించి మిథిలానాథుడైన ఆ జనకచక్రవర్తి కృష్ణుని పాదాలను తన ఒడిలో ఉంచుకుని మెత్తగా ఒత్తుతూ అతనితో ఇలా అన్నాడు. “పురుషోత్తమా! జ్ఞాన స్వరూప! సమస్త ప్రాణుల ఆత్మల్లో కర్మసాక్షివై నీవు ఉంటావు. పార్వతీదేవి భర్త శంకరుడు, చతుర్ముఖుడైన బ్రహ్మదేవుడు వంటివారు అయినా నీ భక్తులకు సాటిరారని నీవంటూ ఉంటావు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=82&Padyam=1185

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Monday, June 13, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౬౫(565)

( శ్రుతదేవ జనకుల చరిత్రంబు ) 

10.2-1182-చ.
తిరముగ వారి యిష్టములుదీర్పఁ దలంచి మురాసురారి యొం
డొరుల కెఱుంగకుండ మునియూథముఁదానును నేఁగె వారి మం
దిరముల కేకకాలమున ధీరత నా ధరణీవరుండు వా
రిరుహదళాయతాక్షు మునిబృందములం గనకాసనంబులన్.
10.2-1183-సీ.
కూర్చుండ నియమించి, కొమరారు కాంచన-
  కలధౌత కలశోదకములచేతఁ
బాదముల్‌ గడిగి, తత్పావనజలములు-
  దానును సతియు బాంధవజనంబుఁ
గర మర్థి నిజమస్తకంబుల ధరియించి,-
  వివిధార్చనములు సద్విధి నొనర్చి,
మణిభూషణాంబర మాల్యానులేపన-
  రాజిత ధూప నీరాజనములు
10.2-1183.1-తే.
భక్తిఁ గావించి, పరిమృష్ట బహు విధాన్న
పాయసాపూప పరిపక్వఫలము లోలి
నారగింపఁగఁ జేసి, కర్పూరమిళిత
లలిత తాంబూలములు నెయ్య మలర నొసఁగె.

భావము:
శ్రీకృష్ణుడు వారి కోరిక నెరవేర్చాలనుకున్నాడు. ఒకరికి తెలియకుండా మరొకరి ఇంటికి మునులతో ఒకే సమయంలో వెళ్ళాడు. బహుళాశ్వుడు కృష్ణుడిని మునిసమూహాన్ని కనకాసనాలపై కూర్చుండబెట్టాడు. బంగారు ఆసనాలపై కూర్చుండ జేసి, బహుళాశ్వుడు బంగారు వెండి కలశాలలోని జలాలతో వారి పాదాలను కడిగాడు. తానూ తన భార్యా బంధువులూ ఆ పవిత్ర తీర్థాన్ని భక్తితో తమ శిరములపై జల్లుకున్నారు. బహుళాశ్వుడు వారిని శాస్త్రోక్తంగా పూజలు సత్కారాలు చేసాడు. మణిభూషణాలూ వస్త్రాలూ పూలదండలూ సుగంధలేపనాలూ వారికి సమర్పించాడు. భక్తితో హారతు లిచ్చాడు. తరువాత షడ్రసోపేతంగా భోజనంపెట్టి మధురఫలాలను అర్పించి పచ్చకర్పూరంతో కూడిన తాంబూలాన్ని ప్రేమతో ఇచ్చాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=82&Padyam=1183

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  శ్రీకృష్ణ విజయము - ౫౬౫(565)
( శ్రుతదేవ జనకుల చరిత్రంబు ) 

10.2-1182-చ.
తిరముగ వారి యిష్టములుదీర్పఁ దలంచి మురాసురారి యొం
డొరుల కెఱుంగకుండ మునియూథముఁదానును నేఁగె వారి మం
దిరముల కేకకాలమున ధీరత నా ధరణీవరుండు వా
రిరుహదళాయతాక్షు మునిబృందములం గనకాసనంబులన్.
10.2-1183-సీ.
కూర్చుండ నియమించి, కొమరారు కాంచన-
  కలధౌత కలశోదకములచేతఁ
బాదముల్‌ గడిగి, తత్పావనజలములు-
  దానును సతియు బాంధవజనంబుఁ
గర మర్థి నిజమస్తకంబుల ధరియించి,-
  వివిధార్చనములు సద్విధి నొనర్చి,
మణిభూషణాంబర మాల్యానులేపన-
  రాజిత ధూప నీరాజనములు
10.2-1183.1-తే.
భక్తిఁ గావించి, పరిమృష్ట బహు విధాన్న
పాయసాపూప పరిపక్వఫలము లోలి
నారగింపఁగఁ జేసి, కర్పూరమిళిత
లలిత తాంబూలములు నెయ్య మలర నొసఁగె.

భావము:
శ్రీకృష్ణుడు వారి కోరిక నెరవేర్చాలనుకున్నాడు. ఒకరికి తెలియకుండా మరొకరి ఇంటికి మునులతో ఒకే సమయంలో వెళ్ళాడు. బహుళాశ్వుడు కృష్ణుడిని మునిసమూహాన్ని కనకాసనాలపై కూర్చుండబెట్టాడు. బంగారు ఆసనాలపై కూర్చుండ జేసి, బహుళాశ్వుడు బంగారు వెండి కలశాలలోని జలాలతో వారి పాదాలను కడిగాడు. తానూ తన భార్యా బంధువులూ ఆ పవిత్ర తీర్థాన్ని భక్తితో తమ శిరములపై జల్లుకున్నారు. బహుళాశ్వుడు వారిని శాస్త్రోక్తంగా పూజలు సత్కారాలు చేసాడు. మణిభూషణాలూ వస్త్రాలూ పూలదండలూ సుగంధలేపనాలూ వారికి సమర్పించాడు. భక్తితో హారతు లిచ్చాడు. తరువాత షడ్రసోపేతంగా భోజనంపెట్టి మధురఫలాలను అర్పించి పచ్చకర్పూరంతో కూడిన తాంబూలాన్ని ప్రేమతో ఇచ్చాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=82&Padyam=1183

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Friday, June 10, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౬౪(564)

( శ్రుతదేవ జనకుల చరిత్రంబు ) 

10.2-1180-ఉ.
ఆ మునికోటికిన్ వినయ మారఁగ వందన మాచరించి, యా
తామరసాభలోచనుఁ, డుదారచరిత్రుఁడు, పాపగోత్ర సు
త్రాముఁడు, భక్తలోకశుభదాయకుఁ డైన రమేశు, సద్గుణ
స్తోముని పాదపద్మములు సోఁకఁగ మ్రొక్కి వినమ్రులై తగన్.
10.2-1181-చ.
కరములు మోడ్చి యో! పరమకారుణికోత్తమ! నీవు నీ మునీ
శ్వరులును మద్గృహంబునకువచ్చి మముం గృపసేసి యిచ్చటం
గర మనురక్తిఁ బూజనలు గైకొనుఁ డంచు నుతించి వేఁడ నా
హరి మనమందు వారివినయంబుల కెంతొ ప్రమోద మందుచున్.

భావము:
వారిద్దరూ వచ్చిన మునీంద్రు లందరికీ వినయంగా నమస్కారాలు చేసారు. పద్మాక్షుడూ, ఉదారచరిత్రుడూ, పాపాలనే పర్వతాల పాలిటి ఇంద్రునివంటివాడూ, భక్తులకు శుభాలను కలిగించేవాడూ, సద్గుణాలకు నిలయుడూ, సాక్షాత్తు లక్ష్మీపతి అయిన శ్రీకృష్ణుని పాదపద్మాలకు వినమ్రులై ప్రణామాలు చేశారు. “ఓ దయాసాగరా! నీవూ ఈ మునీశ్వరులూ మా గృహానికి వచ్చి మమ్ము అనుగ్రహించాలి మా పూజలు మీరు స్వీకరించాలి.” అని బహుళాశ్వ శ్రుతదేవులు చేతులు జోడించి కృష్ణుడిని ప్రార్థించారు, వారి వినయ స్వభావానికి శ్రీకృష్ణుడు ఎంతో సంతోషించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=82&Padyam=1181

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Thursday, June 9, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౬౩(563)

( శ్రుతదేవ జనకుల చరిత్రంబు ) 

10.2-1179-వ.
అట్లు కృష్ణుండు వారల జూచువేడ్క నిజ స్యందనారూఢుండై, నారద, వామదేవాత్రి, కృష్ణ, రామ, సితారుణ, దివిజగురు, కణ్వ, మైత్రేయ, చ్యవనులును, నేనును మొదలైన మును లనుగమింపం జనుచుఁ దత్తద్దేశ నివాసులగు నానర్తక, ధన్వ, కురుజాంగల, వంగ ,మత్స్య, పాంచాల, కుంతి, మధు, కేకయ, కోస లాది భూవరులు, వివిధ వస్తుప్రచయంబులు గానిక లిచ్చి సేవింప, గ్రహమధ్యగతుండై దీపించు సూర్యునిం బోలి, యప్పుండరీకాక్షుండు మందస్మిత సుందరవదనారవిందుం డగుచు వారలం గరుణార్ద్రదృష్టిం జూచి, యోగక్షేమంబులరసి, సాదరభాషణంబుల నాదరించుచుఁ, గతిపయ ప్రయాణంబులం జనిచని విదేహనగరంబు డాయంజనుటయు; నా బహుళాశ్వుండు నమ్మాధవు రాక విని మనంబున హర్షించుచు వివిధపదార్థంబులు గానికలుగాఁగొని, తానును శ్రుతదేవుండును నెదురుగాఁ జనుదెంచి; యప్పుడు.

భావము:
శ్రీకృష్ణుడు ఆ బహుళాశ్వుడు శ్రుతదేవుడులను చూడాలన్న ఉత్సాహంతో రథాన్ని ఎక్కి ద్వారక నుంచి మిథిలానగరానికి బయలుదేరాడు. అతని కూడా వామదేవుడు, అత్రి, కృష్ణద్వైపాయనుడు, పరశురాముడు, అసితుడు, అరుణుడు, బృహస్పతి, కణ్వుడు, మైత్రేయుడు, చవనుడు మున్నగు మునిముఖ్యులూ వెళ్ళారు. వారిలో నేనూ ఉన్నాను. మార్గంలో అనర్తము, కేకయ, కురుజాంగలము, ధన్వము, వంగ, మత్స్య, పాంచాలము, కుంతి, మధు, కోసల మున్నగు దేశాల ప్రభువులు కృష్ణుడికి నానావిధాలైన కానుకలు బహూకరించి సేవించారు. గ్రహాలనడుమ ప్రకాశించే సూర్యుడిలా కృష్ణుడు మందహాసంచేస్తూ వారందరి మీద కరుణార్ద్ర దృష్టులను ప్రసరింపచేస్తూ వారి యోగక్షేమాలు విచారించాడు. వారితో ఆప్యాయంగా మట్లాడాడు. ఆ తరువాత కొన్నాళ్ళు ప్రయాణంచేసి మిథిలానగరాన్ని చేరాడు. శ్రీకృష్ణుని రాక తెలిసి బహుళాశ్వుడు చాలా ఆనందించాడు. వివిధ పదార్థాలను తీసుకుని అతడు శ్రుతదేవునితోపాటు శ్రీకృష్ణుడిని ఆహ్వానించడానికి ఎదురువచ్చాడు. అప్పుడు...

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=82&Padyam=1179

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :