Friday, June 17, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౬౯(569)

( శ్రుతదేవ జనకుల చరిత్రంబు ) 

10.2-1189-వ.
అని యభ్యర్థించినం బ్రసన్నుండై యప్పుండరీకాక్షుండు నిమికుల ప్రదీపకుండైన జనకచక్రవర్తిం గరుణించి, యమ్మిథిలానగరంబునం బౌరజనంబులకు నున్నత శోభనంబులు గావించుచుం గొన్నిదినంబు లుండె; నంత.
10.2-1190-మ.
శ్రుతదేవుండును మోదియై మునిజనస్తోమంబుతో నిందిరా
పతిఁ దోకొంచు నిజాలయంబునకు నొప్పన్నేగి, యచ్చోట స
మ్మతి దర్భాస్తరణంబులన్నునిచి, సమ్యగ్జ్ఞానపారీణుఁడై
సతియుం దానుఁ బదాబ్జముల్‌ గడిగి చంచద్భక్తిఁ దత్తోయముల్‌.

భావము:
ఈ రీతిని నిమి వంశోద్ధారకుడు అయిన జనకుడు వేడగా శ్రీకృష్ణుడు అతని భక్తికి ప్రసన్నుడై మిథిలానగరంలో ప్రజలకు ఆనందాన్ని కలిగిస్తూ కొన్నాళ్ళ పాటు అక్కడే ఉన్నాడు. అంతట శ్రుతదేవుడు కూడ పరమానందంతో శ్రీకృష్ణుడిని మునులనూ తన ఇంటిలోకి తీసుకు వెళ్ళాడు. వారికి దర్భాసనాలు ఇచ్చి అతడు, అతని భార్యా వారి పాదపద్మాలను కడిగి, ఆ నీటిని...

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=82&Padyam=1190

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

No comments: